– బడి చదువులకు భిన్నంగా విజ్ఞానం, వినోదం
– అనేక కార్యకలాపాలకు సిద్ధమవుతున్న పాఠశాలలు
– మహాబోధి విద్యాలయలోనూ ఎన్నో కార్యక్రమాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 28 : వేసవి సెలవులు వచ్చేసాయి, ఏడాదిపాటు పుస్తకాలతో కుస్తీ పట్టిన పిల్లలు ఉపశమనం కోసం ఆటపాటలకు సిద్ధమవుతున్నారు. ఉదయాన్నే యోగ, శారీరక వ్యాయామం క్రికెట్, షటిల్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, జూడో, కరాటే, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ ఆటలకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. చెస్, క్యారమ్స్, లూడో తదితర ఇండోర్ గేమ్స్, చిత్రలేఖనం, అందమైన చేతిరాత, స్టోరీ టెల్లింగ్ తదితర యాక్టివిటీకి చాలా పాఠశాలలు సన్నద్ధమవుతున్నాయి. విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు వేసవి శిబిరాలను(సమ్మర్ క్యాంప్) రాష్ట్రవ్యాప్తంగా ప్రారం భించాలని తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ డాక్టర్ వెన్నెల గద్దర్ భావించారు. బడి చదువులకు భిన్నంగా వేసవి సెలవుల్లో వినోదంతో కూడిన విజ్ఞానాన్ని అందించేందుకు వేసవి శిబిరాలు నిర్వహిస్తున్నామని మహాబోధి విద్యాలయ సంస్థ నిర్వాహకురాలు తెలిపారు. పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోకుండా ఒత్తిడి లేని విద్యను అందించడమే పాఠశాలల ప్రథమ కర్తవ్యం. కథలు చెప్పడం, కథలు రాయించడం వల్ల పిల్లల్లో ఊహాశక్తి పెరుగుతుంది, ప్రయోగాలు నేర్పించడం ద్వారా సైన్స్‌ను అర్థం చేసుకోవడం సులభతరం అవుతుంది. ఈ కార్యశాలలో కాల్పనిక సాహిత్యంపై పిల్లలు సాహిత్యం చదవడం వల్ల వారిలో రాసే శక్తి వస్తుంది. దేశంలో పిల్లల సాహిత్యంపై ప్రచురితమవుతున్న పుస్తకాలు పరిచయం చేయడం వల్ల వివిధ ప్రాంతాల మాండలికాలు, అలవాట్లు, అభిరుచి, వేషధారణ పిల్లలకు తొందరగా అర్థమవుతుంది. పిల్లలు ఏ రకమైన వేసవి శిబిరానికి వెళ్ళినా అది ఆత్మవిశ్వాసం, స్వాతంత్య్రం వంటి సానుకూల లక్షణాలు పెంపొందిస్తాయి. శిబిరంలో పిల్లలు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కొత్త ఆసక్తులను కనుగొంటారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. వేసవి శిబిరాలు పిల్లలలో ఆందోళన భావనలను కూడా తగ్గించగలవు. వేసవి శిబిరాలలోని సామాజిక అంశం కూడా చాలా కుటుంబాలను బాగా ఆకర్షిస్తుంది. పిల్లలు తోటి శిబిరవాసులతో కలిసి కార్యకలాపాలలో పాల్గొంటున్నప్పుడు వారు కొత్త స్నేహితులను సంపాదించుకోవడం తోపాటు, ఒక జట్టుగా కలిసి పనిచేయడాన్ని కూడా అలవాటు చేసుకుంటారు.
రెసిడెంట్ క్యాంప్ 
కళాకారులు యువతీయువకులకు అయితే రెసిడెంట్ క్యాంపు నిర్వహించి శిక్షణ పొందేవారు, తోటి సిబ్బంది, కౌన్సిలర్లు ఒకే ప్రాంగణంలో నివసిస్తే అనేక రకాల కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. కొన్ని రెసిడెంట్ క్యాంపులు నిర్దిష్ట ఆసక్తి గల రంగాలలో ప్రత్యేకతను కలిగి ఉంటే మరికొన్ని విస్తృతమైన అంశాలపై దృష్టి పెడతాయి. సాధారణంగా డే క్యాంపులలో, పిల్లలు పగటిపూట కొన్ని గంటల పాటు శిబిరానికి హాజరై ఇంటికి వెళ్లి మళ్ళీ సాయంత్రం క్యాంపునకు వచ్చి చీకటిపడే వరకు ఉంటారు. డే క్యాంపులు తరచుగా ఒక నిర్దిష్ట ఇతివృత్తం లేదా ఆసక్తి ఉన్న రంగం చుట్టూ కేంద్రీకృతమై ఉంటాయి. లలిత కళల శిబిరాలు పిల్లల్లోని వర్ధమాన కళాకారుడిని వెలికి తీస్తాయి. అది కళ, నృత్యం, సంగీతం, నాటకం లేదా ఫోటోగ్రఫీ అయినా సరే.. పిల్లలు తమ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో సహాయపడటంపై దృష్టి సారించే అనేక వేసవి శిబిర కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి.
విద్యా శిబిరాలు 
విద్యాపరమైన అంశాలపై దృష్టి సారించే వేసవి శిబిరాలు చాలా ఉన్నాయి. విద్యార్థి పాఠశాల సంవత్సరంలో నేర్చుకున్న భావనలను మరింత పటిష్టం చేస్తాయి. అంతేకాక వారికి ఆసక్తి ఉన్న అంశాలు, విషయాలపై లోతైన అవగాహనను కూడా అందిస్తాయి. కోడింగ్, గణితం, ఇంజనీరింగ్ వంటి అనేక విభిన్న సబ్జెక్టులకు అనుగుణంగా విద్యా శిబిరాలు రూపొందాయి. పిల్లలకు మానవీయ శాస్త్రాలపై ఎక్కువ ఆసక్తి ఉంటే రచన, చరిత్ర లేదా భాషా పరిజ్ఞానంపై దృష్టి సారించే శిబిరాల కోసం దృష్టిపెట్టాలి. అలాగే శాస్త్ర సాంకేతిక అంశాలు బోధించే సైన్స్ ప్రయోగాలు, పజిల్స్, ప్రాజెక్టు చేయగలిగే అరవింద్‌గుప్తా టాయ్స్, లో కాస్ట్ నో కాస్ట్ యాక్టివిటీ పట్ల పిల్లలకు తర్ఫీదు ఇవ్వాలి. భవిష్యత్తులో జరిగే సైన్స్ ఫెయిర్, ఎగ్జిబిషన్లలో పాల్గొనడానికి, సైన్స్ అవార్డులు సాధించడానికి ఆసక్తి చూపుతారు. శాస్త్ర సాంకేతిక, క్రీడా రంగంలో రాణించిన వారిని పరిచయం చేస్తే గొప్పగా ప్రేరణ పొందుతారు.
ఆరోగ్యం, ఆహారం శిబిరాలు 
పిల్లలకు మంచి ఆరోగ్య, ఆహార అలవాట్లు పెంపొందించేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎంత మోతాదులో తినాలి, ఎప్పుడు తినాలి, ఎందుకు తినాలి, నీళ్లు ఎందుకు తాగాలి, ఎన్ని తాగాలి, ఎప్పుడు తాగాలి అనే అంశాలు శిబిరాలలో బోధిస్తే మంచి ఆరోగ్య అలవాట్లు పెంపొందించిన వారవు తారు. చేతి గోర్లు పొట్టిగా కత్తిరించుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత చేతులు కడుక్కోవడం వంటివి నేర్పిం చాలి. శారీరక వైకల్యాలు, అనారోగ్య సమస్యలు లేదా మానసిక ఆరోగ్య సవాళ్లు ఉన్న పిల్లలకు ఒక గొప్ప అనుభవాన్ని అందించడంపై దృష్టి సారించే వివిధ రకాల వేసవి శిబిరాలు అందుబాటులోకి రావాలి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.