పోక్సో కేసులో కుల ప్రసక్తి ఉండదు

– చట్టం అందరికీ ఒకేలా ఉంటుంది
– పొన్నం వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం: పీసీసీ చీఫ్ మహేశ్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12: మంత్రి పొన్నం ప్రభాకర్ వాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఖండించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కేసు వ్యవహారంలో మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి లేదా ప్రభుత్వానికి పొన్నం వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. గాంధీభవన్‌లో మహేశ్ గౌడ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. కుల సంఘం మధ్యవర్తిత్వం, వివాహం ద్వారా ఇలాంటి తీవ్రమైన కేసులను పరిష్కరించుకోవాలని పొన్నం అన్నారని తెలిపారు. ఆయన సూచనలను కాంగ్రెస్ ఖండిస్తోందని మహేశ్ గౌడ్ వ్యాఖ్యానించారు. మైనర్ల విషయంలో చట్టపరంగా ఇబ్బందులు తప్పవని చెప్పారు. పోక్సో చట్ట ప్రకారం నిందితులకు కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. నేర పరిశోధనలో నిందితుడి కులం లేదా సామాజిక హోదాతో సంబంధం లేదని తెలిపారు. బండి సంజయ్ ఈ కేసులో కుల రాజకీయాలను తీసుకురావడం దురదృష్టకరమని అన్నారు. ఈ కేసులో ఎవరినీ వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం కాంగ్రెస్‌కు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని తేల్చిచెప్పారు. ‘నారీ శక్తి’ అని నినాదాలు చేసే బీజేపీ.. ఇప్పుడు బాలికపై జరిగిన దాడి విషయంలో మౌనంగా ఉండటం దేనికి సంకేతం అని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. బాలిక కుటుంబ సభ్యులను భగీరథ్ బెదిరిస్తున్నట్లు వస్తున్న వార్తలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. నిజమని తేలితే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ కేసు విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం, కుల మతాల ప్రభావం లేకుండా పారదర్శకంగా విచారణ జరుగుతుందని, బాధితురాలికి తాము అండగా నిలుస్తామని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *