– బల్మూరి, దయాకర్‌లకు సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు
– కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాలో మధ్యంతర ఉత్తర్వులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 28 : బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్)పై తప్పుడు ఆరోపణలు చేయవద్దంటూ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్‌లను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. కేటీఆర్ దాఖలు చేసిన రూ.10 కోట్ల పరువు నష్టం దావాలో విచారణ సందర్భంగా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దావాలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించి కేటీఆర్‌పై మరిన్ని తప్పుడు ఆరోపణలు చేయరాదని స్పష్టం చేసింది. కేటీఆర్‌పై డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ఆరోపణలు చేయడం, ఆయనను డ్రగ్స్‌కు బానిసగా చిత్రీకరించడం, డ్రగ్స్ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారనే అభిప్రాయాన్ని కలిగించడం, మహిళలు, సినీ ప్రముఖులు, ఇతర ప్రముఖులతో వ్యక్తిగత సంబంధాలపై ఆరోపణలు చేయడం వంటి అంశాలను కేటీఆర్ తన దావాలో సవాలు చేశారు. సరైన ధ్రువీకరణ లేకుండా వీడియోలు, ఇంటర్వ్యూలు, వార్తా కథనాల ద్వారా ఇలాంటి ఆరోపణలను ప్రచారం చేయడం వల్ల తన ప్రతిష్ఠకు భంగం కలిగిందని పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది పి.విశ్వజనని కోర్టులో బుధవారం వాదనలు వినిపించారు. వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాస్పద ఆరోపణలకు సంబంధించిన ఇప్పటికే ప్రచురించిన వీడియోలు, వార్తా కథనాలను తొలగించాలని సంబంధిత మీడియా సంస్థలను కోర్టు ఆదేశించింది. భవిష్యత్తులోనూ దావాలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించిన ఇలాంటి కంటెంట్‌ను ప్రచురించవద్దని ఆదేశాలు జారీ చేసింది. తనపై తప్పుడు, పరువు నష్టం కలిగించే ప్రచారాన్ని నిలువరించడంతో పాటు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ కేటీఆర్ రూ.10 కోట్ల నష్టపరిహారంతోపాటు తప్పనిసరి, శాశ్వత నిషేధాజ్ఞల కోసం సివిల్ దావా దాఖలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





