“ఒకప్పుడు మా నాన్న కథ చెప్పేటప్పుడు సినిమా సన్నివేశాల మధ్య ఆ పాటల గురించి కూడా చెప్పి ఉండవచ్చు. కానీ ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు, నాకు మాత్రం పాట వినిపించిన ప్రతిసారీ మరో స్వరం కూడా వినిపించినట్టనిపించింది. మా ఇంటి వాకిట్లో కూర్చుని సినిమా కథ చెబుతున్న మా నాన్న స్వరం. అదే జ్ఞాపకం ఈ సినిమాను నాకు మరింత వ్యక్తిగతంగా మార్చింది. అదే విధంగా “హాయిహాయిగా ఆమని సాగే” వంటి గీతాలు కూడా ఈ చిత్ర సంగీత వైభవానికి అద్దం పడతాయి. పాటల్లోని కవిత్వం, రాగభావం, గానమాధుర్యం. ఇవన్నీ కలిసి ‘సువర్ణసుందరి’ని కేవలం ఒక జానపద చిత్రంగా కాకుండా ఒక సంగీతానుభూతిగా నిలబెట్టాయి..”
— మన్నెం నాగేశ్వర రావు
కొన్ని సినిమాలు కాలంతో పాటు పాతబడిపోతాయి. మరికొన్ని సినిమాలు కాలాన్ని దాటి నిలిచిపోతాయి. ‘సువర్ణసుందరి’ రెండో కోవకు చెందిన అరుదైన తెలుగు చిత్రరత్నం. అది ఒక సినిమా మాత్రమే కాదు. ఒక తరం కలలు కన్న అద్భుత ప్రపంచం. జానపద గాథకు పురాణ వైభవాన్ని, ప్రేమకు ఆత్మీయతను, సాహసానికి నాటకీయతను, సంగీతానికి మాధుర్యాన్ని జోడించి తెలుగు ప్రేక్షకుడి ఊహాశక్తికి రెక్కలు తొడిగిన చిత్రం. అయితే, ఈ సినిమా గురించి నేను ఇప్పుడు ఎందుకు రాస్తున్నానో చెప్పకుండా ఈ సమీక్షను ప్రారంభిస్తే, ఇందులోని అసలు కథలో ఒక ముఖ్యమైన భాగాన్ని చెప్పకుండా వదిలేసినట్టే అవుతుంది. ఎందుకంటే ‘సువర్ణసుందరి’ని నేను మొదటిసారి సినిమా హాల్లో చూడలేదు. మా నాన్న చెప్పిన కథలో విన్నాను.
మాది ఒకప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంగపేట మండలంలోని బోరు నర్సాపురం అనే ఒక మారుమూల గ్రామం. వరంగల్ పట్టణానికి మా ఊరు దాదాపు 125 కిలోమీటర్ల దూరం. మా అమ్మానాన్నలు ఇద్దరూ నిరక్షరాస్యులు. కానీ మా నాన్నకు అసాధారణమైన జ్ఞాపకశక్తి ఉండేది. చదువుకోలేదు గానీ, చూసినదాన్ని, విన్నదాన్ని తనలో పదిలంగా దాచుకునే శక్తి ఆయనకు అపారంగా ఉండేది. వ్యవసాయ కుటుంబం కావడంతో ఎరువులు కొనడానికి, పండించిన పంటను అమ్మడానికి ఏడాదికి రెండు మూడుసార్లు ఆయన వరంగల్ వెళ్లేవారు. వరంగల్ వెళ్లిన ప్రతిసారీ రెండు మూడు సినిమాలు చూసి వచ్చేవారు. తిరిగి ఇంటికి చేరిన సాయంత్రం నుంచి మా కోసం మరో సినిమా మొదలయ్యేది. తెరపై చూసిన సినిమాను ఆయన తనదైన శైలిలో మళ్లీ ఆవిష్కరించేవారు.
ఆయన కథ చెప్పే తీరు అద్భుతంగా ఉండేది. సినిమా కథ మాత్రమే కాదు—ఎవరు ఎలా నటించారు, ఏ సన్నివేశం ఎలా ఉంది, ఎలాంటి అద్భుతాలు చూపించారు, పోరాటాలు ఎలా జరిగాయి, హీరో ఏం చేశాడు, హీరోయిన్ ఎలా కనిపించింది. అన్నీ తనకు గుర్తున్నంత మేరకు ఎంతో రసవత్తరంగా చెప్పేవారు. ఇది ఒక ధారావాహిక లాగా ఐదారు రోజుల పాటు ప్రతి సాయంత్రం నడిచేది. మేము సినిమా చూడకుండానే, ఆయన మాటల ద్వారా సినిమా చూసిన అనుభూతి పొందేవాళ్లం.అలా ఒకసారి, నేను ఐదో తరగతిలోనో ఆరో తరగతిలోనో చదువుతున్న రోజుల్లో, 1970 దశకం తొలి భాగంలో, మా నాన్న ‘సువర్ణసుందరి’ సినిమా చూసి వచ్చారు. అది రెండో, మూడో విడుదల కావచ్చు. ఆ సాయంత్రం కూడా మామూలుగానే కథ మొదలైంది. మా నాన్న తనకు గుర్తున్నట్టుగా కథను ఉత్సాహంగా చెబుతున్నారు. ఒక ఘట్టం నుంచి మరో ఘట్టానికి వెళ్లారు. మధ్యలో ఏదో మలుపు చెప్పకుండా ముందుకు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆయనకే ఏదో గుర్తొచ్చింది. “అరే… అది ముందే చెప్పాలి… అక్కడ ఇలా జరిగింది…” అంటూ వెనక్కి వెళ్లి ఆ మరచిన ఘట్టాన్ని వివరించారు.
మళ్లీ కథ ముందుకు సాగింది.
మరికొంతసేపటికి మరో సందర్భంలో కూడా అలాగే జరిగింది. గుర్తొచ్చిన విషయాన్ని వెనక్కి వెళ్లి సరిచేసుకున్నారు. అప్పుడు మా అమ్మ నవ్వుతూ ఒక మాట అంది, “మీ నాన్నకు వయసు మీద పడుతోంది… మతిమరుపు వస్తోంది.” ఆ మాట అప్పట్లో నాకు పెద్దగా అర్థం కాలేదు. కానీ ఏదో కారణంగా అది నా బాల్యస్మృతిలో బలంగా ముద్రపడిపోయింది. కొన్నాళ్ల క్రితం, వాళ్లను తలచుకుంటూ పాత జ్ఞాపకాలలోకి వెళ్లాను. అప్పుడు అకస్మాత్తుగా మా అమ్మ మాట గుర్తొచ్చింది. “మీ నాన్నకు వయసు మీద పడుతోంది… మతిమరుపు వస్తోంది.” ఆ మాటతో పాటు ‘సువర్ణసుందరి’ కథ చెబుతున్న మా నాన్న రూపం కూడా కళ్లముందు నిలిచింది.
అప్పుడే అనిపించింది. ఆ సినిమా అసలు ఎలా ఉందో ఒకసారి నేనే చూడాలి కదా!
అలా, నాతో ఎలాంటి ప్రత్యక్ష అనుబంధం లేని, నేను పుట్టకముందే నిర్మితమైన, 1957 నాటి ఒక సినిమాను చూడాలన్న ఆసక్తి మొదలైంది. యూట్యూబ్ లో చూశాను. నేను సినిమా చూసింది ‘సువర్ణసుందరి’ కోసం మాత్రమే కాదు. మా అమ్మనాన్నల జ్ఞాపకాన్ని మరోసారి కలుసుకోవడం కోసం. ఆ అన్వేషణలో చూసిన సినిమా నన్ను ఆశ్చర్యపరిచింది.
1957లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సువర్ణసుందరి’ని అంజలి పిక్చర్స్ పతాకంపై పి. ఆదినారాయణరావు నిర్మించారు. వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించారు. అక్కినేని నాగేశ్వరరావు–అంజలీదేవి జంట ప్రధాన పాత్రల్లో నటించగా, సంగీతాన్ని కూడా పి. ఆదినారాయణరావే సమకూర్చారు.కథలోకి వెళితే, ఇది కేవలం ఒక రాజకుమారుడు–రాజకుమారి ప్రేమకథ కాదు. ప్రేమను పరీక్షించే విధి, మానవ జీవితాన్ని నడిపించే కర్మ, స్వర్గం–భూలోకం మధ్య సాగే ఒక అద్భుతమైన భావప్రపంచం ఇందులో కనిపిస్తుంది. కథలోని మలుపులు ప్రేక్షకుడిని ఒక లోకం నుంచి మరో లోకానికి తీసుకెళ్తుంటాయి. ఆ ప్రయాణంలో ఆశ్చర్యం, విరహం, విషాదం, సాహసం, హాస్యం, అన్నీ సమపాళ్లలో కలుస్తాయి.
ఈ చిత్రానికి అసలైన బలం దాని కల్పనాశక్తి. ఈ రోజుల్లో భారీ గ్రాఫిక్స్, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ, అప్పట్లో పరిమితమైన వనరులతోనే దర్శకుడు సృష్టించిన దృశ్య ప్రపంచం ఆశ్చర్యపరుస్తుంది. దేవలోకం, మానవలోకం, అద్భుత సంఘటనలు, వేషధారణలు, రాజభవనాలు, ప్రతి అంశంలోనూ అప్పటి తెలుగు సినిమా కళాత్మకత ప్రతిఫలిస్తుంది. ఇక్కడ వేదాంతం రాఘవయ్య దర్శకత్వ ప్రతిభను ప్రత్యేకంగా గుర్తించాలి. అద్భుతాలు, జానపద అంశాలు, ప్రేమకథ, సాహసం, ఇవన్నీ ఒకే కథలో ఉన్నప్పటికీ, వాటిని విడివిడిగా అనిపించకుండా ఒక సమగ్ర దృశ్యానుభూతిగా మలిచారు. అప్పటి సాంకేతిక పరిమితులను అధిగమించి ప్రేక్షకుడి ఊహకు ఒక కొత్త ప్రపంచాన్ని అందించగలిగారు.
అక్కినేని నాగేశ్వరరావు నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయనలోని శృంగార నాయకుడిని మాత్రమే కాకుండా, ప్రేమలోని ఆవేదనను, విరహంలోని బాధను, సాహసంలోని ఉత్సాహాన్ని కూడా తెరపై సహజంగా ఆవిష్కరించారు. ఆయన నటనలో ఎక్కడా అతిశయోక్తి కనిపించదు. పాత్ర ఎంత కల్పితమైనదైనా, ఆయన అభినయం దానికి మానవీయమైన స్పర్శను ఇస్తుంది. అంజలీదేవి మాత్రం ‘సువర్ణసుందరి’కి పేరును మాత్రమే ఇవ్వలేదు. ఆ పేరుకు తగిన సౌందర్యాన్ని, గాంభీర్యాన్ని, భావుకతను కూడా అందించారు. ఆమె తెరపై కనిపించిన ప్రతిసారీ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఏర్పడుతుంది. అందం మాత్రమే కాదు, పాత్రలోని భావోద్వేగాన్ని కూడా ఆమె ఎంతో సమర్థంగా పలికించారు.
అయితే ‘సువర్ణసుందరి’ని తరతరాలుగా గుర్తుండిపోయేలా చేసిన మహాశక్తి సంగీతం. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు పి. ఆదినారాయణరావు. ఆయన సంగీతం ఈ చిత్రానికి ప్రాణం పోసింది. శాస్త్రీయ సంగీతపు సొబగులు, జానపద మాధుర్యం, శృంగార భావుకత. వీటన్నింటినీ ఆయన తన బాణీలలో అద్భుతంగా మేళవించారు. ముఖ్యంగా “పిలువకురా అలుగకురా…” పాటను ప్రస్తావించకుండా ‘సువర్ణసుందరి’ సంగీతం గురించి మాట్లాడటం అసంపూర్ణమే. పి. సుశీల మధుర స్వరంలో పలికిన ఈ గీతం తెలుగు సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ప్రేయసి అలకలోని సున్నితత్వం, ప్రేమలోని ఆత్మీయత, పిలుపులోని మాధుర్యం. అన్నీ కలసి ఆ పాటను ఒక మధురానుభూతిగా నిలబెట్టాయి.
ఒకప్పుడు మా నాన్న కథ చెప్పేటప్పుడు సినిమా సన్నివేశాల మధ్య ఆ పాటల గురించి కూడా చెప్పి ఉండవచ్చు. కానీ ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు, నాకు మాత్రం పాట వినిపించిన ప్రతిసారీ మరో స్వరం కూడా వినిపించినట్టనిపించింది. మా ఇంటి వాకిట్లో కూర్చుని సినిమా కథ చెబుతున్న మా నాన్న స్వరం. అదే జ్ఞాపకం ఈ సినిమాను నాకు మరింత వ్యక్తిగతంగా మార్చింది. అదే విధంగా “హాయిహాయిగా ఆమని సాగే” వంటి గీతాలు కూడా ఈ చిత్ర సంగీత వైభవానికి అద్దం పడతాయి. పాటల్లోని కవిత్వం, రాగభావం, గానమాధుర్యం. ఇవన్నీ కలిసి ‘సువర్ణసుందరి’ని కేవలం ఒక జానపద చిత్రంగా కాకుండా ఒక సంగీతానుభూతిగా నిలబెట్టాయి. పాటలు కథను ఆపలేదు. కథనే ముందుకు నడిపించాయి. ‘సువర్ణసుందరి’ పాటలు పాత్రల మనోభావాలను చెప్పే భాషగా పనిచేస్తాయి. ప్రేమను చెప్పాల్సిన చోట పాట వస్తుంది. విరహాన్ని వ్యక్తం చేయాల్సిన చోట పాట వస్తుంది. భక్తి, ఆనందం, బాధ, ప్రతి భావానికీ సంగీతం ఒక ప్రత్యేక స్వరాన్ని అందిస్తుంది.
సాహిత్యం కూడా ఈ చిత్రానికి ఒక ప్రత్యేకమైన అలంకారం. పదాల ఎంపికలోని సౌందర్యం, సంభాషణల్లోని నాటకీయత, పాటల్లోని కవితాత్మకత. ఇవన్నీ కలిసి చిత్రానికి ఒక ప్రత్యేకమైన భాషను నిర్మించాయి. నేటి వేగవంతమైన సంభాషణలతో పోలిస్తే ఆ కాలపు మాటల్లో ఒక నెమ్మది ఉంది; కానీ అదే నెమ్మదిలో ఒక గంభీరత, ఒక అందం దాగి ఉంది. ‘సువర్ణసుందరి’లోని హాస్యపాత్రలు కూడా కథకు మంచి ఊపునిస్తాయి. ప్రధాన కథలోని గంభీరతను తగ్గించకుండా, ప్రేక్షకుడికి మధ్యమధ్యలో చిరునవ్వు తెప్పించే విధంగా హాస్యాన్ని అల్లిన తీరు అప్పటి రచయితల కథన నైపుణ్యానికి నిదర్శనం. ఈ చిత్రాన్ని నేటి ప్రమాణాలతో మాత్రమే కొలిస్తే కొన్ని అంశాలు నెమ్మదిగా అనిపించవచ్చు. కానీ అది ఈ సినిమాను అర్థం చేసుకునే సరైన పద్ధతి కాదు. ‘సువర్ణసుందరి’ని చూడాలంటే ఆ సినిమా నిర్మితమైన కాలంలోకి మనం అడుగుపెట్టాలి. అప్పటి ప్రేక్షకుడి ఊహాశక్తితో, అప్పటి సాంకేతిక పరిజ్ఞానంతో, అప్పటి కళాకారుల సృజనాత్మకతతో ఈ చిత్రాన్ని చూడాలి. అప్పుడు మాత్రమే దాని అసలైన వైభవం తెలుస్తుంది.
అద్భుతాలు, దేవలోకం, శాపాలు, ప్రేమ, విధి వంటి అంశాలున్నప్పటికీ, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వాటి అంతరంగంలో ఉన్నవి మాత్రం అత్యంత మానవీయమైన భావోద్వేగాలే. ప్రేమ కోసం చేసే నిరీక్షణ, వియోగం కలిగించే వేదన, మనిషి ఎదుర్కొనే పరీక్షలు, చివరికి ధర్మం–ప్రేమ సాధించే విజయం. ఇవి కాలానికి అతీతమైన భావాలు. అందుకే ఈ సినిమా ఒక నిర్దిష్ట తరానికి చెందిన జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోలేదు. నాకు మాత్రం ఈ సినిమా మరో విషయాన్ని గుర్తుచేసింది. సినిమాలు కేవలం తెరపై కనిపించేవి కావు. అవి మన జీవితాల్లోకి ప్రవేశించి జ్ఞాపకాలుగా మారిపోతాయి. 1957లో తీసిన ఒక సినిమా, 1970లలో ఒక మారుమూల పల్లెటూరి ఇంట్లో ఒక నిరక్షరాస్య తండ్రి చెప్పిన కథగా మారింది. ఆ కథను విన్న ఒక చిన్న పిల్లవాడి జ్ఞాపకంలో అది దశాబ్దాల పాటు నిలిచిపోయింది. తల్లిదండ్రులు లేని తరువాత కూడా ఒక చిన్న వాక్యం ఆ జ్ఞాపకాన్ని మళ్లీ మేల్కొలిపింది. చివరికి అదే జ్ఞాపకం ఆ పిల్లవాడిని, ఇప్పటికి జీవితంలో ఎంతో పయనించిన వచ్చిన ఒక పెద్దమనిషిని, ఆ సినిమాను వెతికి చూసేలా చేసింది.
అందుకే నాకు ‘సువర్ణసుందరి’ ఒక పాత సినిమా కాదు.
అది మా నాన్న స్వరం.
అది మా అమ్మ నవ్వు.
అది మా చిన్ననాటి ఇంటి వాకిలి.
అది ఒక తండ్రి తన పిల్లలకు చెప్పిన సినిమా కథ.
అది కాలం తీసుకుపోయిన మా అమ్మానాన్నలను, కాసేపైనా తిరిగి నా దగ్గరకు తీసుకొచ్చిన ఒక అద్భుతమైన జ్ఞాపకసేతువు.
(రచయిత ఒక మాజీ డైరెక్టర్, సిబిఐ)





