బీజేపీ ఎమ్మెల్యేల తీరు స‌రికాదు

– మధ్య యుగపు నాటి ఆచారాలను బీఆర్ఎస్ అమలు చేస్తున్నది
– దిల్లీలో బీజేపీ, గల్లీలో బీఆర్ఎస్‌ది ఒకే భావ జాలం
– పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి సీత‌క్క ఆగ్ర‌హం

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : అసెంబ్లీ సమావేశాలను సజావుగా సాగనివ్వకుండా బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి వచ్చి నిరసన తెలపడంపై పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూఅ సీతక్క తీవ్రంగా మండిపడ్డారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సభను అడ్డుకోవడం సరికాదని, నిరసన విరమించి సభా కార్యక్రమాలకు సహకరించాలని బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ వేదికగా విజ్ఞప్తి చేశారు. దళితులు, అణగారిన వర్గాల పట్ల ఈ రెండు పార్టీల వైఖరి ఒకే విధంగా ఉందన్నారు. ఉత్తరాఖండ్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ నిర్వహించిన ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుద్ధి చేయడం బీజేపీ దళిత వ్యతిరేక మనస్తత్వానికి నిదర్శనమని సీతక్క అన్నారు. ఇది ఎంతటి దుర్మార్గమైన చర్యో ప్రజలు గమనిస్తున్నారన్నారు. అదే తరహాలో రాష్ట్రంలో బీఆర్ఎస్ వ్యవహరించిందని మంత్రి మండిపడ్డారు. దళితులు తమ నిరసనలో భాగంగా డప్పు మోగిస్తూ ముందుకు వెళ్లారని, డప్పు అనేది దళితులు, అణగారిన వర్గాల పోరాటానికి ప్రతీక అని అన్నారు. కేసీఆర్ ఫాం హస్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోనే నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. ‘దళితులు నడిచిన నేలపై పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేయడం దుర్మార్గమైన చర్య.. ఇది కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదు.. ఒక సామాజికవర్గాన్ని అవమానించడం’ అని సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల మూతికి ముంత కట్టి, నడుముకు తాటాకులు కట్టించిన మధ్యయుగపు నాటి అమానవీయ ఆచారాలను బీఆర్ఎస్ అమలు చేస్తుంటే బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దళితులు, అణగారిన వర్గాలపై వివక్ష జరిగినప్పుడు బీజేపీ ఎందుకు మౌనం వహిస్తోందని నిలదీశారు. బీజేపీ దళిత వ్యతిరేక విధానాన్ని ప్రశ్నించిన రాహుల్ గాంధీపై కూడా కేసులు పెట్టారని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నట్లు కనిపించినా వారి భావజాలం ఒక్కటేనని మంత్రి అన్నారు. దిల్లీలో ఉండే బీజేపీకి, గల్లీలో ఉండే బీఆర్ఎస్‌కు అనుబంధం ఉందని, అందుకే ఇద్దరూ ఒకే రకమైన భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. సభలో నిరసన తెలిపే హక్కు ప్రతి సభ్యుడికీ ఉందని, అయితే సభా కార్యక్రమాలను పూర్తిగా అడ్డుకోవడం మాత్రం ప్రజలకు నష్టం కలిగిస్తుందని సీతక్క అన్నారు. సమస్యలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతిపక్ష సభ్యులు తమ వాదనలను సభలో వినిపించాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *