– హైదరాబాద్ చేరుకున్న స్పీకర్ ప్రసాద్‌కుమార్ టీం
– ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికిన అభిమానులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్(సీపీఏ) ఆధ్వర్యంలో చేపట్టిన స్టడీ టూర్‌ను విజయవంతంగా ముగించుకుని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు వికారాబాద్ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఘన స్వాగతం పలికారు. యూరప్ పర్యటనలో భాగంగా జర్మనీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్ దేశాల్లో పలు అధ్యయన కార్యక్రమాల్లో స్పీకర్ బృందం పాల్గొంది. స్టడీ టూర్‌లో భాగంగా ఆయా దేశాల పార్లమెంటరీ వ్యవస్థలు, శాసనసభల పనితీరు, ప్రజాస్వామ్య ప్రక్రియలు, చట్టాల రూపకల్పన విధానాలు, శాసనసభల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం, చట్టాల రూపకల్పన విధానాలు, ప్రజాప్రతినిధుల బాధ్యతలు వంటి అనేక కీలక అంశాలపై ఈ బృందం అధ్యయనం చేసింది. తెలంగాణ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి స్పీకర్ బృందం యూరప్ పర్యటనలో విదేశీ ప్రతినిధులకు, పెట్టుబడిదారులకు వివరించింది. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి, తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు అందిస్తున్న సహాయ, సహకారాలు, భద్రత, పారదర్శక విధానాల గురించి వివరించి, వారిలో భరోసా కల్పించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారికంగా చేపట్టిన యూరప్ పర్యటన విజయవంతమైందని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. స్పీకర్‌తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసనసభ కార్యదర్శి రెండ్ల తిరుపతి, శాసనమండలి కార్యదర్శి నరసింహాచార్యులు కూడా విదేశీ పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరందరికీ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా స్పీకర్ ప్రసాద్ కుమార్ చేపట్టే కార్యక్రమాలు మరింత ముందుకు సాగాలని నాయకులు, అభిమానులు ఆకాంక్షించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





