సాధారణ శ్వాస.. సులభంగా మాట

– కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో అరుదైన శ్వాసనాళ చికిత్స
– మూసుకున్న శ్వాసనాళాన్ని తెరిచి మళ్లీ శ్వాస, మాట సామర్థ్యం కల్పన
– అడ్వాన్స్‌డ్ రిజిడ్ బ్రోంకోస్కోపీ, సిలికాన్ స్టెంట్‌తో విజయవంతమైన చికిత్స

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : వెన్నెముక శస్త్రచికిత్స తర్వాత నెలలతరబడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతూ సరిగా మాట్లాడలేని 60 ఏళ్ల రోగికి కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీలో వైద్యులు అత్యాధునిక శ్వాసనాళ చికిత్స నిర్వహించి మళ్లీ సాధారణ శ్వాస, మాట్లాడే సామర్థ్యాన్ని కల్పించారు. హైదరాబాద్‌కు చెందిన ఈ రోగి ప్రమాదంలో గాయపడడంతో ముందుగా వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్నారు. కోలుకునే సమయంలో శ్వాస సౌకర్యం కోసం ట్రాకియోస్టమీ చేశారు. ట్రాకియా అంటే ఊపిరితిత్తులకు గాలి వెళ్లే ప్రధాన శ్వాసనాళం. అనంతర కాలంలో పలుమార్లు ట్యూబ్ తొలగించే ప్రయత్నాలు చేసినా విజయవంతం కాలేదు. దీంతో రోగి శ్వాస తీసుకోవడంలోనేకాక మాట్లాడటంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తరచూ శ్వాస సమస్యలు కొనసాగడంతో రోగిని కేర్ హాస్పిటల్స్ హైటెక్ సిటీ పల్మనాలజీ విభాగానికి తరలించారు. వైద్యులు నిర్వహించిన బ్రోంకోస్కోపీ పరీక్షల్లో ట్రాకియల్ స్టెనోసిస్ అనే ప్రమాదకర పరిస్థితిని గుర్తించారు. శ్వాసనాళం దాదాపు 90 శాతం వరకు కుచించుకుపోయి ఉండటంతో పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. దీర్ఘకాలం వెంటిలేటర్ లేదా శ్వాస సహాయక పరికరాలపై ఉండే రోగుల్లో ఇలాంటి సమస్యలు కొన్నిసార్లు కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. రోగి పరిస్థితిని స్థిరపరిచిన తర్వాత సీనియర్ కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సతీష్ సి రెడ్డి, కన్సల్టెంట్ ఈఎన్టీ, హెడ్ అండ్ నెక్ సర్జరీ నిపుణుడు డాక్టర్ ఎం.అబ్దుల్ అమ్జాద్ ఖాన్ నేతృత్వంలోని వైద్య బృందం అత్యంత క్లిష్టమైన రిజిడ్ బ్రోంకోస్కోపీ ప్రక్రియను నిర్వహించింది. అడ్వాన్స్‌డ్ ఎలక్ట్రో కాటరీ నైఫ్ టెక్నిక్, సీఆర్ఈ బెలూన్ డైలటేషన్ ద్వారా మూసుకుపోయిన శ్వాసనాళాన్ని జాగ్రత్తగా తెరిచారు. తిరిగి సమస్య రాకుండా ఉండేందుకు సిలికాన్ స్టెంట్‌ను అమర్చారు. ఈ అత్యాధునిక మినిమల్లి ఇన్వేసివ్ చికిత్స వల్ల పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండానే రోగికి వెంటనే ఉపశమనం లభించింది. చికిత్స అనంతరం రోగి మళ్లీ సులభంగా మాట్లాడగలిగే స్థితికి చేరుకోవడంతోపాటు సాధారణ స్థితిలో శ్వాస తీసుకోవడం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ సతీష్ సి రెడ్డి మాట్లాడుతూ ‘దీర్ఘకాలం శ్వాస సహాయక పరికరాలపై ఉండే రోగుల్లో ట్రాకియల్ స్టెనోసిస్ అనే సమస్య కొన్నిసార్లు కనిపిస్తుంది. ఈ రోగిలో శ్వాసనాళం దాదాపు పూర్తిగా మూసుకుపోయింది. దీనివల్ల శ్వాస తీసుకోవడం, మాట్లాడటం రెండూ తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న ఆలస్యం కూడా ప్రాణాపాయంగా మారొచ్చు. అయితే ఆధునిక ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సాంకేతికతలతో పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండా శ్వాసనాళాన్ని పునరుద్ధరించగలిగాం. ఇలాంటి సమస్యల్లో ముందస్తు గుర్తింపు, సమయానికి చికిత్స ఎంతో కీలకం’ అని తెలిపారు. ఈ కేసు ద్వారా క్లిష్టమైన శ్వాసనాళ సమస్యల చికిత్సలో అడ్వాన్స్‌డ్ బ్రోంకోస్కోపీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ సేవలు ఎంత కీలకంగా మారుతున్నాయో మరోసారి స్పష్టమైందని వైద్యులు పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *