- బిజెపికి రాజీనామా చేసిన పార్టీ రాష్ట్రకార్యదర్శి
చెన్నై, జూన్ 6: తమిళనాడు భారతీయ జనతా పార్టీలో సంక్షోభం మరింత ముదురుతోంది. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కే.అన్నామలై, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కరు నాగరాజన్ పార్టీని వీడిన కొన్ని రోజుల్లోనే మరో కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సుమతి వెంకటేష్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన భావోద్వేగ లేఖను పంచుకున్నారు. భారమైన హృదయంతో తప్పుకుంటున్నానని.. చాలా రోజులు ఆలోచించిన తర్వాతే తాను ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు సుమతి వెంకటేష్ తెలిపారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తూ, పార్టీతో తన అనుబంధాన్ని ముగిస్తున్నానని ఆమె తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ఈ పార్టీలో పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని కూడా సుమతి అన్నారు. అయితే, పార్టీ వీడినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, జాతీయవాదం, దేశభక్తి సిద్దాంతాలు తనకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయని సుమతి వెంకటేష్ స్పష్టం చేశారు. తన పదవీ కాలంలో సహకరించిన జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలకు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడులో బీజేపీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లిన కె. అన్నామలై ఇటీవల పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వంశపారంపర్య రాజకీయాలు, వ్యక్తిగత ఆరాధనలకు దూరంగా, సాధారణ ప్రజల రాజకీయం తీసుకురావడమే లక్ష్యంగా తాను సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అన్నామలై దారిలోనే ఇప్పుడు మిగిలిన కీలక నేతలు కూడా నడుస్తుండటం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





