‘నీట్‌’ అరెస్టుల‌పై ‘సుప్రీమ్‌’ ‌కీలక ఆదేశాలు

– మైనర్లు, నేరచరిత లేని వారిని వదిలేయండి
– విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆదేశం
న్యూదిల్లీ, జూలై 28 : ‘నీట్‌’ పరీక్ష పేపర్‌ ‌లీకేజీలపై దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో అరెస్టయిన విద్యార్థుల విషయంలో సుప్రీంకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. 18 ఏళ్ల లోపు మైనర్లు, అలాగే ఎలాంటి నేర చరిత్ర లేని విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కాక్రోచ్‌ ‌జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో దిల్లీలోని జంతర్‌ ‌మంతర్‌ ‌సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించి వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం తన తాత్కాలిక ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ‘నీట్‌’ ‌పరీక్ష పేపర్‌ ‌లీక్‌ అం‌శంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరిగిన సమయంలో విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్, ‌దౌర్జన్యాలపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఘటనలకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పోలీసుల తీరును తప్పుబట్టింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని గుర్తు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సూర్యకాంత్‌ ‌నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నిర్దోషులపై అతిక్రమణలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా చట్టం ఊరుకోదు.. తన పని తాను చేసుకుపోతుంది’ అని ధర్మాసనం హెచ్చరించింది. ఈ ఘటనలపై స్వతంత్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ‘బాధ్యులను తేల్చనప్పుడు విచారణకు అర్థమే లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘నీట్‌’ ‌పరీక్షలో అక్రమాలపై న్యాయం కోరుతూ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న తరుణంలో వారిపై బల ప్రయోగం సరికాదని కోర్టు భావించింది. ఈ ఆందోళనల సమయంలో విద్యార్థులపై జరిగిన దాడి మాత్రమే కాక గాయపడిన పోలీసుల రక్షణ, వారి భద్రతా పరికరాల గురించి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని కోర్టు పేర్కొంది. శాంతిభద్రతల నిర్వహణ అనేది ద్వితీయ ప్రాధాన్యం కాకూడదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా వివిధ సందర్భాల్లో జరుగుతున్న నిరసనల సమయంలో శాంతిభద్రతల నిర్వహణకు, అల్లర్లను అదుపు చేయడానికి సంబంధించి ఒకే విధమైన ప్రొటోకాల్‌ అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. వేర్వేరు ప్రాంతాల్లో పోలీసులు వేర్వేరుగా ప్రవర్తించడం సరికాదని, నిర్దిష్ట నియమావళి ఉండాలని సూచించింది.
కేసులు ఎత్తేసిన బీహార్‌, అస్సాం ప్రభుత్వాలు
‘నీట్‌’ ‌యూజీ పరీక్షల వ్యవహారంలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులు, నిరసనకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి భారీ ఊరట లభించింది. నిరసనల సందర్భంగా విద్యార్థులపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని అస్సాం, బిహార్‌ ‌ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రాజస్థాన్‌ ‌ప్రభుత్వం కూడా త్వరలోనే ఇదే బాటలో నడవనుందని సమాచారం. ఈ అంశంపై సీజేపీ ప్రతినిధులతో చర్చించిన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు స్పష్టమైన హామీ ఇచ్చారు. అస్సాం, బిహార్‌ ‌తరహాలోనే రాజస్థాన్‌లోనూ విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని తెలిపినట్లు సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్‌ ‌దాస్‌ ‌వెల్లడించారు. మరోవైపు విద్యార్థుల భవిష్యత్తు, విద్యా వ్యవస్థలో సంస్కరణలను దృష్టిలో ఉంచుకుని అస్సాం హోం శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల‌ 26 సాయంత్రం 6 గంటల వరకు నమోదైన ఐదు కేసుల్లో అరెస్ట‌యిన‌ 13 మందిని త్వరితగతిన సమీ క్షించి విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. అంతేకాక నిరసనల్లో పాల్గొన్న అభ్యర్థులు లేదా విద్యార్థులపై భవిష్యత్తులో ఎలాంటి చట్టపరమైన చర్యలు ఉండబోవని అస్సాం హోమ్‌ అం‌డ్‌ ‌పొలిటికల్‌ ‌డిపార్ట్‌మెంట్‌ ‌ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రభుత్వాల ఈ నిర్ణయంతో వేలాదిమంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *