ఆడెపు లక్ష్మీపతి ఓ ‘చైతన్య స్రవంతి’

చెమ్మ : వారాల ఆనంద్

తెలుగు కథాసాహిత్యంలో కొంతమంది రచయితలు ఎక్కువ కథలు రాయకపోయినా, మనసుపెట్టి రాసిన ప్రతికథ కొత్తదనంతో వినూత్నంగా వుండి పాఠంలానూ అధ్యయనం చేయాల్సిన రచనగానూ నిలబడుతుంది. అంతేకాదు ఆ రచయిత చేసిన విమర్శ కూడా సాహిత్యంలో దిక్సూచిలా నిలుస్తుంది. అలాంటి అరుదైన రచయితల్లో ఆడెపు లక్ష్మీపతి ఒకరు. ఆయన కేవలం కథలు రాయడమే కాదు కథ ఎలా ఉండాలో ఎంత వినూత్నంగా ఉండాలో ఆలోచించినవాడు. అంతేకాదు, ప్రపంచసాహిత్యాన్ని తెలుగు పాఠకులకి పరిచయం చేసిన మంచి అనువాదకుడు కూడా. తెలంగాణ పల్లెలో జన్మించిన లక్ష్మీపతి జీవితం సాధారణ మధ్యతరగతి ఉద్యోగజీవి జీవితం. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగం చేస్తూనే సాహిత్యాన్ని అంతరంగ ఆవిష్కరణగా, సుదీర్ఘమయిన సాధనగా మలచుకున్నారు. 1972లో ‘ఆదర్శం’ కథతో తొలుత ప్రారంభమైన ఆయన రచనా ప్రయాణం, సంఖ్యాపరంగా విస్తృతం కాకపోయినా, నాణ్యతపరంగా తెలుగు కథాసాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది.

ప్రచారానికి దూరంగా ఉంటాడు. సాహిత్యాన్ని అంతరంగ సాధనగానూ, ఆవిష్కరణగానూ భావించి రచయితగా నిలబడ్డాడు.  చైతన్య స్రవంతి ఆయనకు ఇష్టమైన రైటింగ్ టెక్నిక్. ‘మనిషి జీవితాన్ని బాహ్య సంఘటనలు మాత్రమే నిర్మించవు. అతని అంతరంగంలో క్షణక్షణం ప్రవహించే ఆలోచనలే నిజమైన జీవితాన్ని నిర్మిస్తాయి’ అన్న అవగాహన నుంచే చైతన్యస్రవంతి అనే ఆధునిక కథనపద్ధతి పుట్టుకొచ్చింది. ఇది కేవలం రచనా సాంకేతికత కాదు. మనిషి అంతర్మనస్సును యథాతథంగా వ్యక్తీకరించే కళాత్మక ప్రక్రియ. చైతన్యస్రవంతి అనేది పాత్ర మనస్సులో నిరంతరం ప్రవహించే ఆలోచనలు, జ్ఞాపకాలు, కలలు, భయాలు, కోరికలు, ఊహలు, అవచేతన స్పందనలను వాటి సహజక్రమంలో, ఎక్కువగా రచయిత జోక్యం లేకుండా చిత్రించే కథనశైలి. ఈ పదాన్ని తొలిసారిగా అమెరికన్ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త విలియం జేమ్స్ తన Principles of Psychology (1890) గ్రంథంలో ఉపయోగించాడు. తరువాత నవలా రచయితలు దీనిని సాహిత్యప్రక్రియగా అభివృద్ధి చేశారు. ఇది సంఘటనల కంటే అనుభూతులకు, సంభాషణల కంటే మౌనానికి, కాలక్రమం కంటే జ్ఞాపకాల ప్రవాహానికి విలువనిస్తుంది. అందుకే ఇది ఆధునిక సాహిత్యంలో అత్యంత సృజనాత్మకమైన కథనశిల్పాల్లో ఒకటిగా నిలిచింది.

ఆ శిల్పంలో లక్ష్మీపతి రాసిన నాలుగు కథల్లో జీవన్మృతుడు, తిర్యగ్రేఖ, విధ్వంసదృశ్యం తనకి బాగా పేరు తెచ్చాయి. మనకు చైతన్యస్రవంతి అనగానే మనకి జేమ్స్ జాయిస్ గుర్తొస్తాడు. ఆయన రాసిన యులిసిస్ గుర్తొస్తుంది అంతేకాదు తెలుగులో అంపశయ్య నవీన్ గుర్తొస్తాడు. నిజానికి చైతన్యస్రవంతిలో కథ రాయడం అంత సులభమేమీ కాదు మానసిక పరిశీలన, విశ్లేషణ, మానసిక వాస్తవం వీటన్నింటిని ధారగా ఉద్వేగంగా పాఠకుని కళ్ళముందు నిలబెట్టేందుకు ఆ రచయిత ఆయాపాత్రల అంతరంగాలలోకి పరకాయ ప్రవేశంచేసి తాను చూసిన తెలుసుకున్న మానసికస్థితుల్ని వేగంగా కొత్త వొరవడితో రాసి పాఠకులతో చదివింపచేయాలి, పరుగెత్తించాలి. అది చాలా క్లిష్టమైనపని. కేవలం ఒకవాక్యం క్రింద మరోవాక్యం రాస్తూ పేరుస్తూ కవితాత్మకశైలిలో రాస్తే చైతన్యస్రవంతి కాదు. మనిషి తన చేతన, సుప్తచేతనల్లోంచి ఎగిసి ఉబికి వచ్చే ఆలోచనలు, జ్ఞాపకాలు, ఊహలు, అనుభూతులు, ఇంద్రియ సంవేదనలతో సంక్లిష్టమై, సంక్షోభాభరితమై అవన్నీ కలగాపులగంగా కలిసిపోతున్నప్పటి పాత్ర సంపూర్ణస్థితిని ఆవిష్కరించడమే చైతన్య స్రవంతి కథనం. దాంట్లో పాత్ర(ల) ఆలోచనలు, అనుభూతులు, సంవేదనల ప్రతిబింబంగా బాహ్య ప్రపంచాన్ని దృశ్యమానం చేస్తాడు రచయిత. ఆయా పాత్ర(ల) అంతర్ వ్యక్తీకరణాల్ని ధ్వనింపజేస్తూ వినిపిస్తూ ఆయా పాత్రల చర్యలకు, ప్రవర్తనలకు ప్రేరణ లేమిటో కూడా రచయిత చెబుతాడు.

ఆడెపు లక్ష్మీపతి రాసిన కథలు చదివితే ముందుగా కనిపించేది వాటిలో ధ్వనించే నిశ్శబ్దం. పెద్ద సంఘటనలు, నాటకీయ మలుపులు, సంచలనాత్మక ముగింపులు- ఆసక్తికర అంశాలు కావు. ఒక మనిషి మనసులో కదిలే అలజడి, విలువల మార్పు, కాలంతో సంబంధాల మార్పు వీటినే ఆయన కథలుగా మలిచారు నాలుగు దృశ్యాలు’ కథాసంపుటి ఇందుకు అత్యుత్తమ ఉదాహరణ అని చెప్పొచ్చు. దాని శీర్షికే ఆయన కథాదృష్టిని తెలియజేస్తుంది. జీవితం మొత్తాన్ని ఒకేకథలో చెప్పడం కాదు, నాలుగుదృశ్యాల్లోనే మనిషి అంతరంగాన్ని ప్రతిబింబించగల సామర్థ్యం కథకు ఉందని ఆయన నమ్మకం.

తెలుగు కథాపరిణామాన్ని గమనిస్తే కథను సామాజిక ప్రకటనగా భావించిన రచయితలున్నారు, శిల్పానికే అధిక ప్రాధాన్యం ఇచ్చినవారూ ఉన్నారు. రచయితగా ఆడెపు లక్ష్మీపతి ఈ రెండింటి మధ్య సమతుల్యతను సాధించిన రచయితగా నిలుస్తాడు. ఆడెపు లక్ష్మీపతి పేరు వినగానే ఆయన కథలతో పాటు గుర్తొచ్చేది ఆయన రాసిన విమర్శా వ్యాసాలు. ‘దిక్చక్రం’ వంటి వ్యాససంపుటిలో ప్రపంచ సాహిత్య ధోరణులను తెలుగు సాహిత్య సందర్భంలో విశ్లేషించారు. విమర్శ అంటే వ్యక్తిమీద అభిమానం గానీ, వ్యతిరేకత గానీ కాదని, రచనను దాని అంతర్గత సౌందర్యంతో, నిర్మాణంతో, ఆలోచనా లోతుతో అర్థం చేసుకోవడమని ఆయన విమర్శల్లో చూపించారు. ప్రపంచ కథ, ఆధునికత, ఉత్తరాధునికత, మాజిక్ రియలిజం, మినిమలిజం వంటి భావనలను తెలుగులో సరళంగా పరిచయం చేయడంలో ఆయన కృషి విశేషమైనది. తెలుగు రచయిత ప్రపంచ సాహిత్యాన్ని చదవాలని, తనభాషను విశ్వసాహిత్య సంభాషణలో భాగం చేయాలని నిరంతరం సూచించారు.

ఆడెపు లక్ష్మిపతి కథకుడు, విమర్శకుడు గానే కాకుండా అనువాదకుడిగా కూడా కృషిచేసారు. నేషనల్ బుక్ ట్రస్ట్ వంటి పలుసంస్థల కోసం పుస్తకాలను తెలుగులోకి తీసుకొచ్చారు. అంబేద్కర్ ప్రసంగాల నుంచి సామాజిక అధ్యయన నివేదికల వరకు విభిన్నగ్రంథాలను అనువదించారు. సాహిత్యసృజనలో రాసి కంటే వాసి ప్రధానమని భావించే ఆడెపు లక్ష్మిపతి ‘తెలుగుకథ అంతర్జాతీయ కథాసంప్రదాయాలతో సంభాషించాలంటే అధ్యయనం, శిల్పం, భాషా క్రమశిక్షణ అవసరమని అంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *