హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్రెగుట్టల అటవీ ప్రాంతంలో పాత మందుపాతర పేలి ఓ గిరిజనుడు ప్రాణాలు కోల్పోయాడు. వెదుల్లచెరువు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావు(35) ఈ ప్రమాదంలో మృతిచెందాడు. నాగేశ్వరరావు వెదురు బొంగుల సేకరణ కోసం కర్రెగుట్టల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో గతంలో మావోయిస్టులు అమర్చినట్లు భావిస్తున్న మందుపాతరపై ఆయన కాలు వేయడంతో అది ఒక్కసారిగా పేలింది. ఈ పేలుడు ధాటికి నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగగా మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. గతంలో ఈ ప్రాంతం మావోయిస్టులకు కేంద్రంగా ఉండేదని, వారు అప్పట్లో అమర్చిన మందుపాతరలు ఇంకా భూమిలో ఉండే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో కూడా ఇదే ప్రాంతంలో మందుపాతరను నిర్వీర్యం చేస్తుండగా ఓ జవాన్ గాయపడిన విషయాన్ని వారు గుర్తు చేశారు. అటవీ ప్రాంతంలో అనుమానాస్పద వస్తువులు లేదా వైర్లు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రజలను హెచ్చరించారు. ఈ పరిసరాల్లో మరిన్ని మందుపాతరలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




