ప్రతీ తెలుగు ఇంట్లో అమెరికా ఒక భాగమైంది

– ఐటీ నుంచి ఏఐ, క్లీన్ ఎనర్జీ వైపు తెలంగాణ-యుఎస్ అడుగులు
– నగర వారసత్వ సంపద పరిరక్షణలో అమెరికా సహకారం అభినందనీయం
– అమెరికా ‘ఫ్రీడమ్ 250’ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23 : హైదరాబాద్ ఐటీ రంగానికి మీరు డెవలప్‌మెంట్ సెంటర్ ఇస్తే.. మేము మీకు ప్రపంచాన్ని నడిపించే గ్లోబల్ సీఈవోలను ఇస్తాం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అమెరికా స్వాతంత్య్రానికి 250 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లోని యÖఎస్ కాన్సులేట్‌లో మంగళవారం నిర్వహించిన ఫ్రీడమ్- 250 వేడుకలలో” ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. 1990లలో మైక్రోసాఫ్ట్ సంస్థ హైదరాబాద్‌లో అడుగుపెట్టడం నుంచి.. నేడు సత్య నాదెళ్ల ఆ సంస్థకు సీఈవోగా ఎదగడం వరకు ఉన్న ప్రయాణాన్ని గుర్తుచేస్తూ తెలుగు వారి నైపుణ్యానికి ఇదొక నిదర్శనమని కొనియాడారు. హైదరాబాద్‌కూ అమెరికాకూ ఉన్న బంధం కేవలం రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న దౌత్య సంబంధం కాదు.. ఇది ప్రజల మధ్య, కుటుంబాల మధ్య ఏర్పడిన అనుబంధం అని అన్నారు. ఈ రోజు మన ఇళ్లలో అమెరికా అనేది మ్యాప్‌లో చూసే ఒక దేశం కాదు. అక్కడ చదువుకుంటున్న మన పిల్లలు, ఉద్యోగాలు చేస్తున్న బంధువులు, స్టార్టప్‌లు పెడుతున్న యువత రూపంలో అమెరికా ప్రతి తెలుగు ఇంట్లో ఒక భాగమైంది అని పేర్కొన్నారు. ఇప్పుడు మనం అమెరికాకు వెళ్తున్నాం అని కాదు, తెలుగే నేరుగా అమెరికాకు వెళ్లిపోయిందని,. అక్కడ వేగంగా విస్తరిస్తున్న భాషగా తెలుగు నిలవడం మనందరికీ గర్వకారణం అని భట్టి అన్నారు. తెలంగాణ-అమెరికా భాగస్వామ్యం ఇప్పుడు కేవలం సాఫ్ట్‌వేర్ రంగానికే పరిమితం కాలేదు.. అది దాటి ‘సహసృష్టి’ (కో క్రియేషన్) దశలోకి అడుగుపెట్టిందని తెలిపారు. జీవవిజ్ఞానం (లైఫ్ సైన్సెస్), వ్యాక్సిన్ల తయారీ, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలలో మన బంధం మరింత గట్టిపడిందన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), శుద్ధ ఇంధనం (క్లీన్ ఎనర్జీ), ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో ఈ భాగస్వామ్యం మరిన్ని కొత్త పుంతలు తొక్కబోతోంది అని వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ సమ్మిట్-2025లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించినట్లు అమెరికాతో ఉన్న ప్రత్యేక బంధానికి గుర్తుగా ఇక్కడి యÖఎస్ కాన్సులేట్ సమీపంలోని ప్రధాన రహదారికి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని నిర్ణయించాం అని డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆ రహదారి పేరు ఫలకాన్ని ఆవిష్కరించేందుకు వేదికపై ఉన్న అమెరికా రాయబారి సెర్జియో గోర్, కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌లను ఆహ్వానించారు. హైదరాబాద్ వారసత్వ సంపదను కాపాడటంలో అమెరికా సహకారం అభినందనీయమని భట్టి పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *