– ఆర్థికంగా అనుకూలించకున్నా రైతు సంక్షేమానికి ప్రాధాన్యం
– మాట ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో కలిపాం
– హన్మకొండలో రైతు మేళాలో రెవెన్యూ మంత్రి పొంగులేటి
హనుమకొండ, ప్రజాతంత్ర, ఆగస్టు 10: రైతును రాజుగా చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా రైతు సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి రైతు మేళాను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాక£ర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కె.ఆర్.నాగరాజుతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ‘ధరణి’ని బంగాళాఖాతంలో వేస్తామని ఇచ్చిన మాట ప్రకారం బంగాళాఖాతంలో వేశాం.. రైతుల భూములకు శాశ్వత భద్రత కల్పించే భూభారతిని తీసుకొచ్చాం అని మంత్రి పొంగులేటి అన్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి వ్యవస్థతో రైతులు, భూ యజమానులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని, భూ హక్కుల విషయంలో ఏర్పడిన గందరగోళానికి శాశ్వత పరిష్కారం చూపించాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై పడిందని అన్నారు. రైతు భూమి రైతుదే అనే భరోసా కల్పించడమే భూభారతి ప్రధాన ఉద్దేశమని, భూ రికార్డులను ప్రక్షాళన చేసి పారదర్శకంగా హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. భూములపై స్పష్టమైన హక్కులు, రికార్డులు, మ్యాప్‌లు అందుబాటులో ఉంటే భవిష్యత్తులో భూ వివాదాలు, ఆక్రమణలకు అవకాశం ఉండదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాక రైతు, భూ యజమాని భవిష్యత్ తరాలకు భద్రత కల్పించాలనే చిత్తశుద్ధితో భూభారతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. గత పదేళ్లలో రైతులు, భూ యజమానులు ఎదుర్కొన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు సంక్షేమం విషయంలో మాటలు చెప్పడం కాదు.. బడ్జెట్‌లో నిధులు పెంచి రైతుకు ఆర్థిక భరోసా కల్పించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం రైతుల కోసం నెలకు సగటున రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం నెలకు సగటున రూ.5,250 కోట్లు వివిధ రూపాల్లో ఖర్చు చేస్తోందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని అంగీకరించి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. గతంలో గోదాములు, నిల్వ సామర్థ్యం పెంచకపోవడం వల్ల ఏర్పడిన లోటును తమ ప్రభుత్వం అధిగమిస్తోందన్నారు. రైతును రాజకీయాలకు ఉపయోగించుకోవడం కాదు.. రైతుకు అండగా నిలవడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి స్పష్టం చేశారు. వర్షాభావ పరిస్థితులు, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపికలో మార్పులు చేసుకోవాలని, తక్కువ నీటితో మంచి దిగుబడి, ఆదాయం అందించే పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. శాస్త్రవేత్తల సూచనలు ఒకవైపు, రైతుల అనుభవం మరోవైపు.. రెండింటినీ సమన్వయం చేసుకుంటే వ్యవసాయంలో మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చని మంత్రి పేర్కొన్నారు.
ప్రతీ పేద కుటుంబానికి దశల వారీగా ఇందిరమ్మ ఇళ్లు 
కమలాపూర్ : అర్హులైన ప్రతీ పేద కుటుంబానికి సొంతింటిని అందించి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి అన్నారు. పేదల సంక్షేమానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తోందని తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని మూడు గ్రామాల్లో సుమారు 394 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను లబ్దిదారులకు అందించే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని, పేదల కష్టాలు, బాధలు తీర్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. పేదల గుమ్మం వద్దకే సంక్షేమ పథకాలను చేర్చాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 35 వేల అసంపూర్తి ఇళ్లను పూర్తి చేసే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే మొదటి దశలో 4.5 లక్షల ఇళ్లను, రెండో దశలో 2.5 లక్షల ఇళ్లను మంజూరు చేసే ప్రక్రియ చేపట్టామని మంత్రి తెలిపారు. మూడో, నాలుగో దశల్లోనూ ఇళ్లను మంజూరు చేస్తామని, ప్రతిపేద కుటుంబానికి సొంతింటిని అందించే వరకు ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇళ్ల కేటాయింపులో ఎలాంటి పక్షపాతం చూపడం లేకుండా ముఖ్యమంత్రి నియోజకవర్గం, మంత్రుల నియోజకవర్గాలతోపాటు ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కూడా అర్హత ఆధారంగా ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. పేదోడు ఏ కులం, ఏ మతం, ఏ పార్టీకి చెందినవాడన్నది కాక అర్హతే ప్రామాణికంగా ఇళ్లను అందిస్తున్నామన్నారు. నిర్మాణం ఏ దశలో ఉందో పరిశీలించి నిబంధనల ప్రకారం తదుపరి విడత నిధులను విడుదల చేస్తామని తెలిపారు. కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా లబ్దిదారుల ఖాతాల్లోకి నిధులు చేరేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. లబ్దిదారుల కాలనీల్లో అన్ని మౌలిక వసతులను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో పేదలకు పరిమిత సంఖ్యలో ఇళ్లు అందించిన పరిస్థితికి భిన్నంగా ప్రజా ప్రభుత్వం దశలవారీగా సుమారు ఎనిమిది లక్షల ఇళ్లను ఇప్పటివరకు మంజూరు చేసి పేదలకు అందించే దిశగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్లు.. పేదల ముఖాల్లో సంతోషం చూడటమే అని స్పష్టం చేశారు. కమలాపూర్ మండలంలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను అందుకుంటున్న లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి అర్హులైన లబ్దిదారులకు రెండు పడక గదుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అంతకుముందు కమలాపూర్ మండలం గూడూరులో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లలో లబ్దిదారులతో మంత్రులు గృహ ప్రవేశం చేయించారు. ఇళ్లను సందర్శించి కల్పించిన వసతులను పరిశీలించారు. గత పాలకులు పునాదులు వేసి, గోడలు కట్టి ఇళ్లను అసంపూర్తిగా వదిలేసి పేదలు ఏళ్లతరబడి ఎదురు చూసేలా చేశారని పొంగులేటి విమర్శించారు. గత పాలకులు పేదలకు ఇళ్ల పేరుతో హామీలు, ప్రకటనలు ఇచ్చి చేతులు దులుపుకుంటే ప్రజా ప్రభుత్వం ఆ హామీలను ఆచరణలోకి తీసుకొచ్చి ఇళ్ల నిర్మించి లబ్దిదారుల చేతుల్లో పెడుతోందని అన్నారు. కార్యక్రమంలో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఝాన్సీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





