విద్యార్థుల జీవితాల‌తో ఆడుకోవద్దు

– విద్యార్థుల భవిష్యత్తు కాలేజీ గడప దాటడం లేదు
– ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలి
–  సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 7 : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ విద్యార్థుల భవిష్యత్తు మాత్రం కాలేజీ గడప దాటడం లేదని బబీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీ ష్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేపటి తెలంగాణను నిర్దేశించాల్సిన యువతను నేడు సర్టిఫికెట్ల కోసం నడిరోడ్డు మీద నిలబెట్టారని విమర్శించారు. ప్రతిపక్షాలను తిట్టడం, అసత్యాలు ప్రచారం చేయడం మీద ఉన్న శ్రద్ధ.. ఈ రాష్ట్ర బిడ్డలు పడుతున్న గోస మీద ఎందుకు లేదని ప్రశ్నించారు.ఎంతోమంది విద్యార్థులు తనను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారని, ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు పూర్తి చేసినా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయని కన్నీళ్లు పెట్టుకున్నారని తెలిపారు. ఎంతో కష్టపడి చదివి, కార్పొరేట్ కంపెనీల్లో 6, 7 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించినా ఆ ఆఫర్ లెటర్లు చేతిలో పట్టుకుని సర్టిఫికెట్ల కోసం ఏడుస్తూ కూర్చోవాల్సిన దుస్థితికి ఈ పిల్లలను తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు లేక అటు ఉద్యోగాల్లో చేరలేక, ఇటు పై చదువులకు, విదేశాలకు వెళ్లలేక లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతోందన్నారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పేద విద్యార్థులకు మేలు జరుగుతుందన్న సదుద్దేశంతో కేసీఆర్ ఏనాడూ ఆపలేదని గుర్తుచేశారు. కేసీఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ. 20,576 కోట్లను విడుదల చేసి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు అండగా నిలబడ్డారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేదవాడికి ఉన్నత విద్యను దూరం చేయాలని చూస్తోందని ఆరోపించారు. లక్షల కోట్ల టెండర్లు పిలుస్తూ కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు రాత్రికి రాత్రే వేల కోట్ల బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థుల ఫీజులు చెల్లించడానికి మాత్రం మనసు రావడం లేదని విమర్శించారు. ప్రభుత్వం ఇకనైనా మొండి వైఖరి విడనాడి, తక్షణమే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి, సర్టిఫికెట్లు అందక ఉద్యోగాలు కోల్పోతున్న విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *