సింగరేణిని భ్రష్టు పట్టించిన కేసీఆర్‌

‌- కాంగ్రెస్‌ ‌వచ్చినా మారని పరిస్థితి
– కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శలు

న్యూదిల్లీ, జూలై 27: గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం సింగరేణికి తీవ్ర నష్ట చేకూర్చిందని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సింగరేణి మెరుగుపడటం లేదని వ్యాఖ్యానించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం 49 శాతం, తెలంగాణ ప్రభుత్వం 51 శాతం వాటాతో సింగరేణి కొనసాగుతోందని తెలిపారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద బొగ్గు కంపెనీ సింగరేణి అని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. సింగరేణి నుంచి కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, ఎన్‌టీపీసీ కి బొగ్గు సరఫరా అవుతుందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్‌.. ‌సింగరేణికి తీరని ద్రోహం చేశారని కిషన్‌ ‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి ఆదాయానికి గత ప్రభుత్వం గండికొట్టిందని ఆరోపించారు. రాజకీయ వేదికలకు సింగరేణిని వాడుకున్నారంటూ బీఆర్‌ఎస్‌, ‌కేసీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌వింత ప్రవర్తన, మొండి వైఖరి వల్లే సింగరేణి సంస్థ తీవ్రంగా నష్టపోయిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2014లో సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా బొగ్గు గనులను పారదర్శకంగా వేలం పాట ద్వారా కేటాయించాలని ఆదేశించినప్పటికీ, గత బీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వేలం పాటల్లో పాల్గొనకుండా నిర్లక్ష్యం వహించిందన్నారు. నూతన బొగ్గు బ్లాకులు లభించక, ఆదాయ మార్గాలు మూసుకుపోయి సింగరేణి వెనుకబడిపోవడానికి కేసీఆర్‌ ‌ద్రోహమే కారణమని ఆరోపించారు. సంస్థను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని, గతంలో కేంద్రం ఇచ్చే రూ. 525 కోట్ల నిధులను సక్రమంగా వినియోగించుకోలేక పోయారని విమర్శించారు. 2015లోనే ఒడిశాలోని నైని కోల్‌ ‌బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించినప్పటికీ, నాటి కేసీఆర్‌ ‌ప్రభుత్వం ఒడిశా ముఖ్యమంత్రితో కనీసం మాట్లాడలేదని కిషన్‌ ‌రెడ్డి గుర్తుచేశారు. ఇటీవల ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాము చొరవ తీసుకుని నైని కోల్‌ ‌బ్లాక్‌కు సంబంధించి అవసరమైన అన్ని అనుమతులను ఇప్పించినట్లు వెల్లడించారు. అలాగే తాడిచర్ల-2 బ్లాక్‌ను కూడా కేంద్రం సింగరేణికి కేటాయించిందని, మణుగూరులోని ఒక బ్లాక్‌ను వేలంలో ఉంచామని తెలిపారు. అయితే ఈ వేలంలో సింగరేణికి పోటీగా తెలంగాణ జెన్కో పాల్గొనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. జెన్కో టెండర్‌ ‌నుంచి తప్పుకుని ఆ బ్లాకులు సింగరేణికి దక్కేలా ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై సీఎంకు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. ఈ మూడు కొత్త బ్లాకులు సింగరేణికి దక్కితే సుమారు 6,500 మందికి ఉద్యోగావకాశాలు రావడంతోపాటు 830 మిలియన్‌ ‌మెట్రిక్‌ ‌టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగి, దాదాపు రూ. 1.95 లక్షల కోట్ల టర్నోవర్‌తో సంస్థకు, రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పబ్లిక్‌ ‌పరీక్షల చట్టం గురించి మాట్లాడుతూ.. 2024లోనే ఎలాంటి డిమాండ్లు, నిరసనలు లేకపోయినా ముందస్తు జాగ్రత్తగా ఈ యాంటీ-పేపర్‌ ‌లీక్‌ ‌బిల్లును తీసుకొచ్చామని తెలిపారు. భవిష్యత్తులో ఎవరైనా పేపర్‌ ‌లీకేజీలకు పాల్పడాలంటే భయపడేలా, గుండెలాగిపోయే స్థాయిలో అత్యంత కఠినమైన నిబంధనలతో ఈ చట్టాన్ని రూపొందించామని చెప్పారు. విద్యా వ్యవస్థలో మార్పుల కోసం ప్రతిపక్ష కాంగ్రెస్‌ ‌కూడా స్వాగతిస్తుందని భావిస్తే, వారు చట్టాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం విచారకరమన్నారు. ఫలితాలు వచ్చిన వేళ నిరాశతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారిలో ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చివరగా, ఢిల్లీలోని జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద జరిగిన దాడి ఘటన తీవ్ర బాధాకరమని, దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణ జరుపుతోందని కిషన్‌ ‌రెడ్డి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *