కాలం ఏదో ఒక నెపంతో
బాధిస్తూ చెప్పకపోతే
తనకి విలువ ఉండదని
భయం కాబోలు
పచ్చి నిజాల నుండి కూడా
నాలుగు కన్నీటి చుక్కలని
గురు దక్షిణ కోరకుండా
ఉండలేదు అనుకుంటా
కొన్ని రాత్రుళ్ళు
నిద్రను తాకట్టు పెట్టుకుని
కొన్ని పగుళ్లను
చీకటితో చిట్లకొట్టి
కోరికల పావులతో
మనిషిని ఉసిగొల్పి
మనసు చదరంగంలో
ఓటమిని చవి చూపుతుంది..
సమస్యల మధ్య
నలిగే మనిషిలో
ఊపిరిని ఒడిసిపట్టి
ప్రాణం పోకుండా కక్ష తీర్చుకుంటుంది..
ప్రశ్నల అంపశయ్య
జీవితాన్ని పడుకోపెట్టి
బతుకును ముళ్ళు కర్రతో
అదిలిస్తుంది
ఎంత చదువుకున్నా
ఇంకెక్కడో మార్కులు తగ్గినట్లు
ఇంకేదో తప్పుపడుతూ
మోసంతో ద్రోహం చేస్తుంది.
ఎండిన ఆశతో
చిగురు చేతులు కలిపితే
ఓర్వలేని చూపులు
చటుక్కున తుంపుతాయి
నమ్మి పూజించినా
తన నిజస్వరూపంతో
నమ్మలేని సమస్యతో
గొప్పగా పరీక్ష పెడుతుంది.
ఫలితాలని దాచిపెడుతుంది
కాలం నాలుగు దిక్కులుగా
కాలం నాలుగు గోడలుగా
ఓ మాయలా ఓ గాయంగా
ఓ పాఠంలా ఓ ప్రశ్నలా
తానో రహస్యమే.





