తెలంగాణలో ‘సర్‌’ ‌పక్రియ మొదలు

– అలర్ట్ అవుతున్న రాజకీయ పార్టీలు

                                                                                              (మండువ రవీందర్‌రావు)

దేశవ్యాప్తంగా వోటరు జాబితా ప్రక్షాళనలో భాగంగా ఈ నెల 25 నుండి తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర వోటరు జాబితా సవరణ ( స్పెషల్‌ ఇన్‌టెన్సివ్‌ ‌రివిజన్‌- ‘‌సర్‌’) ‌ప్రక్రియ మొదలుకానుంది. భారత ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ రివిజన్‌ ‌పక్రియ జూలై 26 వరకు సాగనుంది. ప్రస్తుతం తెలంగాణలో జరుగనున్నది మూడవ విడత ప్రక్షాళన. రెండు తెలుగు రాష్ట్రాలతో కలిపి మొత్తం 16 రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగనుంది. అయితే ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో జరిగిన వోటరు ప్రక్షాళనలో భాగంగా వివిధ కారణాలతో లక్షలాది మంది  వోటర్లను తొలగించారు. ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ధేశించేది  వోటర్లే కావడంతో అనూహ్యంగా లక్షలాది సంఖ్యలో  వోటర్లను ఎలిమినేట్‌ ‌చేయడంతో రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. బీహార్‌, ‌తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో ఇటీవల జరిగిన పరిణామాలు వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల్లో గుబులు పుట్టిస్తున్నాయి. బీహార్‌లో 68 లక్షల అయిదువేల  వోటర్లను తొలగించగా, తమిళనాడులో 97 లక్షల 37వేలు, పశ్చిమ బెంగాల్‌లో 58లక్షల 21వేల  వోటర్లను తొలగించడంతో ఆయా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామన్న నమ్మకంతో ఉన్న పార్టీలకు నిరాశే ఎదురైంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ పక్రియలో దాదాపు 50 లక్షల మంది  వోటర్లకు ఉద్వాసన పలికే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2025 సెప్టెంబర్‌నాటికి రాష్ట్రంలో మూడు కోట్ల 35 లక్షల  వోటర్లున్నారు. అయితే ఇందులో ఎంతమందిని  తొలగిస్తారోనన్న  భయం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు పట్టుకుంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌, ‌ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌తోపాటు బిజెపి, ఎంఐఎం పార్టీలు ఈ విషయంలో తమ క్యాడర్‌ను అప్రమత్తం చేస్తున్నాయి. తమకు తప్పకుండా పడుతాయన్న  వోట్లు జాబితా నుండి మాయం కాకుండా డేగ కన్నుతో పర్యవేక్షించాలని ఆయా పార్టీలు వారిని చైతన్యం చేస్తున్నాయి. బూత్‌లెవల్‌ అధికారుల వెంటవెంటనే ఉండాలని తమ పార్టీ బూత్‌ ‌లెవల్‌ ఏజంట్‌లకు చెప్పడంతోపాటు వారికి తగిన శిక్షణను కూడా ఇస్తున్నాయి. తమ పార్టీ సానుభూతిపరులు ఒక వేళ ఇంట్లో లేకపోతే వారు ఎక్కడికి వెళ్ళింది, మారిన చోటున కూడా తమ  వోటును జాబితాలో ఎక్కించుకున్నారా లేదా అని క్షుణ్ణంగా పరిశీలించాలని ఆ పార్టీలు తమ క్యాడర్‌లకు సూచిస్తున్నాయి. మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మారినవారి పేర్లు, ఇతర ప్రాంతంలో కూడా పేరు నమోదు అయి ఉండడంలాంటి వారి విషయంలో తగు జాగ్రత్తగా వ్యవహరించాలంటూ తమ నాయకులను ఆయా పార్టీలు అప్రమత్తం చేస్తున్నాయి. ఒక వేళ తమ పేరు జాబితా లేకపోయినా తిరిగి చేర్పించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ  అది కష్టతరమైన ప్రక్రియ కాబట్టి  వోటరు కూడా తమ పేరు జాబితాలో ఉండే విధంగా సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ముఖ్యంగా కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, కాంగ్రెస్‌ ‌పట్ల అప్రమత్తంగా ఉండాలని బిఆర్‌ఎస్‌ ‌పార్టీ తన శ్రేణులకు పిలుపునిచ్చింది. వోటరు ప్రక్షాళనను అడ్డుపెట్టుకుని విపక్ష పార్టీలకు అనుకూల వోటర్లను తొలగించే ప్రమాదం లేకపోలేదని, ఇప్పటికే  కేంద్ర ప్రభుత్వంపై ఆ మేరకు ఆరోపణలు ఉన్న విషయాన్ని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌తమ నాయకులు, కార్యకర్తలకు గుర్తుచేశారు. తాజాగా జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల సందర్భంలో దొంగ వోట్లు చేర్చి కాంగ్రెస్‌ ‌లబ్ధిపొందిందన్న విషయాన్నికూడా తన క్యాడర్‌కు గుర్తుచేశారు. ఎన్నికల కమిషన్‌ ఇప్పుడు తయారు చేసే జాబితా అత్యంత కీలకమైందని, దీన్నిబట్టే జిహెచ్‌ఎం‌సీతోపాటు మరో రెండేళ్లలో శాసనసభ ఎన్నికలు జరుగుతాయని, అందుకు బూత్‌లెవల్‌ అధికారులతో తమ పార్టీకి చెందిన బూత్‌లెవల్‌ ఏజంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్‌కూడా బిజెపి కుట్రచేసే అవకాశముందంటూ తమ క్యాడర్‌ను అప్రమత్తం చేస్తున్నది. సెక్యులర్‌ ‌భావాలు కలిగిన వారి  వోట్లను తొలగించే ప్రమాదముందని చెబుతొంది. ఈమేరకు బిఎల్‌ఏలు,  సోషల్‌ ‌సెక్యూరిటీ అసిస్టెంట్స్‌తో దీనిపై సమావేశాన్ని ఏర్పాటుచేసింది. కాగా మంత్రులు కూడా తమ నియోజకవర్గం  పై దృష్టి సారించాలని సూచించింది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బిజెపి.. కేంద్ర నాయకత్వం పర్యవేక్షణలో కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. ఆ పార్టీ కూడా బూత్‌లెవల్‌ ఏజంట్లను అప్రమత్తం చేయడంతోపాటు  ముఖ్యనేతల మధ్య ఉన్న పొరపొచ్చాలను సమన్వయ పర్చే ప్రయత్నాలు చేస్తున్నది. ఈ విషయంలో స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితీన్‌ ‌నబీన్‌ ‌స్వయంగా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తున్నది. త్వరలో ఏర్పాటు చేయనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన స్వయంగా పాల్గొనడమే కాకుండా, ఇక్కడే రెండు రోజులపాటు ఉండే అవకాశాలున్నాయంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాషాయ జండాను ఎగురవేయాలంటే ప్రజల్లోకి మరింతగా పార్టీని తీసుకెళ్ళేవిధంగా ఆ పార్టీ వ్యూహరచన చేస్తున్నది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *