– తెలంగాణకు తీరని ద్రోహం
– మన ప్రాజెక్టులు ఎండిపోతున్నాయ్
– కేఆర్‌ఎంబీ ప్రేక్షకపాత్ర
– తక్షణమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించాలి
– బీఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చోద్యం చూస్తున్నారని బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు ధ్వజమెత్తారు. ఏపీ అడ్డగోలుగా నీటి దోపిడీకి పాల్పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపకపోవడం తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎ క్స్’ వేదికగా ప్రకటన విడుదల చేశారు. ఆ పోస్టులో రాష్ట్ర ప్రభుత్వం, కేఆర్‌ఎంబీ తీరును ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నీటి కేటాయింపులు లేకున్నా వరద జలాలు రాకున్నా.. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం బేసిన్ దాటి కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి చోద్యం చూస్తూ తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్నారన్నారు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాగునీటి కష్టాలు తీవ్రమవుతుంటే మరోవైపు ఏపీ ప్రభుత్వం తెలంగాణ నీటి హక్కులపై దండెత్తి కృష్ణా జలాలను అడ్డగోలుగా తరలిస్తోందని ఆరోపించారు. కృష్ణా బేసిన్‌లో భాగమైన బీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు నీళ్లు లేక ఆయకట్టులు ఎండిపోతుంటే మరోవైపు బేసిన్‌తో సంబంధం లేని ప్రాంతాలకు ఏపీ నిబంధనలు ఉల్లంఘిస్తూ యథేచ్ఛగా నీటిని తరలిస్తోందన్నారు. మాల్యాల, ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్ కుడి కాల్వ.. ఇప్పుడు వెలిగొండ.. ఇలా తెలంగాణ వాటా నీటిని ఏపీ తరలిస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన ప్రశ్నించారు. రంగారెడ్డి, పాలమూరు, నల్లగొండ సహా తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తున్నదన్నారు. తెలంగాణకు దక్కాల్సిన కృష్ణా నీళ్లను మన పొలాలకు మళ్లించాల్సిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీకి పరోక్షంగా ఎందుకు సహకరిస్తున్నారని నిలదీశారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి వినియోగాన్ని పర్యవేక్షించాల్సిన కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సైతం పట్టనట్లు వ్యవహరించడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడాల్సిన సంస్థే ప్రేక్షకపాత్ర పోషిస్తే రాష్ట్ర నీటి హక్కులను ఎవరు కాపాడాలి అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీనిపై వెంటనే స్పందించాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. కేఆర్‌ఎంబీపై ఒత్తిడి తెచ్చి తెలంగాణలోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను నింపి, ఆయకట్టుకు నీటి సరఫరా జరిగేలా చూడాలని బీఆర్‌ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





