విద్యాశాఖలో రూ.2 వేల కోట్ల కుంభకోణం

– అప్పులు తేవడానికి దళారులను పెట్టుకున్న ప్రభుత్వం
– రాష్ట్రం ఇచ్చిన కమీషన్లతో విమానం కొన్న ముంబై బ్రోకర్
– సీఎం గెస్ట్ హౌస్‌కు, హెలికాప్టర్ షికార్లకు డబ్బులెక్కడివి?
– మీనాక్షి నామినేషన్ తిరస్కరణ వెనుక రేవంత్ సన్నిహితుడి కుట్ర
– ఫార్మా సిటీ రద్దుతో ఏపీకి తరలిశ్రీ పెట్టుబడులు
– కాంగ్రెస్ పాలకులపై బీఆరఎస్ నేత హరీష్‌రావు ధ్వజం

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : కమీషన్ల కోసం కాంట్రాక్టులు కుదరకపోవడం వల్లే బడుల ప్రారంభాన్ని సీఎం రేవంత్‌రెడ్డి వాయిదా వేశారని అసెంబ్లీలో బీఆరఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి.హరీష్‌రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ మాట్లాడారు. ఏటా జూన్ 12న తెరవాల్సిన స్కూళ్లను 15వ తేదీకి ఎందుకు వాయిదా వేశారంటూ దీని వెనుక రూ.2 వేల కోట్ల భారీ కుంభకోణం దాగి ఉందన్నారు. బీఆరఎస్ ప్రభుత్వంలో గురుకులాలు, ప్రభుత్వ బడుల్లో యూనిఫామ్ కుట్టే బాధ్యత చేనేత కార్మికులకు, షూ, బెల్టుల తయారీ దళిత కుటుంబాలు బతకాలని లిడ్‌క్యాప్‌కు ఇస్తే రేవంత్ రెడ్డి వాటిని సెంట్రలైజ్ చేసి  గుజరాత్ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టాడని ఆరోపించారు. ఆ కాంట్రాక్టర్ నుంచి ఇంతవరకు బట్టలు రాలేదని తెలిపారు. ఏడు లక్షల మంది గురుకుల విద్యార్థులకు ఇవ్వాల్సిన బ్యాగులు, డ్రెస్సులు, బెల్టులు, నోట్ బుక్స్ ఏవీ ఇంకా అందలేదన్నారు. అన్యాయం జరిగిందని చేనేత సంస్థలు కోర్టుకు కూడా వెళ్లాయని, విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రే ఉండటం వల్ల విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఆయన విమర్శించారు. సీఎం కనుసన్నల్లో రేట్లు డబుల్ చేసి మరీ టెండర్లు ఫైనల్ చేసి భారీ అవినీతికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ స్కూళ్లలో పిల్లల సంఖ్య దారుణంగా తగ్గిపోయిందని సాక్షాత్తూ కేంద్రమే నివేదిక ఇస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి యూకేజీ అని కట్టుకథలు చెబుతున్నారన్నారు. బడుల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలే కావడం లేదు. అమ్మ ఒడి కమిటీల ద్వారా పనులు చేసిన మహిళా సంఘాలకు, పేదలకు ఒక్కో నియోజకవర్గానికి రూ.4 కోట్ల చొప్పున బిల్లులు పెండింగ్ పెట్టారు.. బడుల్లో పనిచేసే స్కావెంజర్లకు సైతం నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వలేదు అని హరీష్ రావు వెల్లడించారు.

అప్పులు తేవడానికి దళారులు

ఎఫఆర్‌బీఎం పరిమితికి మించి వేల కోట్ల అప్పులు తేవడానికి ఈ ప్రభుత్వం ఏకంగా దళారులను పెట్టుకుందన్నారు. అప్పులు ఇప్పించినందుకు ఆ బ్రోకర్లకు వందల కోట్లు కమీషన్లుగా దోచిపెడుతున్నారని, కమీషన్లు ముట్టజెప్పగానే ముంబైకి చెందిన ఆ బ్రోకర్ ఏకంగా ఓ విమానమే కొనుక్కున్నాడని తెలిపారు.

పెంచిన భూముల ధరలతో ఇబ్బందులు

అడ్డగోలుగా పెంచిన భూముల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హరీష్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైందని, ఇతర రాష్ట్రాల్లో కొన్ని ఎసఎఫ్‌టీల వరకు తక్కువ ధరలు నిర్ణయిస్తే ఇక్కడ మాత్రం ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేశారన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పన్నుల మీద పన్నులు వేస్తూ పేదల నడ్డి విరుస్తోందని, ఆర్టీయే చార్జీలు, రిజిస్ట్రేషన్ చార్జీలు, మద్యం ధరలు ఇప్పటికే పెంచారు.. ఇప్పుడు మందుల ధరలు కూడా పెంచబోతున్నారని తెలిపారు. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు భూమి శిస్తు కూడా తెస్తామని ముఖ్యమంత్రి అంటున్నాడన్నారు.

మీనాక్షి వెనుక పెద్ద కుట్ర

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణకు గురికావడం వెనుక సొంత పార్టీ నేతల కుట్రే దాగి ఉందని హరీష్‌రావు వెల్లడించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశించిన రేవంత్‌కు అత్యంత సన్నిహితుడైన వ్యక్తే ఈ వెన్నుపోటుకు పాల్పడినట్లు తమకు పక్కా సమాచారం ఉందన్నారు. గతంలో ఆమెకు రాజ్యసభ సీటు రాకుండా అడ్డుకున్న వ్యక్తే ఇప్పుడు ఈ కుట్ర చేశాడన్నారు. దీనిపై రేవంత్ రెడ్డి సిట్‌తో విచారణ చేûస్తాడా.. లేక ఇంకేదైనా విచారణ చేస్తాడా అని నిలదీశారు.

విలాసవంతమైన గెస్ట్ హౌస్‌లు కట్టుకుంటున్నాడు

సెక్రటేరియట్‌కు వెళ్లని రేవంత్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను తన క్యాంపు కార్యాలయంగా మార్చుకున్నాడని, ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో మరో క్యాంపు కార్యాలయం కట్టుకుంటున్నాడని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో తన నివాసానికి కొద్ది దూరంలోనే ఏకంగా రూ.100 కోట్లతో బోధి పెవిలియన్ పేరుతో విలాసవంతమైన గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నాడని, అర్ధరాత్రిపూట సతీసమేతంగా వెళ్లి పనులను పర్యవేక్షిస్తున్నాడని, మొదట వీవీఐపీ గెస్ట్ హౌస్ పేరుతో రూ.7 కోట్లతో జీవో ఇచ్చి దాన్ని రూ.100 కోట్లకు పెంచారని ఆరోపించారు. దాని చుట్టూ రూ.17 కోట్లతో ఇనుప కంచెలు, ఫుట్‌బాల్ ఆట కోసం రూ.10 కోట్లతో స్టేడియం నిర్మిస్తూ ముఖ్యమంత్రి సోకులు పోతున్నాడని వ్యాఖ్యానించారు. ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మంలో తన సొంతానికి మూడో క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్నాడన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు, రైతులకు సాయం చేయడానికి ఖజానాలో డబ్బులు లేవంటున్న ప్రభుత్వానికి వందల కోట్లతో గెస్ట్ హౌస్‌లు కట్టుకోవడానికి నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయని ప్రశ్నించారు. ఇక మొన్నటివరకు నెలకు రూ.2 కోట్ల అద్దెతో తిరిగిన హెలికాప్టర్ స్థానంలో ఇప్పుడు నెలకు ఏకంగా రూ.5 కోట్లు వెచ్చించి మరీ కొత్త హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి షికార్లు చేస్తున్నాడన్నారు.

పెట్రోల్‌పై రాష్ట్ర పన్నులు తగ్గించాలి

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఈ ప్రభుత్వానికి అదనంగా రూ.2 వేల కోట్ల ఆదాయం రాబోతోందని హరీష్‌రావు తెలిపారు. కేంద్రం పెంచిందని ధర్నాలు చేసే బదులు అనేక రాష్ట్రాలు తగ్గించినట్లు ఇక్కడ స్టేట్ ట్యాక్స్ తగ్గించాలని సీఎంను హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఫ్యూచర్ సిటీ అని గొప్పలు చెబుతున్న ఆ ప్రాజెక్టు ఇప్పుడు అక్కడి చుట్టుపక్కల గ్రామాలకు ఓ శాపం కాబోతోందన్నారు. హెచఎండీఏ ద్వారా అప్పులు తేవడమే కాక రెగ్యులర్ ట్యాక్స్‌తోపాటు కొత్తగా టోల్ గేట్లు పెట్టి మరీ అడిషనల్ ఇంపాక్ట్ ఫీజు పేరుతో ప్రజల జేబులు గుల్ల చేయబోతున్నారని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ఫ్యూచర్ సిటీని కచ్చితంగా రద్దు చేస్తామని చెప్పారు. ఫార్మా సిటీలో పెట్టుబడులు పెడదామని ఎంతోకాలంగా ఎదురుచూసిన కంపెనీలు ఈ ప్రభుత్వ తీరుతో విసిగిపోయి ఏపీలోని శ్రీసిటీలో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత మంత్రులు భట్టి విక్రమార్క, సీతక్క, స్వయంగా రేవంత్ రెడ్డి.. తాము అధికారంలోకి రాగానే ఫార్మాసిటీ రైతుల భూములు తిరిగి ఇస్తామని అనేకసార్లు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇపుడు ఆ భూములను కాంగ్రెస్ అనుయాయులకు అప్పగిస్తామంటే తాము ఊరుకోమని హరీష్ హెచ్చరించారు. ఈ భూమిని ఇతర అవసరాలకు వాడితే అనుమతులు వాటంతట అవే రద్దవుతాయని స్పష్టమైన నిబంధన ఉందన్నారు. ఫార్మాసిటీ కోసం నా సొంత భూమి 17 ఎకరాలు ఇచ్చానని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల ఇవాళ రాష్ట్రం ఆదాయం కోల్పోవడంతోపాటు ఇక్కడి పిల్లలకు రావాల్సిన ఉద్యోగాలు కూడా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ హయాంలో జర్నలిస్టుల సంక్షేమ నిధి కింద రూ.100 కోట్లు కేటాయించామని, అత్యధిక సంఖ్యలో అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చింది కూడా తామేనని చెప్పారు. హైదరాబాద్ మినహా జిల్లాల్లో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చామని, గజ్వేల్, జహీరాబాద్ లాంటి నియోజకవర్గాల్లో ఇళ్లు కూడా కట్టించి ఇచ్చామని గుర్తు చేశారు. జర్నలిస్టులకు ఎలాంటి వివాదాలు లేని భూములు ఎన్నో ఉన్నాయన్నారు. ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఇస్తామంటే తాము వ్యతిరేకించడం లేదని, అక్కడ ఇప్పటికే కొందరు రైతులు కేసులు వేసినందున ఎలాంటి ఇబ్బందులు లేని భూములు జర్నలిస్టులకు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. సుప్రీంకోర్టు కేసు కొట్టివేసిందని చెబుతున్నప్పుడు జర్నలిస్టులకు ఆ పాత భూములే ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫీజులు పెంచారు

మేనిఫెస్టోలో నిరుద్యోగులకు పరీక్షా ఫీజులు ఫ్రీ అని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల ఫీజులను సైతం అడ్డగోలుగా పెంచేశారని హరీష్‌రావు విమర్శించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని మగవాళ్లకు చార్జీలు డబుల్ చేశారని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో బీఆరఎస్ గురించి పదేపదే మాట్లాడుతున్నాడు.. తాము ‘చెల్లని నోటు’ అయితే తమ గురించి నిద్రలో కూడా ఎందుకు కలవరిస్తున్నాడని అడిగారు. బీఆరఎస్ క్షేత్రస్థాయిలో చాలా స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టే ఆయనకు నిద్రలో కూడా తామే గుర్తొస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *