ఫీజు బకాయిలు చెల్లించేదాకా పోరు ఆగదు

– గోల్కొండ పిఎస్‌ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు హెచ్చరిక
– మహా ధర్నాకు అనుమతి నిరాకరించినందుకే అసెంబ్లీ ముట్టడి
– పోలీసుల తోపులాటలో గాయపడ్డ పలువురు నాయకులు
– ఐసీయూలో అమీర్‌పేట్ కార్పొరేటర్ సరళ

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 7 : పేద విద్యార్థులకు రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ, బీజేవైఎం చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శాంతియుత ఆందోళనలపై పోలీసులు దాడి చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండించింది. అరెస్టులు, పోలీసు నిర్బంధాలకు ఎంతమాత్రం భయపడేది లేదని, రూ.15,000 కోట్ల ఫీజు బకాయిలు పూర్తిస్థాయిలో విడుదల చేసేదాకా తమ పోరాటం ఆగదని బీజేపీ స్పష్టం చేసింది. ఇందిరా పార్క్ వద్ద ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నా చేసుకోవడానికి పోలీసు యంత్రాంగం అనుమతి నిరాకరించడంతో బీజేపీ శ్రేణులు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఆందోళనలో పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావుతోపాటు పలువురు కీలక నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా ఈడ్చివేసి అరెస్టు చేశారు. అరెస్టయి గోల్కొండ పోలీస్ స్టేషన్ నిర్బంధంలో ఉన్న రామచందర్ రావు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే అక్క‌డే మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల హక్కుల కోసం ధర్నా చౌక్ వద్ద మహా ధర్నాకు అనుమతి నిరాకరించినందుకే ప్రజాస్వామ్య పద్ధతిలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చామని స్పష్టం చేశారు. పోలీసుల తోపులాట, లాఠీచార్జ్ వల్ల పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారని రామచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనలో పాల్గొన్న అమీర్‌పేట్ కార్పొరేటర్ సరళను నిర్బంధించే క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో కుల్సుంపుర పోలీస్ స్టేషన్ సమీపంలోని హాస్పిట‌ల్‌ ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇటీవ‌ల‌ ఎనిమిది లక్షల మంది విద్యార్థుల సంతకాలతో విన‌తిపత్రం ఇవ్వడానికి ప్రయత్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, సీఎస్‌ను కలవడానికి వెళ్లినా అరెస్టు చేశారని ఆయ‌న‌ మండిపడ్డారు. అఫ్జల్‌గంజ్, గోషామహల్, కంచన్‌బాగ్ తదితర ప్రాంతాల్లో 600 మందికి పైగా కార్యకర్తలను అక్రమంగా నిర్బంధించారని తెలిపారు. గోల్కొండ పీఎస్‌లో తమతోపాటు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, మీడియా ఇన్‌చార్జి ఎన్.వి.సుభాష్ సహా 50 మంది నాయకులను ఉంచారని, ఫీజుల బకాయిలు విడుదల చేసే వరకు పోరాటం ఆగదని రామచందర్ తేల్చిచెప్పారు.

సీఎం ఇంటి ముట్టడికి వెనుకాడం: బీజేవైఎం

ప్రభుత్వ నిరంకుశ వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులను, బీజేవైఎం కార్యకర్తలను ఏకం చేసి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటినే ముట్టడిస్తామని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే హెచ్చరించారు. రాజ్యాంగబద్ధంగా లభించిన నిరసన హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు.

‘చోటా హిట్లర్’ పాలన సాగుతోంది : ఎంపీ డీకే అరుణ 

రాష్ట్రంలో నిరంకుశ, నిర్బంధ పాలన సాగిస్తున్నారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రామచందర్ రావును అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ‘చోటా హిట్లర్’ పాలన కొనసాగుతోందని, ప్రజల సమస్యలపై గళమెత్తితే అణచివేయడమే లక్ష్యంగా రాజ్యాంగ విరుద్ధమైన పాలన సాగిస్తున్నారని విమర్శించారు. అక్రమ అరెస్టులకు బీజేపీ భయపడబోదన్నారు. ప్రభుత్వం వెంటనే రామచందర్ రావుతోపాటు ఇతర నాయకులను, విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే విద్యార్థుల పక్షాన బీజేపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని అరుణ హెచ్చరించారు.

ఇదేం ప్రజాస్వామ్యం రేవంత్ రెడ్డీ..: ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

40 లక్షల మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, వివాదాస్పద 22ఏ నిషేధిత జాబితా నుంచి పేదల భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడికి నడుం బిగించిన తమ పార్టీ శ్రేణులపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసులతో ఉక్కుపాదం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాడుతున్న రామచందర్ రావును అసెంబ్లీ వద్ద అక్రమ అరెస్టు, పలువురు రాష్ట్ర నాయకులు, బీజేవైఎం కార్యకర్తలను నిర్బంధించడం దారుణమన్నారు. పోలీసుల తోపులాటలో మహిళా నాయకురాలు, అధికార ప్రతినిధులు గాయపడటం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఇందిరా పార్కు వద్ద శాంతియుతంగా ధర్నా చేసుకుంటామంటే అనుమతి నిరాకరించిన ప్రభుత్వం తమ గోడు చెప్పుకోవడానికి అసెంబ్లీ వైపు వస్తే లాఠీలతో, పోలీసులతో అణచివేయాలని చూడటం దుర్మార్గమన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే పోలీసులను అడ్డం పెట్టుకుని పాలించిందో నేడు రేవంత్ సర్కార్ అంతకుమించి అరాచకంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అక్రమ అరెస్టులతో, పోలీసుల నిర్బంధాలతో తమ గొంతును నొక్కలేరనేది రేవంత్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ పార్టీ నేతలను, కార్యకర్తలను బేషరతుగా వెంటనే విడుదల చేయాలని, 22ఏ దందాపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్య పాలన నడవడట్లేదు : రాణి రుద్రమ

త‌మ‌ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు విచక్షణారహితంగా దాడులకు తెగబడటంపై బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్లిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్.గౌతం రావు, వీరేందర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుందే, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్.వి.సుభాష్, మాజీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, మహిళా నాయకురాలు, కార్పొరేటర్ సరళ, జనగామ జిల్లా అధ్యక్షుడు రమేష్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించినందుకు అరెస్టులు చేస్తారా అని రేవంత్ రెడ్డిని ఆమె నిలదీశారు. హిట్లర్ లాగా నియంతృత్వ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఫీజుల కోసం రెండు రోజులపాటు రామచందర్ రావు దీక్ష చేపట్టినా ప్రభుత్వంలో స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల దాడిలో కార్పొరేటర్ సరళకి తీవ్ర గాయాలైతే ఐసీయూలో చేర్చారని, పద్మ గౌడ్ కి తీవ్ర గాయాలయ్యాయని, స్పృహ కోల్పోవడంతో జనగామ జిల్లా అధ్యక్షుడిని ఐసీయూలో అడ్మిట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. యువమోర్చా ఆడపిల్లలని విచక్షణారహితంగా కొట్టారని, పార్టీ నాయకురాలు జయశ్రీ తోపాటు ఇతర ముఖ్య నాయకులను గొర్రెల మందను ఈడ్చుకెళ్లినట్లు వ్యాన్లలో తోసి స్టేషన్లలో పడేశారని మండిపడ్డారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *