– రెస్టారెంట్లలో అదే అపరిశుభ్రత
– ఫ్రీజర్లలో కాలం చెల్లిన పదార్థాలు
– కంచి కేఫ్, ‘కోడికూర చిట్టిగారె’కు నోటీసులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 23: ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న రెండు ప్రముఖ రెస్టారెంట్లలో నిబంధనల ఉల్లంఘనలను, తీవ్రమైన లోపాలను గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు జారీ చేశారు. పుప్పాలగూడలోని కంచి కేఫ్‌లో మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. కిచెన్, స్టోర్ రూమ్ మధ్య ఓపెన్ డస్ట్‌బిన్లు ఉండటంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్వాసన వస్తూ, ఈగలు ముసురుతున్నాయి. స్టోర్ రూమ్ సీలింగ్‌పై దుమ్ము పేరుకుపోగా గ్రైండింగ్, కూరగాయలు కట్ చేసే ప్రదేశాల్లో నీరు నిల్వ ఉండి అపరిశుభ్రంగా మారింది. వంటకు ఉపయోగించే కాలీప్లవర్‌పై ఫంగస్ పెరిగినట్లు అధికారులు గుర్తించారు. డ్రెయిన్ల వద్ద దుర్వాసన రావడం, ఫ్రిజ్‌లలో నిల్వ చేసిన పిండిపై ఎలాంటి లేబులింగ్ లేకపోవడం గమనించారు. వంట గది, స్టోర్ రూమ్‌లలో ఈగలు, బొద్దింకలు తిరుగుతుండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటికితోడు మెడికల్ ఫిట్‌నెస్, పెస్ట్ కంట్రోల్, వాటర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్‌కు సంబంధించిన ఎలాంటి రికార్డులు రెస్టారెంట్ యాజమాన్యం వద్ద అందుబాటులో లేవు. దీంతో ఫుడ్ లేబులింగ్, హౌస్‌కీపింగ్ వెంటనే మెరుగుపరచాలని ఆదేశిస్తూ అధికారులు నోటీసులు ఇచ్చారు. నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారె రెస్టారెంట్‌లోనూ తనిఖీలు జరిపారు. ఇక్కడ నిల్వ ఉంచిన చికెన్, డెజర్ట్స్‌పై ఎలాంటి లేబుల్స్ లేవని అధికారులు గుర్తించారు. ఆ లేబుల్స్ లేని ఆహార పదార్థాలను అక్కడికక్కడే పారవేయించారు. గ్రైండింగ్ ఏరియా సీలింగ్‌పై దుమ్ము పేరుకుపోవడంతోపాటు కిచెన్ సీలింగ్ అంతా పూర్తిగా జిడ్డుగా మారినట్లు కనుగొన్నారు. ఆ జిడ్డును వెంటనే శుభ్రం చేయాలని యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈ రెస్టారెంట్‌లోనూ ఉద్యోగుల మెడికల్ ఫిట్‌నెస్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్ రికార్డులు లేకపోవడంతో ఫుడ్ సేప్టీ అధికారులు తీవ్రంగా పరిగణించి నోటీసులు జారీ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





