– డీఈవోలకు విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలని డీఈవోలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ డీఈవోలకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభానికి ముందే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థుల అభ్యాస ఫలితాలు, విద్యా నాణ్యత మెరుగుదలకు అన్ని పాఠశాలల్లో అకాడమిక్ ప్యానెల్ తనిఖీలు నిర్వహించాలని మార్గనిర్దేశం చేశారు. ఏ పాఠశాలలోనూ ఉపాధ్యాయుల కొరత ఉండకూడదని అన్నారు. ఉపాధ్యాయుల నియామకాలు, సర్దుబాటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పాఠశాల మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో పనిచేసేలా నిర్వహించాలని నవీన్ నికోలాస్ దిశానిర్దేశర చేశారు. విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యాజ్ఞానం బలోపేతం చేయడంతో పాటు ప్రీ-ప్రైమరీ విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశిరచారు. యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్ తదితర విద్యార్థుల హక్కుల పంపిణీని సకాలంలో పూర్తి చేయాలని మార్గనిర్దేశం చేశారు. అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నాణ్యత, తయారీ, వడ్డింపు పక్రియలను నిరంతరం పర్యవేక్షించాలని నవీన్ నికోలాస్ ఆదేశించారు. విద్యార్థుల నమోదు పెంపు కార్యక్రమాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ విద్యార్థుల అభ్యాస ఫలితాల మెరుగుదల సంవత్సరంగా మార్చేందుకు సమష్టి కృషి, నిబద్ధతతో పనిచేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలాస్ సూచించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



