– మీ బెదిరింపులకుఎవరూ భయపడరు
– శుద్ధి కార్యక్రమాల ద్వారా దళితులను అవమానించారు
– ప్రతిపక్షంపై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సభాపతి స్థానాన్ని అవమానిస్తూ, బెదిరింపులకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ అని ధ్వజమెత్తారు. పదేళ్లపాటు పాలనలో ఉండి, మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన అనుభవజ్ఞులు, ఉన్నత విద్యనభ్యసించిన వారు సభలో స్పీకర్‌ను శాసించేలా ప్రవర్తించడం సభ్య సమాజానికి, ప్రజలకు తీవ్ర అవమానకరమని స్పష్టం చేశారు. తమ స్థానాల్లో కూర్చొని ప్రజా సమస్యలపై వాదనలు వినిపించాల్సిందిపోయి దాడి చేస్తాం, భయపెడతాం అనే ధోరణితో వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదని బీఆర్‌ఎస్ సభ్యులకు హితవు పలికారు. శాసనసభ నడుస్తున్న తీరును దేశమంతా గమనిస్తోందని భట్టి విక్రమార్క అన్నారు. వేళ్లు చూపే బెదిరింపులకు సభలో ఎవరూ భయపడేది లేదని, ప్రజాస్వామ్యంపై జరిగే దాడులను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల, సభ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సభాపతి స్థానాన్ని మరింత అవమానించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను తాము సహించేది లేదని స్పష్టం చేస్తూ స్పీకర్ ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తమ ప్రభుత్వం ఎల్లవేళలా వెన్నెముకలా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. సభా నియమాలను గౌరవిస్తూ సభ్యులందరూ తమ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపపడాల్సింది పోయి రహదారులపై పసుపు నీళ్లు చల్లి శుద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఆ పార్టీ నాయకులు దళితులను అవమానించేలా వ్యవహరించారని మండిపడ్డారు. వందల ఏళ్ల సామాజిక సంస్కరణలతో పురోగమించిన నాగరిక తెలంగాణ సమాజాన్ని తిరిగి మధ్యయుగాల నాటి పరిస్థితికి తీసుకెళ్లడానికి యత్నిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నాయకత్వ శుద్ధి కార్యక్రమంపైౖ సభలో చర్చ జరగాల్సిందేనని స్పష్టం చేశారు
సభాపతితో వాగ్వాదానికి దిగడం తగదు
బీఆర్ఎస్ సభ్యులు పదేపదే వెల్‌లోకి వచ్చి సభాపతితో వాగ్వాదానికి దిగడం, ఆయన సూచనలను పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు. సభను సజావుగా నిర్వహించేందుకు సభ్యులందరూ సహకరించాలన్నారు. ఈ సభ, ఈ రాష్ట్రం ఆత్మగౌరవంపై ఏర్పడింది.. ఆత్మగౌరవానికి భంగం కలిగించే ప్రయత్నాలు మంచిది కాదు.. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. బీఆరఎస్ సభ్యులు న్యాయం కోసం డిమాండ్ చేయడంపై భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సభాపతిని అవమానించేలా వ్యవహరించిన అనంతరం ఇంకా ఏం న్యాయం కావాలని ప్రశ్నించారు. ఏం జస్టిస్ కావాలి? జస్టిస్ కావాల్సింది ఈ రాష్ట్రంలోని దళిత, బహుజన వర్గాలకు. జస్టిస్ కావాల్సింది గిరిజనులకు. మీ చేతుల్లో అవమానాలకు గురైన ప్రజలందరికీ జస్టిస్ కావాలి అని విక్రమార్క అన్నారు. దళితుల పట్ల గతంలో జరిగిన అవమానకర ఘటనలను ప్రస్తావిస్తూ ఆయన బీఆరఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దళితులు నిరసన తెలిపిన ఘటనను కూడా ప్రస్తావిస్తూ సామాజిక న్యాయం విషయంలో ఎవరు ఎవరిని ప్రశ్నించాలో ఆలోచించుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సహనం పాటిస్తోందని, అయినప్పటికీ సభా కార్యకలాపాలకు పదేపదే అంతరాయం కలిగించడం సరికాదని అన్నారు. దొరతనపు పోకడలను ప్రజలు ఇక భరించడానికి సిద్ధంగా లేరని భట్టి విక్రమార్క అన్నారు. సభా గౌరవాన్ని కాపాడటంతోపాటు సామాజిక న్యాయం, ప్రజల ఆత్మగౌరవాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
కేసీఆర్ నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి : భట్టి
మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు సేవలు అందించాలని తాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శాసనసభలో బుధవారం సభ్యుల ఆందోళనల నేపథ్యంలో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి సభ్యులు సంయమనం పాటించి తమ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వం గానీ, ఈ సభ్యులు గానీ, ఈ సభ గానీ కేసీఆర్ చావును కోరుకోవడం లేదు.. ఆయన నిండుగా నూరేళ్లు జీవించాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా సేవలు అందించాలని బలంగా కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





