నిబద్ధతకు నిదర్శనం శ్యామాప్రసాద్ ముఖర్జీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితం దేశం కోసం చేసిన త్యాగం, ధైర్యం రాజీ లేని నిబద్ధతకు నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు కొనియాడారు. భారతీయ జనసంఘ్ స్థాపకుడు, మహనీయుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ (వర్ధంతి) సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయనకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రామచందర్ రావు ముఖ్య అతిథులుగా హాజరై ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయన దేశానికి చేసిన సేవలను, త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్, ఇతర సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ ఎలాగైతే నిర్ణయాత్మక పాత్ర పోషించారో అఆగే జమ్మూ కాశ్మీర్‌ను భారత దేశంలో పూర్తిస్థాయిలో అంతర్భాగం చేసేందుకు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ తన ప్రాణాలనే త్యాగం చేశారని స్పష్టం చేశారు. ఈ రోజు పశ్చిమ బెంగాల్ భారత దేశంలో అంతర్భాగంగా ఉందంటే దానికి డాక్టర్ ముఖర్జీ పోషించిన చరిత్రాత్మక పాత్రే కారణమని రామచందర్ రావు తెలిపారు. హిందువుల రక్షణ కోసం ఆయన నిర్భయంగా పోరాడారని, విభజన, ఓటు బ్యాంకు తుష్టీకరణ రాజకీయాలకు వ్యతిరేకంగా బలంగా నిలబడ్డారని చెప్పారు. డాక్టర్ ముఖర్జీ గొప్ప మేధావి, పరిపాలకుడని, కలకత్తా విశ్వవిద్యాలయానికి అత్యంత పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారని గుర్తు చేశారు. జాతీయ ప్రయోజనాల విషయంలో కాంగ్రెస్ అవలంబిస్తున్న తుష్టీకరణ, రాజీ ధోరణిని అంగీకరించలేక డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ నెహ్రూ కేబినెట్ నుండి రాజీనామా చేశారని కూడా గుర్తుచేశారు. ఆయన జీవితం బీజేపీ కార్యకర్తలకు దేశమే మొదటిది (నేషన్ ఫస్ట్) అనే మార్గదర్శక మంత్రాన్ని అందించిందన్నారు. నేడు బీజేపీ నాయకత్వంలో బెంగాల్‌లో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాలను పునరుద్ధరణ జరుగుతోందన్నారు. తెలంగాణలోని ప్రతి బిజెపి కార్యకర్త బెంగాల్‌లోని బిజెపి విజయాల నుండి స్ఫూర్తి పొంది, దానిని ఇక్కడా పునరావృతం చేయాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను, కార్పొరేటర్లను గెలిపించాలి

నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు సమక్షంలో పలువురు ప్రముఖులు, మహిళా నాయకులు మంగళవారం పెద్దఎత్తున బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ ఆయన కండువా కప్పి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ పార్టీలో చేరిన నాయకులకు, కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. రాబోయే జీహెచఎంసీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను, కార్పొరేటర్లను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో బీజేపీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *