స్టైఫండ్ డబుల్

– ఆయుష్ విద్యార్థులకు సర్కార్ గుడ్‌న్యూస్
– స్టైఫండ్స్ భారీగా పెంచుతూ జీవో జారీ
– మంత్రి దామోదర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన స్టూడెంట్స్

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : ఆయుర్వేదం, హోమియోపతి, యునాని, నేచురోపతి విభాగాల్లోని హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థుల స్టైఫండ్లను భారీగా పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఇప్పటివరకు హౌస్ సర్జన్లకు నెలకు రూ.13,754గా ఉన్న స్టైఫండ్‌ను రూ.29,792కు పెంచారు. పీజీ విద్యార్థుల స్టైఫండ్ రూ.34,385 నుంచి రూ.74,482కు పెరిగింది. స్టైఫండ్ పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయుష్ విద్యార్థులు, డాక్టర్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను సచివాలయంలో బుధవారం మధ్యాహ్నం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులకు పెంచిన స్టైఫండ్‌కు సంబంధించిన జీవో కాపీని అందజేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్కసారి కూడా తమ స్టైఫండ్ పెంచలేదని, దీంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటిది ఇప్పుడు అల్లోపతి మెడికోలతో సమానంగా తమ స్టైఫండ్‌ను పెంచడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. తమ సమస్యను పరిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహకు ఆయుష్ విద్యార్థులు, డాక్టర్ల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

‘ఆయుష్‌’కు మరింత ఆదరణ పెరగాలి : మంత్రి దామోదర్

ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన మంత్రి దామోదర్ రాజనర్సింహ వారికి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మంచి వైద్యులుగా ఎదిగి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఆయుష్ వైద్య విధానాలకు ప్రజల్లో మరింత ఆదరణ పెరిగేలా విద్యార్థులు, యువ వైద్యులు కృషి చేయాలని సూచించారు. విద్య అనేది ఉద్యోగం కోసం మాత్రమే కాదని, వ్యక్తిగత అభివృద్ధితోపాటు సమాజంలో గుణాత్మక మార్పుకు పునాది అని పేర్కొన్నారు. గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో ఆయుష్ వైద్య వ్యవస్థను బలోపేతానికి ప్రభుత్వం అనేక కీలక చర్యలు చేపట్టిందని మంత్రి దామోదర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 700మంది యోగా ఇన్‌స్ట్రక్టర్లను నియమించి ప్రజలకు యోగా, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. ఆయుర్వేదం, హోమియో, యునాని విభాగాల్లో 138మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించి ఆయుష్ వైద్య విద్య, బోధన వ్యవస్థను మరింత బలోపేతం చేశామని పేర్కొన్నారు. సిద్ధిపేట్, జయశంకర్ భూపాలపల్లి, వికారాబాద్ జిల్లాల్లో 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేసి ఆయుష్ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేశామని తెలిపారు. కరీంనగర్‌లో రూ.15 కోట్లతో 50 పడకల ఇంటిగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ నిర్మాణాన్ని చేపట్టామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ఆయుష్ హాస్పిటల్స్, క్లినిక్‌లను దశలవారీగా అప్‌గ్రేడ్ చేస్తూ మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన వైద్య సేవలందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఆయుష్ వైద్య విధానాలపై శాస్త్రీయ పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలని, కొత్త చికిత్సా విధానాలు, ఔషధాలపై పరిశోధన చేసి ఆయుష్ వైద్య విధానాలను మరింత బలోపేతం చేయాలని సూచించారు. ‘మీరు చదువుతో ఆగిపోవద్దు.. పరిశోధన వైపు కూడా అడుగులు వేయాలి.. మన సంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని ఆధునిక పరిశోధనతో అనుసంధానం చేసి ప్రపంచానికి పరిచయం చేయాల్సిన బాధ్యత యువ వైద్యులపై ఉంది’ అని మంత్రి రాజనర్సింహ అన్నారు. పేదలు, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఆయుష్ వైద్యులు కీలక పాత్ర పోషించాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *