పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలి

– గోదావరిఖని, పెద్దపల్లి, రామగుండంలో పరిస్థితిపై మంత్రి దుద్దిళ్ల వీసీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 30: గోదావరిఖని, పెద్దపల్లి, సింగరేణి ఏరియాల్లో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలు కాలనీలు జలమయమైన నేపథ్యంలో సహాయక, పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్, సింగరేణి సీఎండీ, ఎన్‌టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, జెన్‌కో సీఎండీ, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆరఎఫ్‌సీఎల్) అధికారులు, రామగుండం పోలీసు కమిషనర్ తదితర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని గురువారం సమీక్షించారు. రామగుండం పారిశ్రామికవాడలో నిలిచిన వరద నీరు బయటకు వెళ్లేందుకు నాలాల్లో ఉన్న ఆటంకాలను తొలగించాలని మంత్రి ఆదేశించారు. వరద సహాయక చర్యల్లో సింగరేణి, ఎన్‌టీపీసీ అధికారులు చురుగ్గా పాల్గొని జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని కోరారు. వీర్లపల్లి గ్రామంలో నివాస ప్రాంతాలు జలమయమైన నేపథ్యంలో గ్రామంలోకి వరద నీరు చేరకుండా ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామస్తులు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేలా ఇంటి స్థలాల పట్టాలు అందజేసే ప్రక్రియను వేగవంతం చేయాలని పెద్దపల్లి కలెక్టర్‌కు సూచించారు. గోదావరిఖనిలో వరద తీవ్రత అధికంగా ఉన్నందున మున్సిపల్, రెవెన్యూ శాఖలకు పోలీసులు పూర్తి సహకారం అందించాలని రామగుండం పోలీసు కమిషనర్‌కు ఆదేశించారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రామగుండంలో విపత్తు నివారణ బృందాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లాలోని 1,021 చెరువుల్లో దాదాపు 80 శాతం నిండటం సంతోషకరమని, దీంతో జిల్లాలోని సుమారు 2.7 లక్షల ఎకరాలకు సాగునీటి కొరత ఉండదని మంత్రి అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు గురువారం సాయంత్రానికి 20 టీఎంసీలకు చేరనున్నాయని తెలిపారు. నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ చుక్క నీరూ వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీర్లపల్లి గ్రామంతోపాటు గోదావరిఖని, రామగుండం పారిశ్రామికవాడ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిం చాలని సింగరేణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. స్థానిక ప్రజాప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వరద సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్న రామగుండం మేయర్, డిప్యూటి మేయర్, కార్పొరేటర్లను మంత్రి అభినందించారు. కాన్ఫరెన్సులో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట వెంకటరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *