ఏపీకి నీళ్లు.. పాలమూరు రైతులకు కన్నీళ్లు

‌‌- ఎల్ నినో పేరుతో నీటి తరలింపు
– ఆరుగంటలు మాత్రమే విద్యుత్ సరఫరా
– లోవోల్టేజీ కారణంగా కాలిపోతున్న మోటార్లు
– ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోరు?
– బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆగ్రహం

వనపర్తి,  ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : ఏపీకి వంద టీఎంసీల నీళ్లు.. పాలమూరు రైతులకు కన్నీళ్లేనా ప్రకృతి అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ పాలమూరు రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ ఆరోపించారు. ఎల్నినో పేరుతో ఆంధ్రప్రదేశ్‌కు సాగునీటిని తరలిస్తున్నారని విమర్శించారు. ఏపీకి నీళ్లు వెళ్తున్నప్పుడు తెలంగాణకు ఎందుకు నీరు అందడం లేదని ప్రశ్నించారు.కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందడంతో శనివారం కేటీఆర్‌ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం పెబ్బేరు మండలంలోని గుమ్మడం, చెలిమిల విద్యుత్‌ సబ్‌స్టేషన్లను సందర్శించి లాగ్‌ రిజిస్టర్లను పరిశీలించారు. వ్యవసాయ విద్యుత్‌ సరఫరా పరిస్థితులను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెబ్బేరు మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ వ్యవసాయానికి ఆరు గంటలకు మించి విద్యుత్‌ సరఫరా కావడం లేదని రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని కేటీఆర్‌ తెలిపారు. లోఓల్టేజీ, తరచూ విద్యుత్‌ కోతల కారణంగా వ్యవసాయ మోటార్లు కాలిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని పేర్కొన్నారు. వరదల సమయంలో నీటిని మళ్లించి చెక్‌డ్యామ్‌లు, చెరువులను నింపినట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 7 వేల మెగావాట్లుగా ఉన్న విద్యుత్‌ స్థాపిత సామర్థ్యాన్ని 24 వేల మెగావాట్లకు పెంచామని కేటీఆర్‌ పేర్కొన్నారు. పోతిరెడ్డిపాడు, వెలిగొండ మార్గాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు నీరు తరలిస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. జూరాలకు ఎగువ నుంచి నీటి ప్రవాహం లేదని అధికారులు చెబుతున్నారని, దీంతో కాలువలకు నీటి విడుదల నిలిచిపోయిందని తెలిపారు. అయితే మరోవైపు ఏపీకి నీరు వెళ్తుంటే తెలంగాణకు ఎందుకు నీరు అందడం లేదని ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపులను తరచూ ఆన్‌, ఆఫ్‌ చేయడం వల్ల రైతులకు ప్రయోజనం ఉండదని, పంపులను ప్రారంభించిన తర్వాత నిరంతరాయంగా నడపాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, జిల్లాలోనే రైతులు సాగునీరు, విద్యుత్‌ కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగడం లేదని కేటీఆర్‌ ఆరోపించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు తమ ప్రాజెక్టుల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. ఆలమట్టి ఎత్తు పెంపు అంశంపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, దీనివల్ల భవిష్యత్‌లో పాలమూరుకు నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో పాలమూరు ప్రాంతానికి రావాల్సిన వాటా దక్కే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి ప్రజాతీర్పు కోరాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న అధికార పక్షం వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జీవన్‌రెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, బీఆర్ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌, వనపర్తి పట్టణ అధ్యక్షుడు పలుస రమేష్‌గౌడ్‌, మీడియా కన్వీనర్‌ నందిమల్ల అశోక్‌, జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *