కృత్రిమ మేధ వినియోగానికి ‘టెక్ టీమ్’

– నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణలో ఏఐ వాడాలి
– అధికారుల సమావేశంలో డీజీపీ ఆనంద్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : నేర పరిశోధన, శాంతిభద్రతల పరిరక్షణతోపాటు పోలీసింగ్ సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)ను విస్తృతంగా ఉపయోగించాలని డీజీపీ సి.వి.ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో ప్రత్యేక ‘టెక్ టీమ్’ (సాంకేతిక బృందం) ఏర్పాటు చేసిన సందర్భంగా శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. డీజీ (టెక్నికల్ సర్వీసెస్) వి.వి.శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్న సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పోలీసు అధికారిక వెబ్‌సైట్, హాక్‌ఐ, సీసీటీఎన్ఎస్, హెచ్ఆర్ఎంఎస్ వంటి అన్ని ప్రధాన సాంకేతిక ప్లాట్‌ఫారమ్‌లను డీజీపీ కార్యాలయం పరిధిలోకి తీసుకొచ్చి ఒకే ఉమ్మడి వ్యవస్థ కింద పనిచేయవలసిన అవసరం ఉందన్నారు. అధికారుల బదిలీలు లేదా మార్పులతో సంబంధం లేకుండా ఈ సాంకేతిక కార్యక్రమాలు నిరంతరాయంగా సాగేందుకు వీలుగా డీజీపీ కార్యాలయంలో శాశ్వత ప్రాతిపదికన ఈ టెక్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సాంకేతికతపై ఆసక్తి ఉండి స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకు వచ్చే యువ పోలీసు సిబ్బందిని ఈ బృందంలో చేర్చుకుంటామని, దీనివల్ల వారు సరికొత్త ఏఐ వ్యవస్థలను నేర్చుకోవడంతోపాటు వాటి అభివృద్ధిలో చురుగ్గా భాగస్వాములు కాగలరని పేర్కొన్నారు. అదనపు డేటా లేయర్లను వేగంగా అనుసంధానించేందుకు వీలుగా ఒక కేంద్రీకృత హై-స్పీడ్ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే పోలీస్ శాఖ చేపట్టే అన్ని కృత్రిమ మేధ సంబంధిత ప్రాజెక్టులను పర్యవేక్షించేందుకు డీజీపీ¾ కార్యాలయంలో ‘మార్వెల’ తరహాలో ఒక ప్రత్యేక ఏఐ టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుతమున్న సీసీటీఎనఎస్, హెచఆరఎంఎస్ వంటి వివిధ వ్యవస్థలను అనుసంధానిస్తూ ‘టీఎస్-కాప్స’ పేరిట ఒకే ఉమ్మడి మొబైల్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించాలని, దీని ద్వారా సిబ్బంది ఒకే మొబైల్ ఇంటర్‌ఫేస్ ద్వారా వివిధ అప్లికేషన్లను యాక్సెస్ చేసే వీలుంటుందని ఆయన తెలిపారు. ఏఐ ఆధారిత ప్లాట్‌ఫాంలైన సీసీటీఎనఎస్ 2.0 సమర్థవంతమైన అమలుకు, డేటా ఆధారిత డ్యాష్‌బోర్డుల రూపకల్పనకు ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటితోపాటు ఫైళ్ల కదలికలను నిరంతరాయంగా పర్యవేక్షించేందుకు వీలుగా డీజీపీ ఎస్టాబ్లిష్‌మెంట్ పరిధిలోని అన్ని కార్యాలయాలను ‘ఈ-ఆఫీస’ సిస్టమ్‌తో అనుసంధానించాలన్నారు. సాంకేతిక కార్యక్రమాలు కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ఆచరణాత్మక ఫలితాలను ఇచ్చేలా ఉండాలని స్పష్టం చేశారు. ఈ ఏఐ ఆధారిత ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేసేందుకు వీలుగా ఐదుగురు ఐపీఎస్ అధికారులతో కూడిన ఒక ప్రత్యేక కోర్ టీమ్‌ను డీజీపీ ఏర్పాటు చేశారు. రాబోయే ఆరు నెలల్లోగా కీలక ప్లాట్‌ఫాంలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా ఉండాలని సూచించారు. ఇందులో భాగంగా హైదరాబాద్ జాయింట్ సీపీ ఎన్.శ్వేతకు సీసీటీఎనఎస్ 2.0 అభివృద్ధి, హెచ్ఆర్ఎంఎస్ పర్యవేక్షణ, సీఐడీ విభాగంతో సమన్వయ బాధ్యతలను అప్పగించారు. డీఐజీ ఆర్.భాస్కరన్‌కు సీసీటీఎన్ఎస్ ప్రాజెక్టులో ఏఐ సాంకేతికతను అనుసంధానించే బాధ్యతను, డీసీపీ (ఎస్ఎమ్ అండ్ ఐటీ) చెన్నూరి రూపేష్‌కు సోషల్ మీడియా, వీడియో అనలిటిక్స్, ఏఐ ఆధారిత డ్రోన్ టెక్నాలజీస్ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. ఎస్పీ కె.అపూర్వరావుకు డేటా ఇంటెలిజెన్స్, శిక్షణ కార్యక్రమాలు, సిస్టమ్ డిజైనింగ్ బాధ్యతలను అప్పగించగా అవినాష్ మొహంతి ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ (రహదారి భద్రత) మాడ్యూళ్లను పర్యవేక్షిస్తారని డీజీపీ ఆనంద్ వివరించారు. సమావేశంలో హైదరాబాద్ జాయింట్ సీపీ శ్వేత, సీఐ సెల్ డీఐజీ భాస్కరన్, ఎస్పీ అపూర్వరావు, డీసీపీ రూపేష్‌లతోపాటు సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *