– తాగునీటి భద్రతపై ప్రత్యేక దృష్టి
– నీటి లభ్యతతోపాటు వినియోగమూ పెరుగుతోంది
– ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి సమస్యాత్మక అంశాలపై ప్రత్యేక దృష్టి
– మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 18 : భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు తాగునీటి భద్రత కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫ్లోరైడ్, నైట్రేట్ వంటి సమస్యాత్మక అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు. గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్ అధికారులతో సచివాలయంలో ఆయన శుక్రవారం ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాU ప్రధాన కార్యదర్శి ఇ.శ్రీధర్, గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్ డైరెక్టర్ లక్ష్మణ్, డిప్యూటి డైరెక్టర్ పి.జ్యోతికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో భూగర్భ జలాల సంరక్షణ అన్నది అత్యంత ప్రాధాన్యతంశమని, ఈ విషయంలో రైతులకు ప్రత్యేక అవగాహన కలిగించేందుకు అధికారులు చొరవ చూపాలని సూచించారు. అదే సమయంలో నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడడంతోపాటు వృథాగా పోయే నీటిని నియత్రించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో భూగర్భ జలాల లభ్యత పెరుగుతున్నప్పటికీ అదే స్థాయిలో వినియోగం పెరుగుతున్నందున నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. 2024తో పోలిస్తే 2025లో జలాల వినియోగం 45.93 శాతం నుండి 46.86 శాతానికి పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. భూగర్భ జలాల సంరక్షణ అనేది ఒక ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటూ నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాల్సిన ఆవశ్యకతను ఆయన అధికారులకు వివరించారు. అధికంగా భూగర్భ జలాల వినియోగం అవుతున్న ప్రాంతాల్లో భవిష్యత్ అవసరాల దృష్ట్యా నియంత్రణ మీద దృష్టి సారించాలన్నారు. వర్షపు నీటిని ఒడిసి పట్టుకునేందుకు ఇంకుడుగుంతల నిర్మాణాన్ని ఇబ్బడిముబ్బడిగా ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భజలాల పరిమాణాలను నిరంతరం గుర్తించేందుకు వీలుగా 1,771 ఫిజోమీటర్లను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. భూగర్భ జలాల నియంత్రణతో గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్‌కు ఆదాయం లభిస్తుందన్నారు. పరిశ్రమలు, మైనింగ్ యూనిట్లు, అపార్టుమెంట్లు, ప్యాక్‌డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్లకు భూగర్భ జలాల వినియోగానికి అనుమతులు ఇవ్వడం ద్వారా వినియోగ చార్జీల రూపంలో రూ.25.80 కోట్లు గడించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. జాతీయ హైడ్రాలజి ప్రాజెక్టు అమలులో ఉత్తమ పనితీరు కనబరిచిన శాఖల్లో తెలంగాణ గ్రౌండ్ వాటర్ విభాగం ఒకటిగా గుర్తింపు పొందడం అభినందనీయమని, ఇకపై భూగర్భ జలాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు కృత్రిమ మేధస్సుతో మరిన్ని సత్ఫాలితాలు సాధించాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. అధిక వినియోగ ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణలు కఠినతరం చేయడంతోపాటు, వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను మెరుగుపరచాలని, భూగర్భ జలాల వినియోగంపై శాఖల మధ్య సమన్వయంతో నియంత్రణ వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. 2025లో రాష్ట్రంలో భూగర్భ జలాల రీచార్జ్ గణనీయంగా పెరిగిందని సమీక్షలో అధికారులు వెల్లడించారు. 2024లో 18.44 లక్షల హెక్టారు మీటర్లుగా ఉన్న వార్షిక రీచార్జ్ 2025లో 19.61 లక్షల హెక్టారు మీటర్లకు పెరిగి సుమారు 1.17 లక్షల హెక్టారు మీటర్ల వృద్ధి నమోదైంది. అయితే అదే సమయంలో భూగర్భ జలాల వినియోగం కూడా 8.45 లక్షల హెక్టారు మీటర్ల నుంచి 9.18 లక్షల హెక్టారు మీటర్లకు పెరిగినట్లు చెప్పారు. తాజా భూగర్భ జలాల అంచనాల్లో అధిక వినియోగ ప్రాంతాలుగా గుర్తించిన గ్రామాల వివరాలను జిల్లా యంత్రాంగానికి అధికారికంగా పంపించి, అక్కడ కొత్త బోర్‌వెల్ తవ్వకాలు, అదనపు భూగర్భ జలాల వినియోగాన్ని నియంత్రించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో భూగర్భ జలాల ఒత్తిడి అధికంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ జిల్లాలోనే ఎనిమిది మండలాలు అధిక వినియోగ కేటగిరీలో ఉన్నాయని వెల్లడించారు. ఇసుక తవ్వకాల అనుమతులకు ముందు భూగర్భ జలాల శాఖతో తప్పనిసరిగా సంప్రదింపులు జరపాల్సిన అవసరంపై కూడా సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,771 పైజోమీటర్లు, 352 పరిశీలనా బావులు, 921 కమాండ్ ఏరియా పరిశీలనా బావులు, 64 స్ట్రీమ్‌ఫ్లో చెక్‌పాయింట్ల ద్వారా భూగర్భ జలాల స్థాయిలను పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.ఎస్‌సీ, ఎస్‌టీ సబ్‌ప్లాన్ బోర్‌వెల్ కార్యక్రమాల పురోగతినీ సమీక్షించారు. సబ్‌ప్లాన్ కింద మంజూరైన బోర్‌వెల్‌లను తవ్వి లబ్ధిదారులకు అప్పగించినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు చేస్తున్న భూగర్భ జలాల సంరక్షణ కార్యక్రమాలను అధ్యయనం చేసి రాష్ట్రానికి అనువైన వినూత్న ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



