– రూ.200కోట్ల అవినీతిపై ప్రజలకు సమాధానం చెప్పాలి
– భువనగిరి ఎంపీ చామల డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ పేరుతో రూ.200 కోట్లు అవినీతి చేశారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. రాముడి పేరు చెప్పి వసూలు చేసిన డబ్బుతో ఏం చేస్తున్నారో బీజేపీ ప్రజలకు చెప్పాలన్నారు. అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ విరాళాల అవకతవకలపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్‌కు సంబంధించి ఎలాంటి అవినీతి జరగలేదని కార్యదర్శి చంపత్ రాయ్ చెప్పారని.. కానీ యూపీ సిట్ పోలీసులు చంపత్ రాయ్ మనుషులను అరెస్టు చేశారన్నారు. దేశ వ్యాప్తంగా ప్రజల సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని విరాళాలు వసూలు చేశారని అన్నారు. చంపత్ రాయ్‌ను ట్రస్ట్ కార్యదర్శి పదవి నుంచి తప్పించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. యూపీ సీఎం పదవికి యోగీ ఆదిత్య నాథ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇది యూపీకి సంబంధించిన వ్యవహారం కాదని.. దేశ ప్రజలకు సంబంధించిన అంశమన్నారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ ఎంపీలు 20 మందిని, మహారాష్ట్రలో శివసేన ఉద్దవ్ థాక్రే ఎంపీలు 6 మందిని.. ఒక్కొక్కరికీ రూ.75 కోట్లు ఇచ్చి బీజేపీ కొనుగోలు చేసిందంటూ వ్యాఖ్యానించారు. రామ జన్మభూమి ట్రస్ట్ అవినీతి వ్యవహారంలో ప్రధాని మోదీ, అమిత్ షా, యోగీ ఆదిత్య నాథ్ ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడారని చామల మండిపడ్డారు. చంపత్ రాయ్, అనిల్ మిశ్రాను పదవి నుంచి తప్పించి చేతులు దులుపుకుంటే సరిపోదన్నారు. దేశంలో ప్రజలు ఏ స్థితిలో ఉన్నా అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం విరాళాలు ఇచ్చారన్నారు. ’ప్రజలు దేవుడి కోసం డబ్బులు ఇచ్చారు. రు దోచుకోవడం కోసం కాదు’ అంటూ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.