క్రీడాకారుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం

– జిల్లాస్థాయి నుంచి ప్రాతినిధ్యం వహించిన వారికి ఉచిత శిక్షణ
– స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : క్రీడా శిక్షణ ఫీజుల సవరణపై కొందరు చేస్తున్న ప్రచారం పూర్తి వాస్తవాలను ప్రతిబింబించడం లేదని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్పష్టం చేసింది. క్రీడా శిక్షణను ప్రజలకు మరింత అందుబాటులో ఉంచడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులతోపాటు జిల్లాస్థాయి, అంతకంటే ఉన్నత స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఉచిత శిక్షణ కొనసాగుతుందని తెలిపింది. కొత్త ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం శిక్షణ పొందుతున్న వారిలో 42 శాతానికి పైగా మందికి ఉచిత కోచింగ్, క్రీడా సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. 14 సంవత్సరాల అనంతరం క్రీడా శిక్షణ ఫీజులను సవరించినట్లు అథారిటీ వివరించింది. క్రీడా మౌలిక వసతుల నిర్వహణ, స్టేడియాలు, మైదానాల సంరక్షణ, క్రీడా పరికరాల కొనుగోలు, కోచ్‌ల పారితోషికాలు, విద్యుత్, భద్రతా సేవలు తదితర వ్యయాలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అంతేకాక గత ఉత్తర్వుల్లో లేని విధంగా విద్యార్థుల ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఉచిత శిక్షణ కల్పించే అవకాశాన్ని కొత్త విధానంలో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.

ఫీజుల హేతుబద్ధీకరణకు కమిటీ

క్రీడాకారులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సవరించిన ఫీజుల నిర్మాణాన్ని సమగ్రంగా పరిశీలించి అవసరమైన హేతుబద్ధీకరణకు సిఫార్సులు చేయడానికి కమిటీని ఏర్పాటు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు స్పోర్ట్స్ అథారిటీ తెలిపింది. ఎల్‌బీ స్టేడియంలో స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ కె.శివసేనారెడ్డి, వైస్ ఛైర్‌పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ.సోనిబాలా దేవి ఆధ్వర్యంలో హైదరాబాద్ పరిధిలోని స్టేడియాల నిర్వాహకులు, కోచ్‌లు, డిప్యూటీ డైరెక్టర్లతో సోమవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏ ఆర్థిక ఇబ్బందులూ క్రీడా ప్రతిభకు అడ్డంకిగా మారకూడదని చైర్మన్ శివసేనారెడ్డి పేర్కొన్నారు. క్రీడాకారుల సంక్షేమమే స్పోర్ట్స్ అథారిటీకి అత్యున్నత ప్రాధాన్యమని, సమాజంలోని అన్ని వర్గాలకు క్రీడా శిక్షణ అందుబాటులో ఉండేలా చూడడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వార్షిక ట్యూషన్ ఫీజు రూ.35 వేల వరకు ఉన్న ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు కూడా ఉచిత శిక్షణకు అర్హులవుతారని చెప్పారు.

పెద్ద సంఖ్యలో క్రీడాకారులకు ఉచిత కోచింగ్

సవరించిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం స్పోర్ట్స్ అథారిటీ కేంద్రాల్లో శిక్షణ పొందుతున్న గణనీయమైన సంఖ్యలో క్రీడాకారులు ఇప్పటికే ఉచిత కోచింగ్‌కు అర్హులవుతున్నారని చైర్మన్ తెలిపారు. కేవీబీఆర్ ఇండోర్ స్టేడియంలో పది క్రీడా విభాగాల్లో శిక్షణ పొందుతున్న వారిలో 57 శాతం మందికి, జింఖానా మైదానంలో 65 శాతం మందికి, హుస్సేన్ సాగర్ వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్‌లో 88 శాతం మందికి ఉచిత కోచింగ్ అందనుంది. కయాకింగ్, కానోయింగ్ విభాగాల్లో శిక్షణ పొందుతున్న వారందరికీ (100 శాతం) ఉచిత శిక్షణ లభించనుంది. ఉస్మానియా యూనివర్సిటీ సైక్లింగ్ వెలోడ్రోమ్‌లో 57 శాతం మంది, ఎల్‌బీ స్టేడియంలో 42 శాతం మంది, జీఎంసీ బాలయోగి స్టేడియంలో 35 శాతం మంది ఉచిత కోచింగ్‌కు అర్హులవుతారని తెలిపారు. ఈ గణాంకాలే క్రీడా శిక్షణను పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులో ఉంచాలనే స్పోర్ట్స్ అథారిటీ సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

లాభాపేక్ష కాదు.. క్రీడాభివృద్ధే లక్ష్యం

స్పోర్ట్స్ అథారిటీ లాభాపేక్ష లేని ప్రజాసేవా సంస్థ అని, క్రీడల అభివృద్ధి, ప్రతిభావంతుల గుర్తింపు, నాణ్యమైన శిక్షణ, క్రీడాకారుల సంక్షేమం, మౌలిక సదుపాయాల బలోపేతమే తమ లక్ష్యమని శివసేనారెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌తోపాటు జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాల్లో నిర్వహిస్తున్న కోచింగ్ కార్యక్రమాలు, వేసవి శిక్షణ శిబిరాలు, ప్రతిభా అన్వేషణ కార్యక్రమాల ద్వారా ప్రతి సంవత్సరం వేలాది మంది యువ క్రీడాకారులకు శిక్షణ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. యువతకు మరింత విస్తృత స్థాయిలో క్రీడా అవకాశాలు కల్పించడం, ప్రతిభను ప్రోత్సహించడం, రాష్ట్రంలో బలమైన క్రీడా వ్యవస్థను నిర్మించడమే స్పోర్ట్స్ అథారిటీ ప్రతి నిర్ణయానికి మూల సూత్రమని ఆయన స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *