– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
– పార్టీ కార్యాలయంలో ఘనంగా పాపన్న గౌడ్ జయంతి వేడుకలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 18 : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ బలహీనవర్గాల కోసం పోరాడిన గొప్ప ప్రజా యోధుడని, నాటి సామాజిక అన్యాయాలు, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, సామాన్యుల జీవితాల్లో మార్పు తేవడానికి కృషి చేసిన ధీరుడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు కొనియాడారు. సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు బీజేపీ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం రామచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ బహుజన వర్గాల నుంచి ఎదిగి ఆనాటి పాలక వ్యవస్థను, మొఘల్ ఆధిపత్యాన్ని సవాల్ చేసిన యోధుడిగా పాపన్న గౌడ్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. గోల్కొండ కోటపై తన ఆధిపత్యాన్ని స్థాపించి, వేలాదిమంది సైనికులతో బలమైన సైన్యాన్ని నిర్మించి, ప్రజల కోసం పోరాటం సాగించారని గుర్తు చేశారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి రాజుగా ఎదిగి బలహీనవర్గాలకు ఆత్మగౌరవాన్ని, ధైర్యాన్ని నింపిన చరిత్ర సర్దార్ సర్వాయి పాపన్నదని, అందుకే ఆయన నేటికీ రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఆయన అన్నారు. పాపన్న గౌడ్ జన్మస్థలం జనగామ జిల్లాలో ఖిలాషాపూర్ అని, ఆయన జీవితం, పోరాటం, నిర్మించిన కోటలు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాయని చెప్పారు. జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. జనగామ జిల్లాకు ఆయన పేరు పెడతామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని విమర్శించారు. బీసీ డిక్లరేషన్ అంశాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని రామచందర్‌రావు అన్నారు. జనగామ జిల్లాకు వెంటనే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జనగామ జిల్లాగా పేరు మార్చాలని డిమాండ్ చేశారు.
పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం : దత్తాత్రేయ
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వంటి మహానాయకులను స్మరించుకోవడం, వారి జయంతి సందర్భంగా నివాళులర్పించడం మనందరి బాధ్యత. సమాజం కోసం, దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల పోరాటాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. సాహసం, ధైర్యం, ఆత్మగౌరవంతో అన్యాయానికి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన పాపన్న గౌడ్ జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. పాపన్న గౌడ్ జ్ఞాపకార్థం ఆయన జన్మస్థలంలో తగిన స్మారక చిహ్నం ఏర్పాటుతోపాటు, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన జీవిత చరిత్ర, పోరాట గాథలను ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం చేసి భావితరాలకు ఆయనను ఆదర్శంగా నిలపాలన్నారు. కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్.గౌతం రావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





