విజ‌య్.. విన్న‌ర్‌

~ విశ్వాస పరీక్షలో 144 మంది మద్దతు
~ బల పరీక్షను బహిష్కరించిన డీఎంకే
~ అన్నాడీఎంకే చీలిక వర్గం టీవీకేకు అనుకూల ఓటు
~ ప్రజల విశ్వాసాన్ని కాపాడుకుంటా : సీఎం విజయ్

చెన్నై, మే 13: తమిళనాడు అసెంబ్లీలో బ‌ల నిరూప‌ణ‌లో సీఎం విజ‌య్ నెగ్గారు. బుధవారం జరిగిన బలపరీక్షలో 144 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు. మరో 22 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఐదుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు. ఈ సందర్భంగా మూజువాణి ఓటుకు బదులుగా స్పీకర్ సభలో ఒక్కో సభ్యుడి మద్దతు గురించి అడిగి తెలుసుకుని వారి ఓటును నమోదు చేసుకున్నారు. కాంగ్రెస్, లెప్ట్ పార్టీలు, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీల ఎమ్మెల్యేలు టీవీకేకు అనుకూలంగా ఓటు వేశారు. అన్నాడీఎంకేకు చెందిన పలువురు రెబెల్ ఎమ్మెల్యేలూ విజయ్‌కు మద్దతుగా నిలిచారు. ఇక డీఎంకే ఈ విశ్వాస పరీక్షను బహిష్కరించింది. పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. దీంతో సభలో సభ్యుల సంఖ్య తగ్గి మ్యాజిక్ మార్కులో కూడా ఆ మేరకు కోత పడింది. ఈ క్రమంలో బల పరీక్షలో సీఎం విజయ్ సులువుగా నెగ్గారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వంలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రజలను నమ్ముకునే ఎన్నికల బరిలోకి దిగామని గుర్తు చేసుకున్నారు. అన్ని వర్గాలకు తమపై నమ్మకం ఉందన్నారు. తమను గెలిపించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక టీవీకేకు మద్దతిచ్చిన అన్నాడీఎంకే రెబెల్ ఎమ్యెల్యేల తరపున సీనియర్ నేత వేలుమణి మాట్లాడుతూ తాము ఎలాంటి మంత్రి పదవులనూ ఆశించట్లేదని చెప్పారు. ప్రలోభాలు చూపించి మద్దతు కూడగట్టాల్సిన అవసరం తమకు లేదని విజయ్ ఈ సందర్భంగా బదులిచ్చారు. తమ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతిచ్చిన పార్టీలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మా ప్రభుత్వం ఐదేళ్లపాటు ఉంటుంది.. లౌకిక విధానాన్ని అవలంబిస్తూ పాలన సాగిస్తాం.. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తాం.. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టిసారిస్తాం.. అందరికీ సామాజిక న్యాయాన్ని అందించే బాధ్యత మాది‘ అని విజయ్ పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఓఎస్‌డీ నియామకంపై వచ్చిన విమర్శలపై స్పందిస్తూ దాన్ని పునఃసమీక్షిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక విధుల అధికారిగా రిక్కి రాధన్ పండిట్ వెట్రివేల్‌ను నియమించడంపై పలు పార్టీల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అంతకుముందు చర్చ సందర్భంగా శాసనసభలో ఒకింత గందరగోళం నెలకొంది. అన్నాడీఎంకే అధినేత, మాజీ సీఎం పళనిస్వామి మాట్లాడుతూ విజయ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. తమ ఎమ్మెల్యేలకు ఆయన డబ్బులు ఆఫర్ చేశారని ఆరోపించారు. బలపరీక్షకు ముందు తమ పార్టీ ఎమ్మెల్యేలను సీఎం కలవడం సమంజసం కాదన్నారు. అన్నాడీఎంకే ఐక్యంగానే ఉందని, తమ ఎమ్మెల్యేలంతా విజయ్‌కు వ్యతిరేకంగా ఓటేస్తారని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలను అన్నాడీఎంకే రెబల్ వర్గం ఎమ్మెల్యేలు ఖండించారు. తామంతా విజయ్‌కే మద్దతిస్తామని రెబల్ వర్గం నేత వేలుమణి స్పష్టం చేశారు. ఇక చర్చలో డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ విజయ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘ఈ రాష్ట్రానికి రియల్ ప్రభుత్వం కావాలి.. రీల్ ప్రభుత్వం కాదు.. టీవీకే ప్రభుత్వానికి మెజారిటీ లేదు.. మా కూటమిలోని పార్టీలు ఇప్పుడు మద్దతివ్వడం వల్లే విజయ్ గట్టెక్కగలుగుతున్నారు.. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడ్డారు.. దీనివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిన్నది‘ అని అన్నారు. విజయ్‌ను రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు తిరస్కరించారన్నారు. విశ్వాస పరీక్ష సందర్భంగా అన్నాడీఎంకే మద్దతును కొనుగోలు చేసినట్టు ఆరోపణలున్నాయన్నారు. ఇప్పటివరకు డీఎంకే అమలు చేసిన పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం బలపరీక్ష ఓటింగ్‌లో పాల్గొనబోమంటూ సభ నుంచి డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు.
““““““`
వెట్రివేల్ విషయంలో యూటర్న్.. విమర్శలతో నియామకం రద్దు 

జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్ విషయంలో తమిళనాడు సీఎం విజయ్ వెనక్కు తగ్గారు. ఆయనను తన ఓఎస్‌డీగా నియమిస్తూ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేశారు. ఒక జ్యోతిష్యుడిని ఓఎస్‌డీగా నియమించడం ఏమిటని ప్రతిపక్షాలు, మిత్రపక్షాల నుంచి విమర్శలు వచ్చిన నేపథ్యంలో విజయ్ వెనక్కు తగ్గారు. వెట్రివేల్ నియామక ఉత్తర్వులను రద్దు చేసినట్టు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. తాజాగా అసెంబ్లీలో బలపరీక్షకు ముందు వీసీకే ఎమ్మెల్యే వాణి అర్సు ఓఎస్‌డీ అంశాన్ని లేవనెత్తారు. శాస్త్రీయ‌త‌, తార్కిక ఆలోచనా ధోరణితో ముందుకు సాగాలన్నారు. మూఢనమ్మకాలను పక్కనపెట్టాలని చెప్పారు. ‘మన ప్రభుత్వం జ్యోతిష్యానికి కాక శాస్త్రీయ‌ దృక్పథానికి ప్రాధాన్యం ఇవ్వాలి’ అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రాధన్ నియామక ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రిక్కి రాధన్ పండిట్ వెట్రివేల్ దగ్గర విజయ్ జ్యోతిష సలహాలు తీసుకుంటుంటారు. ఎన్నికలకు ముందే ఆయన టీవీకే విజయాన్ని ఊహించారు. జయలలిత సహా పలువురు ప్రముఖ నాయకులకు కూడా ఆయన సలహాలు ఇచ్చేవారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *