యాదాద్రి’కి ‘మహానది’ బొగ్గు కేటాయించాలి

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి తుమ్మల భేటీ
– రాష్ట్ర అభివృద్ధి పనులపై వినతిపత్రాలు అందజేత

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16 : యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి కోరిన విధంగా మహానది కోల్‌ఫీల్డ్స్ నుంచి బొగ్గు కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో కేంద్ర మంత్రితో ఆయన మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, పెండింగ్ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. సత్తుపల్లి బ్లాక్-3 బొగ్గు బ్లాక్‌ను సింగరేణి సంస్థకే కేటాయించాలని కోరారు. అలాగే తెలంగాణ రైతులకు యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగూడెం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి కోల్ ఇండియా సీఎసఆర్ నిధుల నుంచి రూ.100 కోట్లు మంజూరు చేయాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, సత్తుపల్లి-కొవ్వూరు, పెనుబల్లి-కొండపల్లి రైల్వే లైన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పాండురంగాపురం-మల్కన్‌గిరి రైల్వే లైన్‌ను సారపాక వరకు త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని ఆయన కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *