గద్వాల స్టేషన్‌ అభివృద్ధికి ప్రాధాన్య‌త‌

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
– జోగులాంబ ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు

గద్వాల/అలంపూర్, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్టు 31  : రాష్ట్రంలో రైల్వే మౌలిక వసతుల కల్పనకు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నామ‌ని, ఈ రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తున్నామ‌ని చెప్పారు. గత 12 ఏళ్లుగా రైల్వే స్టేషన్లకు సంబంధించి అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గద్వాల రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమ‌వారం పరిశీలించిన అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైల్వే ప్రమాదాలు, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం, రైల్వే అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు. 2009 నుంచి 2014 వరకు 87 కి.మీ మేర కొత్త రైల్వే లైన్లు వేశారని, 2014 నుంచి ఇప్పటివరకు 888 కి.మీ నూతన లైన్లు వేసిన‌ట్లు తెలిపారు.  తెలంగాణలో రూ.50 వేల కోట్ల విలువైన 21 రైల్వే ప్రాజెక్టులు నడుస్తున్నాయని, రూ.108 కోట్లతో గద్వాల స్టేషన్ నవీకరణతోపాటు రూ.66 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జి మంజూరైందని వెల్లడించారు. భవిష్యత్తులో విమానాశ్రయం తరహాలో ప్లాట్‌ఫామ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లతో ఈ స్టేషన్‌ను ఆధునీకరిస్తున్నామని, 2027 ఏప్రిల్ నాటికి పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు. తెలంగాణలో కొత్తగా 100కు పైగా కొత్త రైళ్లు తీసుకొచ్చామని, రైల్వే నెట్ వర్క్ సిద్దిపేట లైన్ మినహా దాదాపు విద్యుదీకరణ పూర్తయిందని, 174 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ వైఫై సేవలు అందిస్తున్నామ‌ని చెప్పారు. రైల్వే అభివృద్ధిలో భాగంగా తెలంగాణలో 5 వందేభారత్ రైలు సేవలు అందిస్తున్నాయని, వందే భారత్ రైలు గద్వాలలో హాల్టింగ్ విషయంలో ప్రయత్నం చేస్తామ‌ని హామీ ఇచ్చారు.

రైల్వే అభివృద్ధికి ప్రాధాన్యం

రాష్ట్రవ్యాప్తంగా 42 స్టేషన్లను అమృత్ భారత్ పథకం కింద నవీకరిస్తుస్తుండ‌గా  174 స్టేషన్లలో ఉచిత హైస్పీడ్ వైఫై, ప్రమాద రహిత ప్రయాణం కోసం ‘కవచ్’ సాంకేతికతను అందుబాటులోకి తెచ్చామన్నారు. రాష్ట్రంలో 5 వందే భారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయని, గద్వాలలో వందే భారత్ హాల్టింగ్ కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దేశంలో ప్రకటించిన 7 బుల్లెట్ రైలు మార్గాల్లో 3 తెలంగాణకు కేటాయించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రమైన గద్వాలకు రైలు కనెక్టివిటీ మరింత పెంచుతామని, 34 రైళ్లు ఈ స్టేషన్ నుంచి వెళ్తుండ‌గా రైల్వే అభివృద్ధి పూర్తయ్యాక మరిన్ని రైళ్లు ఆపే అవకాశం ఉందన్నారు. అష్టాదశ శక్తి పీఠాలలో ఒక‌టైన‌ అలంపూర్ జోగులాంబ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని జోగులాంబ రైల్వే గేట్ వద్ద రూ.45 కోట్లతో ఆర్వోబీ నిర్మించనున్నట్లు తెలిపారు.

జోగులాంబ అమ్మ‌వారి ద‌ర్శ‌నం

అంతకుముందు కిషన్ రెడ్డి అలంపూర్ క్షేత్రంలో శ్రీ జోగులాంబ అమ్మవారు, స్వయంభూ బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకం నిర్వహించారు. వేద పండితులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికి వేదాశీర్వచనం అందించారు. తొలుత బాల బ్రహ్మేశ్వర స్వామి వారి మూలవర్లకు అర్చకులు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన త్రిశతి అర్చనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి దివ్య కృపతో రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో తులతూగాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆకాంక్షించారు.

రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధికి అంకితభావంతో కృషి

మహబూబ్‌నగర్ : తెలంగాణలో 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేస్తున్నామని, ఈ రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులను కల్పిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ రైల్వే స్టేషన్ పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నూతన రైళ్లు, నూతన రైల్వే ట్రాకులు, డబ్లింగ్, ట్రిప్లింగ్, క్వాడ్రప్లింగ్ పనులను మోదీ ప్రభుత్వం చేపట్టిందని, గత పదేళ్లుగా రైల్వే స్టేషన్లకు సంబంధించి అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రైల్వే నెట్‌వర్క్ అభివృద్ధికి కేంద్రం అంకితభావంతో కృషి చేస్తోందని వివరించారు. సికింద్రాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు లైన్ డబ్లింగ్ పనులు పూర్తయ్యాయని, ఇక్కడినుంచి కర్నూలు వరకు డబ్లింగ్ పనులు పూర్తికానున్నాయని చెప్పారు. అలాగే దేవరకద్ర నుంచి కృష్ణ వరకు నూతన రైల్వే లైన్ అభివృద్ధి చేశామన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని షాద్‌నగర్, జడ్చర్ల, గద్వాల నగరాల్లో రైల్వే స్టేషన్లను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రైల్వేల్లో పరిశుభ్రతకు పెద్ద పీట వేసి, రైల్వే స్టేషన్లను తీర్చిదిద్దుతున్నామని, ఇందులో ప్రయాణికులు కూడా భాగస్వామ్యం అయితేనే స్వచ్ఛ రైల్వే సాధ్యపడుతుందని అన్నారు. రెండో దశలో మిగిలిన రైల్వే స్టేషన్లను కూడా భారీగా అభివృద్ధి చేస్తామని, ప్రతి స్టేషన్ విమానాశ్రయం లాగా ఉండాలని మోదీ చెబుతుంటారని తెలిపారు. తెలంగాణలో ప్రజలకు మంచి సౌకర్యాలు కల్పించి, ప్రజల్లో రైల్వేలపై నమ్మకం కలిగించి, రైల్వే ప్రయాణాలు చేసేలా ప్రోత్సహించేందుకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక హైస్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్ తీసుకొస్తోందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ నుంచి చైన్నై వంటి నగరాలకు చాలా వేగంగా చేరుకోవచ్చునని అన్నారు. బుల్లెట్ రైలు వస్తే తెలంగాణలో అభివృద్ధి పెరుగుతుందని, పరిశ్రమలతోపాటు పర్యాటకులు పెరుగుతారని, బుల్లెట్ రైలు తెలంగాణకు సువర్ణాధ్యాయం అని చెప్పొచ్చని అన్నారు. కాజీపేటలో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పూర్తి కానుందని, అంతర్జాతీయ స్థాయిలో కొత్త రైళ్ల ఉత్పత్తి ఇక్కడ జరగనుందని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *