– సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8: రాష్ట్రంలో కూరగాయలు, పండ్ల తోటలు, తృణధాన్యాలు, ప్రత్యామ్నాయ పంటల సాగును మరింత విస్తరించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. కూరగాయలు, పండ్ల తోటలు, ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సాహంపై సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం సమావేశం జరిగింది. రైతులకు అధిక ఆదాయం అందించే కూరగాయల సాగును మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కూరగాయలు, పండ్ల తోటలు, తృణధాన్యాలు, ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి సాగు విస్తీర్ణాన్ని పెంచేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సహకారం, ఆర్థిక వనరులు, మార్కెటింగ్ సదుపాయాలను అందించేందుకు నాబార్డ్‌తోపాటు అన్ని సంబంధిత సంస్థలు, ఏజెన్సీల సహాయ సహకారాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నీటి వనరుల సమర్థ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, కూరగాయలు, పండ్ల తోటలు, ప్రత్యామ్నాయ పంటల్లో డ్రిప్ ఇరిగేషన్‌ను మరింత విస్తృతంగా ప్రోత్సహించాలని సీఎస్ సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలతోపాటు వ్యవసాయ, వెటర్నరీ విశ్వవిద్యాలయాలు సమన్వయంతో పనిచేసి రైతులకు మెరుగైన సాంకేతిక మార్గదర్శకత్వం అందించాలన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్తాస్ జానయ్య, పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం. జ్ఞాన ప్రకాష్, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ దండా రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




