-కేంద్ర నిధులు, ప్రాజెక్టులపై ప్రశ్నించాలి
– బీజేపీకి మంత్రి పొన్నం డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : రాష్ట్రంలో బీజేపీ నేతలు తమ పార్టీలోని అంతర్గత విభేదాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్‌లో కూర్చొని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాక దిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని నిలదీయాలని సవాల్ చేశారు. తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, అనుమతులపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని పొన్నం ప్రశ్నించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఇక్కడి బీజేపీ నేతలపై ఉందన్నారు. రాష్ట్ర ప్రజల కోసం పోరాడే దమ్ము చూపించాలని సూచించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం నుంచి నిధులు, ప్రాజెక్టులు మంజూరవుతున్న తీరును తెలంగాణ విషయంలో ఎందుకు అమలు చేయడం లేదో ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే రాజకీయ ఉనికి కాపాడుకోవచ్చని భావించడం సరికాదన్నారు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించి రాష్ట్ర హక్కుల కోసం కేంద్రాన్ని ప్రశ్నించాలని సూచించారు. గతంలో పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆరఎస్ ప్రభుత్వం అనేక బకాయిలు పెట్టినప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ప్రశ్నించలేదని పొన్నం నిలదీశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తూ పాత బకాయిలను కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తోందన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక హామీలు, నిధులు, ప్రాజెక్టులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని మంత్రి ఆరోపించారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన పన్నుల వాటా కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తోందన్నారు. పెండింగ్‌లో ఉన్న మెట్రో రైల్, నవోదయ విద్యాలయాలు, కేంద్ర పాఠశాలలు, రీజినల్ రింగ్ రోడ్ తదితర ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు, నిధులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడి బీజేపీ నేతలు దిల్లీ వెళ్లి ప్రధాని మోదీని కలిసి నిధులు, ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ తీసుకురావాలని పొన్నం సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



