– మహిళల సాధికారతను ప్రతిబింబించేలా కార్యక్రమాలు
– మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25 నుంచి 31 వ తేదీ వరకు నిర్వహించనున్న మహిళా వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖలపై మంగళవారం సమీక్షాా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళల సాధికారతకు అమలు చేస్తున్న పథకాలు, జీవనోపాధి కార్యక్రమాలు, ఆర్థిక స్వావలంబన చర్యలు ప్రజలకు స్పష్టంగా తెలియజేసేలా కార్యక్రమాలు ఉండాలని సూచించారు. కనీసం నాలుగు వేల గ్రామాల్లో మహిళా భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళా సంఘ సభ్యుల విజయగాథలను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా సాధించిన ఆర్థిక పురోగతి, ఉపాధి అవకాశాలు, మహిళల నాయకత్వ వికాసం, సామాజిక మార్పు వంటి అంశాలను ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. కాగా, ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల పురోగతిని మంత్రి సమీక్షించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, వ్యవసాయ, అనుబంధ, వ్యవసాయేతర రంగాల్లో ఉపాధి, వ్యాపార అవకాశాల కల్పనకు సంబంధించిన కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. మహిళలను ఉద్యోగార్ధులుగా కాక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 63 లక్షలకుపైగా మహిళలు స్వయం సహాయక సంఘాల్లో భాగస్వాములై ఉన్నారని, దేశంలోనే అతిపెద్ద మహిళా ఆధారిత అభివృద్ధి వ్యవస్థగా తెలంగాణ నిలుస్తోందని పేర్కొన్నారు. అయిదేళ్లలో రూ.లక్ష కోట్ల క్రెడిట్ లింకేజ్ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు. గత రెండేళ్లలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి రూ.60,487 కోట్ల బ్యాంకు లింకేజ్ సాధించడం ద్వారా మహిళల ఆర్థిక భాగస్వామ్యం గణనీయంగా పెరిగిందన్నారు. వ్యక్తిగత మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వడ్డీ లేని రుణాల పథకం ద్వారా పేద కుటుంబాలకు గణనీయమైన ఉపశమనం లభిస్తోందని మంత్రి తెలిపారు. బీఆరఎస్ హయంలో నిలిచిపోయిన వడ్డీ లేని రుణాల పథకాన్ని తిరిగి ప్రారంభించామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఇప్పటివరకు 4.38 లక్షల సంఘాలకు రూ.1400 కోట్లు విడుదల చేసి దాదాపు 48 లక్షల పేద కుటుంబాలకు లబ్ది చేకూర్చినట్లు పేర్కొన్నారు.
సమర్థవంతంగా లోన్ బీమా, ప్రమాద బీమా పథకాలు
మహిళా సంఘ సభ్యులకు భద్రత కల్పించే దిశగా ప్రవేశపెట్టిన లోన్ బీమా, ప్రమాద బీమా పథకాలు సమర్థవంతంగా అమలవుతున్నాయన్నారు. సభ్యురాలి మరణం సంభవించినప్పుడు రూ.2 లక్షల వరకు రుణ బీమా రక్షణ అందిస్తున్నామని, 2,993 క్లెయిమ్‌లకు రూ.23.72 కోట్లు చెల్లించినట్లు, ప్రమాద బీమా పథకం కింద 228 క్లెయిమ్‌లకు రూ.22.28 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళల ఆధ్వర్యంలో 2.36 లక్షల సూక్ష్మ వ్యాపార యూనిట్లు ఏర్పాటు కావడం ద్వారా రూ.4,166 కోట్లకు పైగా ఆర్థిక కార్యకలాపాలు జరిగాయని మంత్రి వివరించారు. జిల్లా సమాఖ్యల కోసం రూ.110 కోట్లతో 22 ఇందిరా మహిళా శక్తి భవనాలు నిర్మిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న 222 క్యాంటీన్లు ఒక్కో యూనిట్‌కు నెలకు సగటున రూ.72 వేల లాభం ఆర్జిస్తూ నలుగురి నుంచి అయిదుగురు మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు. ఇందిరా మహిళా శక్తి బజార్ ద్వారా మహిళా వ్యాపారవేత్తలకు మార్కెట్ అవకాశాలు విస్తరించాయని, 106 రిటైల్ దుకాణాల ద్వారా కోట్ల వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. మహిళా సంఘాల సమాఖ్యలు రూ.200 కోట్ల పెట్టుబడితో 593 బస్సులను కొనుగోలు చేసి నిర్వహిస్తున్నాయని, ఒక్కో బస్సు ద్వారా నెలకు సగటున రూ.69 వేలకుపైగా ఆదాయం వస్తోందని వివరించారు. గత ఏడాది 3195 వరి కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలు నిర్వహించి రూ.158 కోట్ల కమీషన్ ఆర్జించాయని తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకులు నెలకు రూ.6 నుంచి రూ.7 లక్షల వరకు ఆదాయం సాధిస్తున్నాయని, మొదటి యూనిట్ ఆరు నెలల్లోనే రూ.13.82 లక్షల లాభం సాధించిందని చెప్పారు. మరో 30 పెట్రోల్ బంకుల ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. సమగ్ర మహిళా సాధికారత దిశగా దివ్యాంగులు, వృద్ధ మహిళలు, కిశోర బాలికలను కూడా సంఘాల పరిధిలోకి తీసుకొస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ప్రస్తుతం 77,670 మంది దివ్యాంగులు, 83,325 మంది వృద్ధ మహిళలు, లక్ష మంది కిశోర బాలికలు ప్రత్యేక సంఘాల ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబన, నాయకత్వ వికాసం, సామాజిక భద్రత, డిజిటల్ సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను మహిళా వారోత్సవాల ద్వారా ప్రజల్లో విస్తృతంగా చాటి చెప్పాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ దానకిషోర్, పంచాయతీరాజ్ కమిషనర్, సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా తదితర అధికారులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





