ప్ర‌పంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగిన బీజేపీ

– తెలంగాణ‌లో జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌
– రామ‌గుండం ఎరువుల క‌ర్మాగారాన్ని పున‌రుద్ధ‌రించింది కేంద్ర‌మే
– కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల్లోకి వెళ్లి కేంద్ర ప‌థ‌కాలు ప్ర‌చారం చేయాలి
– దీన్‌ద‌యాళ్ ప్ర‌శిక్ష‌ణ శిబిరంలో రామ‌చంద్ర‌రావు
హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, జూన్ 6:  రాజకీయాల్లో, సమాజంలో, ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మార్పులను నిరంతరం అధ్యయనం చేస్తూ, కాలానుగుణంగా తనను తాను మలుచుకుంటూ ముందుకు సాగే పార్టీ బీజేపీ. అందుకే ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఎదిగింద‌ని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు అన్నారు. యాదగిరిగుట్టలో పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ శిబిరంలో శ‌నివారం ఆయ‌న కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే 12 సంవత్సరాల పాలన పూర్తి చేశారు. ప్రస్తుత పదవీకాలానికి ఇంకా మూడేళ్లు ఉండగా ఆ తర్వాత కూడా మరో ఐదేళ్లపాటు దేశానికి నాయకత్వం వహిస్తారని విశ్వసిస్తున్నాన‌న్నారు. ఇటీవల హిందూ పత్రిక నిర్వహించిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యం కలిగించాయ‌న్నారు. ఒకప్పుడు ఏబీవీపీ, ఆర్ ఎస్ ఎస్‌ నేపథ్యంలో పనిచేసిన వ్యక్తిగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే బాధ కలుగుతుంద‌న్నారు. ప్రధానమంత్రి ఉత్తర భారతదేశానికి చెందినవారు, రాష్ట్రపతి ఉత్తర భారతదేశానికి చెందినవారు, హోం మంత్రి ఉత్తర భారతదేశానికి చెందినవారు, రక్షణ మంత్రి ఉత్తర భారతదేశానికి చెందినవారు. వాళ్లకు వెళ్లి నేను సెల్యూట్ చేయాలా? తనకు సిగ్గుగా ఉంటుందని అన‌డం బాధ‌ క‌లిగించింద‌న్నారు. ఈ వ్యాఖ్యలు దక్షిణాది-ఉత్తరాది అనే విభజన భావనను ప్రోత్సహించే విధంగా ఉన్నాయ‌న్నారు. ఇటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాన‌న్నారు.మ‌రి ఇదే రేవంత్ రెడ్డి, రాహుల్  గాంధీ, సోనియా గాంధీని కలవడానికి, వారి ఆదేశాల మేరకు పనిచేయడానికి వెళ్లలేదా? అప్పుడు మీకు సిగ్గు అనిపించలేదా?  అన్నారు. నరేంద్ర మోదీ  నాయకత్వంలో తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు వేల కోట్ల రూపాయలు కేటాయించారు. ఇటీవల రూ.7597 కోట్లతో రెండు జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆర్మూర్ – జగిత్యాల- మంచిర్యాల హైవేతోపాటు జగిత్యాల- కరీంనగర్ హైవేను నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ఆమోదించింది. రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ చేసింది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ఆమోదం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వరంగల్‌లో పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్క్‌ను మంజూరు చేసింది. జహీరాబాద్‌లో పారిశ్రామిక పార్క్ ఏర్పాటుకు సహకరించింది. పేదలకు ఉచిత బియ్యం అందిస్తోంది. ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలను తీసుకువచ్చింది.ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని నిధులు, ఇన్ని సంస్థలు తెలంగాణకు వచ్చిన తర్వాత కూడా కేంద్రం ఏమీ చేయలేదని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం అసత్య ప్రచారమేన‌న్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల‌ కాలంలో ఎన్నో వివాదాలు, అవినీతి ఆరోపణలు, కమిషన్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిన గొప్ప పని ఏమిటో చెప్పలేని పరిస్థితి ఉంది. హైదరాబాద్ నగర అభివృద్ధిలో కూడా కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకంగా ఉంది.రాబోయే రోజుల్లో జీహెచ్‌ఎంసీ, మల్కాజ్ గిరి, సైబరాబాద్ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసి వాటిని ఆదర్శ నగరాలుగా తీర్చిదిద్దుతాం. స్వనిధి పథకం ద్వారా హైదరాబాద్ నగరంలో కూడా వేలాది మంది స్ట్రీట్ వెండర్లు లబ్ధి పొందుతున్నారు. స్వచ్ఛ భారత్, స్వనిధి, అమృత్ వంటి పథకాలతోపాటు వివిధ పథకాలతో హైదరాబాద్ నగర సుందరీకరణకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకరిస్తోంద‌న్నారు. ఈ శిక్షణ తరగతులు పూర్తయ్యాక ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయికి వెళ్లాలి. ప్రజల మధ్యకు వెళ్లాలి. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో చురుకుగా పాల్గొనాలి. అర్హులైన ఓటర్ల పేర్లు నమోదు చేయించాలి. దొంగ ఓట్లను తొలగించేలా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలి అని దిశానిర్దేశం చేశారు.
———————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *