– దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా 10 శాతానికి పెంచే దిశగా ప్రణాళిక
– ప్రైవేట్, సంస్థాగత పెట్టుబడుల సమీకరణ వైపు అడుగులు
– క్యూర్, ప్యూర్, రేర్ విధానంతో సమతుల్య అభివృద్ధి
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
న్యూదిలీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19 : వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దేశం నిర్దేశించుకున్న భారీ ఆర్థిక లక్ష్యాలను తక్షణ కార్యాచరణ బాధ్యతగా తెలంగాణ భావిస్తోందని పేర్కొన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో దిల్లీలో శనివారం జరిగిన ‘వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి ఆర్థిక వనరుల సమీకరణ’ సదస్సులో ఆయన ప్రసంగించారు. డిప్యూటీ సీఎంతోపాటు రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. దేశం కనీవినీ ఎరుగని అభివృద్ధి సాధించేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమకూర్చు కుంటూనే ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం, ఉత్పాదకతను పెంచడం, అభివృద్ధి ఫలాలను ప్రతి పౌరుడికి, ప్రతి ప్రాంతానికి అందించడం ప్రధాన సవాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణాన్ని కేంద్రం లేదా రాష్ట్రాలు విడివిడిగా సాధించలేవని, సహకార సమాఖ్య స్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ కేవలం నిధులను కోరేందుకు కాక స్పష్టమైన అభివృద్ధి ప్రణాళిక, ఆర్థిక వనరుల సమీకరణకు నిర్దిష్ట విధానం, దీర్ఘకాలిక లక్ష్యంతో ఈ చర్చలో భాగస్వామ్యమవుతున్నదని తెలిపారు.
మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
తెలంగాణ బలమైన ఆర్థిక పునాదులతో తదుపరి దశ వృద్ధికి సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం తెలిపారు. 2025-26లో రాష్ట్ర జీఎస్డీపీ రూ.17.82 లక్షల కోట్లకు చేరిందని, ప్రస్తుత ధరల ప్రకారం 10.7 శాతం వృద్ధి నమోదైందని చెప్పారు. స్థిర ధరల ప్రకారం వాస్తవ జీఎస్డీపీ వృద్ధి 8.5 శాతంగా అంచనా వేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, ఇది జాతీయ సగటు రూ.2,19,575తో పోలిస్తే దాదాపు రెండింతలని వివరించారు. సేవల రంగం 13.5 శాతం, ద్వితీయ రంగం 9.4 శాతం వృద్ధి సాధించాయన్నారు. ప్రస్తుత వృద్ధి పథంలో కొనసాగితే 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ 1.21 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా ఉందని, అయితే అంతకంటే పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న లక్ష్యం రాష్ట్రానికే పరిమితమైనది కాదని, 2047 నాటికి సుసంపన్నమైన, స్వావలంబనతో కూడిన వికసిత్ భారత్ నిర్మాణానికి తెలంగాణ అందించే భాగస్వామ్యమని భట్టి పేర్కొన్నారు. సదస్సులో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, ఆర్థిక నిపుణులు పాల్గొన్నారు.
ప్రైవేట్ పెట్టుబడుల సమీకరణకు ప్రాధాన్యం
మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించాలంటే మౌలిక వసతులకు నిధులు సమకూర్చే విధానంలో మార్పు అవసరమని విక్రమార్క పేర్కొన్నారు. రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వ రుణాలపైనే అధికంగా ఆధారపడే పద్ధతి నుంచి క్రమంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ పెట్టుబడులు, సంస్థాగత నిధులు, సావరిన్ ఫండ్స్ నుంచి అధిక మొత్తంలో పెట్టుబడులను సమీకరించి ప్రభుత్వ నిధులను వ్యూహాత్మకంగా వినియోగించే నమూనా వైపు తెలంగాణ అడుగులు వేస్తోందన్నారు. ప్రాజెక్టుల్లో పెట్టుబడిదారుల రిస్క్‌ను తగ్గించడం, వయబిలిటీ గ్యాప్‌లను పూడ్చడం, ప్రైవేట్ పెట్టుబడులకు విశ్వాసం కల్పించడం వంటి అంశాల్లో ప్రభుత్వ నిధులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఇందుకోసం పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు గ్రీన్ బాండ్లు, బ్లెండెడ్ ఫైనాన్స్ వంటి మార్గాలను బలోపేతం చేస్తున్నట్లు చెప్పారు.
క్యూర్, ప్యూర్, రేర్‌తో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి
అభివృద్ధి ఒకే నగరానికి పరిమితం కాకూడదని, అదే సమయంలో గ్రామీణ ప్రాంతాలు వెనుకబడకూడదన్న లక్ష్యంతో క్యూర్, ప్యూర్, రేర్ పేరుతో మూడు పరస్పర అనుసంధానిత ఆర్థిక ప్రాంతాలతో ప్రత్యేక అభివృద్ధి నమూనాను రూపొందించినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ కేంద్రంగా క్యూర్(కోర్ అర్బన్ రీజియన్)ను అత్యున్నత సేవలు, కృత్రిమ మేధ, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, ఫిన్‌టెక్, లైఫ్ సైన్సెస్, నాలెడ్జ్ ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాన రవాణా మార్గాల వెంట ప్యూర్(పెరి అర్బన్ రీజియన్)ను పారిశ్రామిక, తయారీ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దనున్నట్లు, రేర్(రూరల్ అగ్రికల్చరల్ అండ్ రిసోర్సు ఎకానమీ) ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు తీసుకురానున్నట్లు తెలిపారు. వ్యవసాయంలో డిజిటల్ సాంకేతికత వినియోగం, ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్ల విస్తరణ, కోల్డ్ చైన్ వ్యవస్థల ఏర్పాటు ద్వారా గ్రామీణ ఉత్పత్తిదారులను అధిక ఆదాయం అందించే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానించనున్నట్లు చెప్పారు.
30 వేలకుపైగా ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ
భవిష్యత్ నగరాలకు నమూనాగా 30 వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు భట్టి తెలిపారు. దేశంలో తొలి నెట్-జీరో, ఏఐ ఆధారిత గ్రీన్ మెగాసిటీగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాలు, క్లీన్ టెక్నాలజీ పార్కులు, పర్యావరణహిత నివాస ప్రాంతాలు ఇందులో భాగంగా ఉంటాయని వివరించారు. క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాలను అనుసంధానించే కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో రీజినల్ రింగ్ రోడ్డు ప్రధానమైనదన్నారు.
యువతే తెలంగాణకు అతిపెద్ద బలం
మÖడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు మౌలిక వసతులు, పెట్టుబడులతోపాటు మానవ వనరులే అసలైన పునాది అని, యువతే రాష్ట్రానికి అతిపెద్ద బలమని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఉన్నత విద్యకు, పరిశ్రమల అవసరాలకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ప్రముఖ అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సామాజిక భద్రత, అందుబాటులో వైద్యం, నాణ్యమైన గృహ వసతి, మహిళా పారిశ్రామికవేత్తలు, స్వయం సహాయక సంఘాలకు మద్దతు ద్వారా అభివృద్ధిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలన్నదే తమ విధానమన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





