~ ఇష్టం వచ్చినట్లు ఓట్ల తొలగింపు అన్యాయం
~ తెలంగాణలో ‘సర్’ ప్రక్రియను పొడిగించాలి
– పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18: కేంద్రంలో బీజేపీ సర్కారు 2014లో కొలువుదీరిన నాటి నుంచి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదంటూ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఎన్నికల కమిషన్ కూడా బీజేపీకి అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ తరహాలో ఎన్నికల సంఘాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకుందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటర్ల ముసాయిదా జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నేపథ్యంలో గాంధీ భవన్ లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ కు ఇంకా సమయం ఇవ్వాలని, అర్హులైన అందరికీ ఓటు హక్కు కల్పించాలని ఈసీని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో రాష్ట్రంలో ఎన్నికల సంఘం నిర్దాక్షిణ్యంగా ఓట్లను తొలగించిందని మహేశ్ కుమార్ ఆరోపించారు. తాము ప్రతి ఓటు హక్కు కాపాడాలని చూస్తున్నామన్నారు. ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ తో చాలా నష్టం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈసీ ఉదాసీనంగా చూడటం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 3.38 కోట్ల ఓట్లు ఉన్నాయని గుర్తు చేశారు. ఎఎ సీబీడీల పేరుతో 22 శాతం ఓట్లు తొలగించారని చెప్పారు. ఓట్ల తొలగింపునకు ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని అన్నారు. పేదల ఓట్లు తొలగిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 35 వేల మంది బీఎల్ఎలని నియమించిందని, కానీ ఈసీ మాత్రం 13,100 మందిని ఇచ్చినట్లు చూపిస్తున్నదని చెప్పారు. సామాన్యుడి ఓటు తొలగించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఈ సందర్భంగా ఈసీపై నిప్పులు చెరిగారు. 2002లో ఓటు వేసి ఉండాలని కండిషన్ తో చాలామంది ఎన్యూమరేషన్ పామ్స్ ఇవ్వలేకపోయారని చెప్పారు. దీంతో వారిని కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తు న్నారని తెలిపారు. అన్ మ్యాపుడ్ ఓట్లు 32,37000 ఉన్నాయన్నారు. అలాగే 60,50,000 ఓట్లు సందేహంగా ఉన్నాయని చూపిస్తున్నారని చూపిస్తున్నారని పేర్కొన్నారు. దాంతో 92 లక్షల ఓట్లు ప్రశ్నార్ధకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. 1.60 కోట్ల ఓట్లు ఎందుకు ప్రశ్న గుర్తు పెట్టారో చెప్పాలంటూ ఈసీని మహేష్ డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





