వరుణా.. కరుణ చూపవా

– నాగార్జున సాగర్‌లో మహా వరుణ యాగం
– పూర్ణాహుతిలో పాల్గొన్న ముఖ్యమంత్రి దంపతులు
– యాగ క్రతువు ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ దంపతులు
– విజయపురి సౌత్‌లో మార్మోగిన వేద ఘోష
– యాదాద్రి వేదపండితుల ఆధ్వర్యంలో ఒక్క రోజు యాగం సమాప్తం

నాగార్జునసాగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 10 : రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని దేవీదేవతలను వేడుకుంటూ ప్రభుత్వం నిర్వహించిన మహా వరుణయాగం వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో సంపూర్ణమైంది. నాగార్జునసాగర్‌ తీరంలోని విజయ విహార్ వద్ద కృష్ణా నది ఒడ్డున సోమవారం బ్రహ్మముహూర్తంలో మహా వరుణ యాగం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొని రుత్వికుల మార్గదర్శకత్వంలో సాయంత్రం ఈ పవిత్ర వరుణ యాగంలో పూర్ణాహుతి సమర్పించారు. దీంతో యాగం స‌మాప్త‌మైంది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా-గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, జలాశయాలు నిండాలని, రైతుల మోముల్లో ఆనందం వెల్లివిరియాలని సంకల్పిస్తూ వేకువ జామునే 108 మంది రుత్వికులు, వేదపండితులు, అర్చకులు ఈ మహా క్రతువులో భాగస్వాములయ్యారు. ఋత్వికులు గోపూజ, ఋష్యశృంగ పూజ, యాగశాల ప్రవేశం చేయించగా నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి యాగ క్రతువులో పాల్గొన్నారు. దివ్యమైన ఆధ్యాత్మిక వాతావరణంలో కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని ముఖ్యమంత్రి ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, సుభిక్షంగా జీవించాలన్న సంకల్పంతో ఈ వరుణ యాగం నిర్వహించామని తెలిపారు. ఒకవైపు శాస్త్రీయ అంచనాలు, ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు వెళ్తూనే వర్షం, వ్యవసాయం, ప్రకృతి, మానవ జీవితం పరస్పర సంబంధాన్ని ప్రతిబింబించే సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ప్రకృతి అనుగ్రహించాలని వేడుకున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఎల్ నినో కారణంగా రాష్ట్రంలో ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మహా వరుణయాగాన్ని నిర్వహించింది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలి.. కృష్ణా గోదావరి నదులు నిండుగా ప్రవహించాలి.. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లతోపాటు అన్ని ప్రాజెక్టులు నిండాలి.. రాష్ట్రంలోని ప్రతి చెరువు, ప్రతి కుంట జలకళతో కళకళలాడాలి.. భూగర్భ జలాలు పెరగాలి.. పంటలు పుష్కలంగా పండాలి.. రైతుల ముఖాల్లో చిరునవ్వులు కనిపించాలి.. రాష్ట్రం సస్యశ్యామలంగా, సుభిక్షంగా, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలి’ అని ముఖ్యమంత్రి వరుణ దేవుడిని ప్రార్థించారు. ఈ యాగంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, పి.సుదర్శన్ రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

క్రతువు ఆరంభించిన‌ మంత్రి ఉత్తమ్ దంపతులు 

సూర్యకిరణాలు కృష్ణమ్మ జలాలను తాకక ముందే నాగార్జునసాగర్ పరిసరాల్లో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ వేదమంత్రాలు మార్మోగాయి. వర్షాలకు అధిదేవత అయిన వరుణుడి కరుణ తెలంగాణపై ప్రసరించాలని కోరుతూ రుత్వికులు చేసిన మంత్రోచ్ఛారణలతో కృష్ణాతీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఋగ్, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలను వేదపండితులు పారాయణం చేస్తూ క్ర‌తువును ప్రారంభించారు. ప్రధాన యాగ క్రతువు కోసం 32మంది రుత్వికులు యాగశాలలో నిర్దేశించిన స్థానాల్లో ఆశీనులు కాగా మిగిలిన రుత్వికులు నిరంతర వేదపారాయణం, జపంలో పాల్గొన్నారు. చతుర్వేద పారాయణం అనంతరం 11 హోమకుండాల్లో అగ్నిని ప్రజ్వలింపజేసి వరుణ దేవుడిని ఆవాహన చేస్తూ హోమాలు నిర్వహించారు. ఆకాశం-జలం-భూమి-మానవాళి మధ్య సమతుల్యత నెలకొనాలని ఆకాంక్షిస్తూ వేదమంత్రాల నడుమ హోమద్రవ్యాలను అగ్నికి సమర్పించారు. ఒకవైపు కృష్ణమ్మ విశాల జలరాశి, మరోవైపు హోమకుండాల్లో ఎగసిపడుతున్న అగ్నిజ్వాలలు.. వాటి మధ్య ప్రతిధ్వనించిన వేదఘోషతో సాగర్ తీరం భక్తిభావంతో నిండిపోయింది.
విజయపురికి వరుణారాధనతో ప్రాచీన అనుబంధం 
వరుణ యాగం నిర్వహించిన ఈ ప్రాంతానికి చారిత్రక ప్రాధాన్యం కూడా ఉందని యాగ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ప్రాచీన కాలంలోనే వరుణారాధన జరిగినట్లు చారిత్రక ఆధారాలున్నాయని వేదపండితులు వివరించారు. వరుణుడితో సంబంధం ఉన్న ఒక ప్రాచీన ప్రతిమ ప్రస్తుతం నల్లగొండ మ్యూజియంలో భద్రపరిచి ఉందని పేర్కొన్నారు. ఈ చారిత్రక నేపథ్యం కారణంగా ప్రస్తుతం జరుగుతున్న మహా వరుణ యాగానికి మరింత ఆధ్యాత్మిక విశిష్టత చేకూరిందని తెలిపారు. శతాబ్దాల కిందట జలాల కోసం ఇదే నేలపై వినిపించిన వరుణ ప్రార్థన ఇప్పుడు మరోసారి కృష్ణమ్మ ఒడ్డున వేదఘోషగా ప్రతిధ్వనించడం యాగానికి ప్రత్యేకతను తీసుకొచ్చింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు ఆచార్య వెంకటాచార్యులు, నరేష్ శర్మ, వెంకట రామశర్మ, ఆదిత్య శర్మతోపాటు పలువురు వేదపండితులు యాగ క్రతువును నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా, సమానంగా వర్షాలు కురవాలని రుత్వికులు ప్రార్థించారు. అంతేకాక కృష్ణా, గోదావరి నదుల ఎగువ పరీవాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా విస్తారంగా వర్షాలు కురవాలని, తద్వారా రెండు మహానదులకు నిరంతర ప్రవాహాలు వచ్చి తెలంగాణ జలాశయాలు నిండాలని సంకల్పించారు. చెరువులు కళకళలాడాలని, భూగర్భ జలాలు పెరగాలని, ఖరీఫ్ పంటలకు నీటి కొరత రాకూడదని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని వరుణ దేవుడిని ప్రార్థించారు. ప్రస్తుత సీజన్‌లో వర్షపాతం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా లేకపోవడం, రానున్న రోజుల్లో వర్షాల తీరుపై నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ ఆధ్యాత్మిక ప్రార్థనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. ఒకవైపు ఇంజినీర్లు జలాశయాల్లో నీటి నిల్వలు, నదుల్లో ప్రవాహాలు, సాగునీటి అవసరాలను నిరంతరం పరిశీలిస్తుంటే మరోవైపు ఆ జలాలన్నింటికీ మూలమైన ఆకాశం వైపు విజయపురి నుంచి వేదమంత్రాలతో ప్రార్థనలు సాగాయి. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న మహా వరుణ యాగం రోజంతా కొనసాగింది. ఉదయం నుంచి విజయపురిలో కనిపించిన దృశ్యం అపూర్వం. భాష వేల ఏళ్లనాటిది కావచ్చు కానీ ఆ మంత్రాల వెనుక ఉన్న ఆకాంక్ష మాత్రం వరుణుడు కరుణించాలని, తెలంగాణ నేలపై సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా-గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, చెరువులు, జలాశయాలు నిండాలని, ఆకాశం వైపు చూసే అన్నదాత కళ్లలో ఆశ కనిపించాలన్నది మహా వరుణ యాగం సంకల్పమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.  యాగ క్రతువులో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, యాదగిరిగుట్ట ఈవో భవాని శంకర్, డిప్యూటీ ఈవో, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
—————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *