~ డీజీపీ సీవీ ఆనంద్ హెచ్చరికలు
~ బక్రీద్ సందర్భంగా పోలీసు అధికారులతో వీసీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, పశుసంవర్ధక శాఖ సెక్రెటరీ కె.ఇలంబరి, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ ఆనంద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థాయిలో జరిగిన చర్చలు, అనంతరం ఉప ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశ నిర్ణయాల మేరకు ఈ నెల 27న జరిగే బక్రీద్ పండుగ సందర్భంగా పశువుల అక్రమ రవాణాను పూర్తిగా నిరోధించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బక్రీద్.. ఇతర పండగల కంటే అత్యంత సున్నితమైనదని, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా రెండు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇటీవల పశువుల అక్రమ రవాణా ఘటనలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలు కోసమే ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పశువుల రవాణా విషయంలో కౌ స్లాటర్ యాక్ట్-1977, ట్రాన్స్‌పోర్ట్ యాక్ట్-1978, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ-1960 చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో 52 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 203 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు డీజీపీ వెల్లడించారు. అనుమానాస్పద ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేయాలని, ముఖ్యంగా రానున్న 15 రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే పశువుల సంతలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. చెక్‌పోస్టుల వద్ద పశువుల రవాణాకు సంబంధించిన ‘ఫీట్ టు ట్రాన్స్‌పోర్టేషన్’, ‘ఫిట్ టు స్లాటర్’ వంటి ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, పండగ ముగిసే వరకు తనిఖీలు నిరంతరాయంగా కొనసాగాలని ఆదేశించారు. పశువుల రవాణాపై ఎవరికైనా అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం అందించాలే తప్ప నేరుగా రోడ్లపైకి వచ్చి ఘర్షణ వాతావరణం సృష్టించకూడదని ఖురేషీలు, గోరక్షక బృందాలకు సూచించారు. నిబంధనలు మీరి రాద్ధాంతం చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు సస్పెక్ట్ షీట్లు కూడా తెరుస్తామని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు రెండు వర్గాల వారితో విడివిడిగా సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. పోలీస్, మున్సిపల్ పశుసంవర్ధక, రెవెన్యూ శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని, ఇందుకోసం ప్రత్యేక వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసుకుని సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంచుకోవాలని సూచించారు. సీజ్ చేసిన పశువులను సంరక్షించేందుకు క్యాటిల్ పాండ్‌లను ఏర్పాటు చేయాలని, అక్కడ పశువులకు అవసరమైన సౌకర్యాలు ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచాలని, గందరగోళం సృష్టించేలా పోస్టులు పెట్టే వారిని స్టేషన్లకు పిలిపించి హెచ్చరించాలని చెప్పారు. గతంలో బక్రీద్ సందర్భంగా నమోదైన కేసులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. జయేష్ రంజన్ మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు బక్రీద్ పండగ అప్రమత్తతో ఉన్నారని తెలిరు. కౌ స్లాటర్ యాక్ట్, ట్రాన్స్‌పోర్టు యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ చట్టాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇలంబర్తి మాట్లాడుతూ పశువుల రవాణాకు సంబంధించిన సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అవసరమైన ప్రాంతాల్లో వెటర్నరీ డాక్టర్లను ఎల్లవేళలా అందుబాటులో ఉంచుతున్నామన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి, శాంతిభద్రతల డీజీపీ మహేష్ ఎం భగవత్, ఐజీపీలు చంద్రశేఖర్ రెడ్డి, షానవాజ్ ఖాసిం, కార్తికేయ, ఇంటెలిజెన్స్ డీఐజీ భాస్కరన్ తదితరులు పలు సూచనలు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





