– కార్యాలయ భవనాల నిర్మాణమేదీ?
– భూభారతితో రైతులకు భరోసా కల్పించిన ప్రజాప్రభుత్వం
– బిఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డ పొంగులేటి
– హుస్నాబాబ్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు ప్రారంభం
హనుమకొండ, ప్రజాతంత్ర,ఆగస్ట్ 10: గత పాలకులు ఆర్భాటంగా అనేక డివిజన్లు, జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేశారని, అయితే వాటికి ఎక్కడ కూడా ఆఫీసులు, ఇతరత్రా సౌకర్యాలు ఏర్పాటు చేయలేదని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.600 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 180 రెవెన్యూ తహశీల్దార్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాలను యుద్ధ ప్రాతిపదికన సంవత్సరంలోపు పూర్తి చేశామని తెలిపారు. జిల్లాలోని ఎల్కతుర్తిలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ, పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ధరణిని బంగాళాఖాతంలో వేశామని.. భూభారతి చేపట్టి రైతులకు పూర్తి భద్రత, భరోసా ఇచ్చేలా భూములను ప్రక్షాళన చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ విలేజ్‌లోని ప్రతి అంగుళాన్ని సర్వే చేసి మనిషికి ఎలాగైతే ఆధార్ ఉందో, భూములకు కూడా భూధార్ ఇస్తామని చెప్పారు. రైతులందరి సహకారంతో భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక భద్రత, భరోసా కల్పిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.రైతన్నల దీవెనలతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అన్నదాతను రాజు చేయడమే తమ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. గడిచిన రెండున్నరేండ్లలో వేల కోట్లు రైతన్నల కోసం ఖర్చు చేశామని, కనీవినీ ఎరగని విధంగా పంటలు పండించామని తెలిపారు. గతంలో సేకరించిన ధాన్యాన్ని స్టోర్ చేసే కెపాసిటీ లేకపోయినా చివరి గింజ వరకు కొంటామన్న ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని గుర్తుచేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరులో లబ్దిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన రైతులకు సంకెళ్లు వేసి వరి వేస్తే ఉరి అన్న బీఆర్‌ఎస్ నాయకులు.. నేడు ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం చేస్తూ పాదయాత్రలతో తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదని, పదేపదే ఈ మాట చెప్పడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదని.. పదేండ్లు రాష్ట్రాన్ని దోచుకున్న వారే నేడు గోబెల్స్ ప్రచారాలు చేస్తూ ఎద్దేవా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.భవిష్యత్తులో పిల్లలకు వివాదాలు లేని ఆస్తి ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి భూభారతి ద్వారా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో 70 గ్రామాల్లో భూముల రీ-సర్వే చేపడుతున్నట్లు వెల్లడించారు. మూడు, నాలుగు విడతల్లో వ్యవసాయ భూములతో పాటు మిగతా ఆస్తులను కూడా మ్యాపులతో సహా అందజేస్తామని, గత ప్రభుత్వం తెచ్చిన ’ధరణి’ని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు.ఎలాంటి స్వార్థం లేకుండా రైతుల కోసం పనిచేస్తున్నామని పేర్కొన్న ఆయన.. ఎల్ నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీరు తక్కువగా వినియోగించే పంటలనే సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో ఎమ్మార్వో కార్యాలయానికి శంకుస్థాపన, కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల నూతన భవనాన్ని మంత్రులు కలిసి ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పేయి,ఇతర ముఖ్య నేతలు అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




