-మోదీ, అమిత్ షాల క్షమాపణలకు పట్టు
– గందరగోళం మధ్యే సభ ముందుకు పేపర్ లీకేజ్ సవరణ బిల్లు
– బిల్లును ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
- ఆందోళనతో సభను వాయిదా వేసిన స్పీకర్ ఓంబిర్లా
న్యూదిల్లీ, జూలై 27: పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం కొనసాగింది. విద్యార్థులపై కేసులు ఎత్తివేత మొదలు, లాఠీఛార్జికి నిరసనగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉభయ సభల్లో సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. గందరగోళం మధ్యే ప్రభుత్వం పేపర్ లీకేజీల సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశ పెట్టింది. దీనిపై మాట్లాడేందుకు స్పీకర్ ఆహ్వానించినా విపక్షాలు ముందుకు రాలేదు. నీట్-యూజీ సహా పలు పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలు, అక్రమాలపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమైన వేళ పరీక్షల భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగేసింది. ఇప్పటికే అమల్లో ఉన్న 2024 చట్టాన్ని మరింత కఠినతరం చేస్తూ యాంటీ పేపర్ లీక్(సవరణ) బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిని ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సభ ముందుంచారు. ఈ సవరణల ద్వారా నిందితులకు కఠిన శిక్ష విధించడం సహా వేగవంతమైన దర్యాప్తు, నిర్దిష్ట కాలవ్యవధిలో విచారణ పూర్తయ్యేలా నిబంధనలను రూపొందించారు. ఇకపై ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, రోజువారీ విచారణల తో కేసులను 90 రోజుల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం మూడు నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. కొత్త బిల్లులో దానిని గరిష్ఠంగా పదేళ్లకు పెంచారు. దీంతో పాటు ఇప్పటివరకు గరిష్ఠంగా రూ.10 లక్షలుగా ఉన్న జరిమానా.. నూతన చట్టంలో రూ.10 కోట్లకు పెరగనుంది. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ఇప్పటివరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టేవి. కానీ ఇకపై ఇలాంటి అక్రమాలపై స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్‌టీఎఫ్) ప్రత్యేక దర్యాప్తు చేపట్టనుంది. ఇప్పటివరకు దర్యాప్తు పూర్తి చేసేందుకు నిర్దిష్ట గడువు ఉండేది కాదు. కొత్త బిల్లు ప్రకారం.. రెండు నెలల్లోనే విచారణ పూర్తిచేయడం తప్పనిసరి కానుంది. పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు కానున్నాయి. రోజువారీ విచారణలో భాగంగా కేసులను మరింత వేగంగా పరిష్కరించనున్నారు. కొత్త బిల్లు ప్రకారం.. కేసు నమోదయ్యాక మూడు నెలల్లో తీర్పును వెలువరించాలి. హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకునేందుకు 30 రోజుల గడువు నిర్ణయించారు. అప్పీల్‌పై కూడా 90 రోజుల్లోనే తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది. పరీక్షల్లో పారదర్శకతను పెంచడం సహా ప్రశ్నపత్రాల లీకేజీలను పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల పలుమార్లు చెప్పారు. నయా టెక్నాలజీ ద్వారా పరీక్షల భద్రతను మరింత పటిష్ఠం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచడం సహా సాంకేతిక సంస్కరణలు, దీర్ఘకాలిక నిర్మాణాత్మక మార్పులపై సిఫార్సులు చేసేందుకు నందన్ నీలేకణి ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యులతో ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేసింది కేంద్రం. దీంతో పాటు కేంద్ర విద్యాశాఖ లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. నూతన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి పరీక్షల నిర్వహణలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పారు.కాగా.. పరీక్షల అక్రమాలపై కేంద్రం ఇప్పటికే పాలనాపరమైన చర్యలు ప్రారంభించింది. జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ)లో 47 మంది అధికారులను తొలగించినట్లు సమాచారం. అలాగే పరీక్షల నిర్వహణ విధానంలో మార్పులు, ఔట్‌సోర్సింగ్ వ్యవస్థలో సంస్కరణలు, సాంకేతిక భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ నేడు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనల నడుమే ఈ బిల్లు సభ ముందుకు వచ్చింది. అనంతరం లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఈ బిల్లుపై సూచనలను మధ్యాహ్నం ఒంటిగంటల వరకు సమర్పించవచ్చని స్పీకర్ ఓంబిర్లా సభ్యులకు తెలిపారు. అలా సవివర చర్చకు తగిన సమయం ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ బిల్లు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమైందని, దీనిపై చర్చ నుంచి సభ దృష్టి మళ్లకుండా చూడాలని విపక్షాలకు సూచించారు. మరోవైపు, ఈ బిల్లుపై ప్రతిపక్షాలు విమర్శలు వ్యక్తం చేస్తున్నాయి. ఇదంతా పైపై మెరుగు అని మండిపడ్డాయి. అదే సమయంలో ధర్మేంద్ర ప్రధాన్‌కు పార్లమెంట్‌లో ఘన స్వాగతం పలకడాన్ని తప్పుపట్టాయి. జులై 20న ‘చలో సంసద్’ పేరిట చేపట్టిన నిరసనల్లో విద్యార్థులపై లాఠీఛార్జి చేయడాన్ని ఖండించాయి. దానిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష నేతలు డిమాండ్ చేశారు. నీట్ సహా పలు పరీక్షల పేపర్‌లు లీక్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతోన్న సంగతి తెలిసిందే. దాంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే కేంద్రం తాజా బిల్లును తీసుకొచ్చింది.
——————–
విద్యార్థులకు క్షమాపణలు చెప్పాల్సిందే : రాహుల్ డిమాండ్
దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేత ధోరణిని అవలంబిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. విద్యార్థులపై కాల్పులు, లాఠీఛార్జీలు, కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన ఆగ్రహించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇందుకు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. బిహార్‌లో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు జరిపారని, వందలాదిమంది విద్యార్థులను అరెస్టు చేసి వారిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారనే వార్తలు వస్తున్నాయని రాహుల్ అన్నారు. విద్యార్థులపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని, వారిని విడుదల చేస్తామని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. హామీకి విరుద్ధంగా వారిపై క్రూరమైన దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. దిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్‌లు ప్రయోగించారని, బిహార్‌లో ఏకే-47తో కాల్పులు జరిగాయని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బిహార్, దిల్లీ.. రాష్ట్రం ఏదైనా విద్యార్థుల గొంతు నొక్కివేయాలనే ధోరణె కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిజాయతీ లేనిదని తాను గతంలోనే చెప్పానని, నిజమైన సంస్కరణలు తీసుకురావడం ఈ ప్రభుత్వానికి సాధ్యం కాదని రాహుల్ విమర్శించారు. ఇచ్చిన హామీల నుంచి వెనక్కి తగ్గడంతోపాటు విద్యార్థుల గొంతు అణచివేసేందుకు అన్ని మార్గాలను ఉపయోగిస్తోందని చెప్పారు. దేశంలోని విద్యార్థులందరికీ ప్రధాని మోదీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్నారు. విద్యార్థులపై కేసులు పెట్టడం కాకుండా, వారిపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





