అగ్రిస్టాక్‌ అమలులో తెలంగాణ భేష్

– తొలి మైలురాయి దాటినందుకు రూ.175 కోట్ల ప్రోత్సాహకం 
– డిజిటల్ వ్యవసాయంలో రాష్ట్రం అగ్రగామి
– వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఆగస్టు 31 : అగ్రిస్టాక్ ఆధారిత డిజిటల్ వ్యవసాయ వ్యవస్థ అమలులో రాష్ట్రం మరో కీలక మైలురాయిని సాధించింది. రైతులకు మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందించేందుకు చేపట్టిన అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థలో తొలి మైలురాయిని విజయవంతంగా దాటినందుకు కేంద్ర ప్రభుత్వం రూ.175 కోట్ల ప్రోత్సాహక నిధులు మంజూరు చేయడానికి ఆమోదం తెలిపింది. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆగస్టు 31న జారీ చేసిన లేఖలో రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదికను పరిశీలించి, నిర్దేశించిన ప్రమాణాలను పూర్తి చేసిన‌ట్లు ధ్రువీకరించింది. దీనితో స్పెష‌ల్ అసిస్టెన్స్ టుస్టేట్స్ ఫ‌ర్‌ కాపిట‌ల్ ఇన్వెస్ట్‌మెంట్ (సాసి) 2026-27 కింద తెలంగాణకు ఈ నిధులు లభించనున్నాయి.

అత్యంత పారదర్శకంగా పంపిణీ

గతంలోనే ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేసినందుకుగాను కేంద్రం తెలంగాణకు రూ.424 కోట్ల ప్రోత్సాహకం అందించగా, తాజాగా లభించిన రూ.175 కోట్లతో కలిపి రాష్ట్రానికి భారీగా నిధులు సమకూరాయి. అగ్రిస్టాక్ ద్వారా రైతుల వివరాలు, భూమి, పంటలు, ఎరువుల పంపిణీ డిజిటల్‌గా అనుసంధానం కావడం వల్ల నిజమైన రైతులకు లబ్ధి చేకూరడంతో పాటు ఎరువుల పక్కదారి పట్టకుండా సమర్థవంతంగా పర్యవేక్షించవచ్చని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ‌ మంత్రి తుమ్మల తెలిపారు.

కేంద్ర కేటాయింపుల వివరాలు:

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ నేడు జారీ చేసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ప్రతిపాదనను పరిశీలించి రాష్ట్రం నిర్దేశించిన ప్రమాణాలు, నిబంధనలను పూర్తి చేసిందని పేర్కొంది. దీంతో ‘సాసి’ 2026-27లో భాగంగా రూ.175 కోట్ల ప్రోత్సాహకానికి తెలంగాణ అర్హత సాధించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. సాసి’ పార్ట్-VII (డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) విభాగంలో మొత్తం రూ.13,000 కోట్లు కేటాయించగా, అగ్రిస్టాక్ ఆధారిత ప్రాధాన్య వినియోగ సందర్భాలు కోసం రూ.10,000 కోట్లు కేటాయించారు. అందులో అగ్రిస్టాక్ ఆధారిత ఎరువుల పంపిణీ వ్యవస్థ కోసం రూ.5,000 కోట్లు ప్రత్యేకంగా కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ డిజిటల్ వ్యవసాయంలో తెలంగాణను దేశంలోనే ముందంజలో ఉంచేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్రం నుంచి వరుసగా లభిస్తున్న ఈ ప్రోత్సాహకాలు నిదర్శనమని అన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *