ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ

– ఫ్యూచర్ సిటీలో ఉబెర్ కార్పొరేట్ ఆఫీస్
– ముఖ్యమంత్రితో భేటీ అయిన ఉబెర్ సీఈవో

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 13 : ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉబెర్ సంస్థకు సూచించారు. అవకాశం ఉంటే మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉబెర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) దారా ఖోస్రోషాహి నేతృత్వంలోని ప్రతినిధి బృందం భేటీ బుధవారం అయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలంగాణలో ఉబెర్ సంస్థ వ్యాపార కార్యకలాపాలను దారా ఖోస్రోషాహి వివరించారు. హైదరాబాద్‌లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విస్తరిస్తున్నట్లు తెలిపారు. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదేనని, ఇక్కడ 60 మంది ఇంజినీర్లు పనిచేస్తున్నట్లు వివరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో ఉబెర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి ఆయన ముందుకు వచ్చారు. భవిష్యత్తులో మరింత విస్తరణకు ఆసక్తి చూపుతున్నట్లు దారా ఖోస్రోషాహి తెలిపారు. ప్రభుత్వ సహకారం కావాలని ముఖ్యమంత్రిని కోరారు. దేశంలోని ప్రధాన నగరాల్లో పార్కింగ్ ప్రధాన సమస్యగా మారిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం ఉందంటూ మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఉబెర్ ప్రతినిధులకు సూచించారు. మెట్రో స్టేషన్ల దగ్గర తగిన పార్కింగ్ సౌకర్యం లేదని, దీని వల్ల అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ఈవీ ఛార్జింగ్ సెంటర్లతోపాటు పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం సూచించారు. దీనిపై తప్పకుండా అధ్యయనం చేస్తామని ఉబెర్ ప్రతినిధి బృందం తెలిపింది. హైదరాబాద్‌కు సమీపంలో భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి వివరించారు. 30 వేల ఎకరాల్లో నిర్మించే ఈ సిటీ ప్రపంచంలోనే ప్రత్యేకమైనదన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన 500 కంపెనీలను ఫ్యూచర్ సిటీకి ఆహ్వానిస్తున్నామని, ఇప్పటికే పలు సంస్థలు తమ కార్యకలాపాల కోసం ముందుకు వచ్చాయని తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయానికి 25 కి.మీ దూరంలోనే ఫ్యూచర్ సిటీ ఉందని చెప్పారు. గత డిసెంబర్‌లో ఇక్కడ నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో వందకు పైగా కంపెనీలు పాల్గొని పెట్టుబడులకు ముందుకొచ్చాయని తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీలో ఉబెర్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మాణానికి సీఈవో ఖోస్రోషాహి ఆసక్తి కనబరిచారు. సమావేశంలో ఉబెర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మధు కన్నన్, ఉబెర్ ఇండియా అండ్ సౌత్ ఆసియా ప్రెసిడెంట్ ప్రభ్‌జీత్ సింగ్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నిప్పల్లి నాగ, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *