విద్యార్థి సంఘాల ఎన్నికలతోనే ప్రజాస్వామ్యానికి పునాది

– రవాణా శాఖ మంత్రి పొన్నం 
– ఆర్టీసీ ఎన్నికల్లో విజయం సాధించిన ఐక్య కూటమి నేతలకు సత్కారం

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: ప్రజాస్వామ్యంలో ప్రతి స్థాయిలో ఎన్నికలు జరగడం ఎంతో కీలకమని, కార్మిక సంఘాల ఎన్నికల మాదిరిగానే విద్యార్థి సంఘాల ఎన్నికలు కూడా అత్యంత ముఖ్యమని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు, వారి హక్కులను కాపాడేందుకు ప్రజాస్వామ్యబద్ధమైన నాయకత్వం ఏర్పడాలని, తాను కూడా విద్యార్థి సం ఘాల ఎన్నికల ద్వారానే రాజకీయాల్లోకి వచ్చానని ఆయన గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించిన ఐక్య కూటమి (ఈయూ, టీఎంయూ, ఎన్ఎంయూ) ప్రతినిధులు శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయం సాధించిన నేతలను మంత్రి అభినందించి సత్కరించారు.

కార్మికుల సంక్షేమం, సంస్థ అభివృద్ధికి ప్రాధాన్యం

మంత్రి పొన్నం మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, సంస్థను లాభాల బాట పట్టించడం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలను తొందరపాటు నిర్ణయాలతో కాకుండా, నిర్మాణాత్మకంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆర్టీసీ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు సమన్వయంతో చర్చించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కార్యాచ రణ రూపొందించాలని కోరారు.

బకాయిల కోసం భూముల విక్రయానికైనా సిద్ధం

ఆర్టీసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బకా యిలను చెల్లించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. అవసరమైతే సంస్థకు చెందిన విలువైన భూములను విక్రయించిసరే రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను తీరుస్తాం. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాను అని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన సీసీఎస్ బకాయిలతో పాటు ఇతర పెండింగ్ సమస్యలను కోర్టు తీర్పునకు అనుగుణంగా చట్టబద్ధంగా పరిష్కరిస్తామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *