హైడ్రా కమిషనర్‌ను తొలగించండి : హైకోర్టు

– పదేపదే కోర్టు ఉల్లంఘనలకు పాల్పడడంపై ఆగ్రహం
– ఇలాంటి వ్యక్తి అదే పోస్టులో కొనసాగడం సరికాదు
– లోతుకుంట భూముల వ్యవహారంపై హైకోర్టు విచారణ
– కోర్టులంటే గౌరవం ఉందంటూ క్షమాపణలు కోరిన రంగనాథ్‌

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 27: హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌కు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన్ను హైడ్రా కమిషనర్‌ ‌పోస్టు నుంచి తప్పించాలని సీఎస్‌ను ఆదేశించింది. రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని ఉన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టులను ఆశ్రయించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని పేర్కొంది. ఉన్నతాధికారిగా ఉన్న రంగనాథ్‌.. ‌కోర్టు ఉత్తర్వులను ఇన్నిసార్లు ధిక్కరించడం సరికాదని ఆక్షేపించింది. మల్కాజిగిరి పరిధిలోని లోతుకుంట భూములకు సంబంధించి గతంలో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను హైడ్రా ఉల్లంఘించిందంటూ శాంతా శ్రీరాం కన్‌‌స్ట్రక్షన్స్ ‌ప్రైవేట్‌ ‌లిమిటెడ్‌ ‌కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ‌దాఖలు చేసింది. హైకోర్టు ఆదేశాలు ఉన్నా.. ఫెన్సింగ్‌ను హైడ్రా సిబ్బంది తొలగించారని పేర్కొంది. ఒకే పిటిషన్‌కు సంబంధించి పలుమార్లు కోర్టు ఉత్తర్వులను హైడ్రా కమిషనర్‌ ‌ధిక్కరించడం నేరమని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోర్టుకు ఆయన హాజరుకావాలని ఆదేశించింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ ‌జనరల్‌ ‌జోక్యం చేసుకుని దీనిపై పూర్తిస్థాయిలో అఫిడవిట్‌ ‌దాఖలు చేస్తామని తెలిపారు. అఫిడవిట్‌లో రంగనాథ్‌ ‌క్షమాపణ కోరారు. కోర్టుల పట్ల పూర్తిస్థాయి నమ్మకముందని పేర్కొన్నారు. లోతుకుంట సర్వే నంబర్‌ 1, 2‌లో ఉన్న 40 ఎకరాల భూమిలోకి వెళ్లలేదని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. రంగనాథ్‌పై 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని, దీనికి కారణమేంటని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ఈ క్రమంలో రంగనాథ్‌ను తొలగించాలని పేర్కొంటూ.. ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ఆదేశించింది. లోతుకుంట భూముల వ్యవహారానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసు విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైడ్రా కమిషనర్‌ ‌పదవి నుంచి రంగనాథ్‌ను తొలగించాలంటూ.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంక్‌ ‌స్థానంలో ఉన్న ఉన్నతాధికారి.. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం ఏ మాత్రం సమంజసం కాదని ధర్మాసనం పేర్కొంది. అర్హత కలిగిన అధికారిని హైడ్రా కమిషనర్‌గా నియమించాలని హైకోర్టు సూచించింది. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. లోతుకుంట ప్రైవేటు భూములపై హైడ్రా జోక్యాన్ని తప్పుబట్టింది. హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ ‌కొనసాగితే రూల్‌ ఆఫ్‌ ‌లా తప్పుతుందని పేర్కొంది. ఇన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్న అధికారిని ఇంకా అదే పోస్టులో కొనసాగించడం సరికాదని.. రంగనాథ్‌ను తొలగించడం తప్ప మరో ఆప్షన్‌ ‌లేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టుకు హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ ‌క్షమాపణలు తెలిపారు. కోర్టులు, న్యాయ వ్యవస్థపై తనకు ఎంతో నమ్మకం ఉందని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అలాగే లోతుకుంట సర్వే నంబర్లు 1, 2 పరిధిలోని 40 ఎకరాల భూమిలోకి హైడ్రా బృందం వెళ్లలేదని కోర్టుకు వివరించారు. ఈ విషయంలో పిటిషనర్‌ అసత్య ఆరోపణలు చేస్తున్నారని కూడా రంగనాథ్‌ ‌తన అఫిడవిట్‌లో తెలిపారు.

రేవంత్‌ ‌ప్రభుత్వానికి చెంపపెట్టు : బీఆర్‌ఎస్‌ ‌నేత ఆర్‌ఎస్‌ ‌

‌వరుస వివాదాల నేపథ్యంలో హడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌ను తొలగించాలని చీఫ్‌ ‌సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంపై బీఆర్‌ఎస్‌ ‌నేత ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌  ‌తీవ్రంగా స్పందించారు. ఇది ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. రంగనాథ్‌ ‌దున్న 63 కోర్టు ధిక్కరణలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం ఇన్ని ఉల్లంఘలనకు పాల్పడుతున్న అధికారిని ఇంకా కొనసాగిస్తే రూల్‌ ఆఫ్‌ ‌లా అదుపు తప్పుతుందని, రంగనాథ్‌ ‌స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని హైకోర్టు తెలిపిందన్నారు. హైకోర్టు తీర్పు రేవంత్‌ ‌రెడ్డికి చెంపదెబ్బ వంటిదన్నారు. రేవంత్‌ ‌రెడ్డికి ఏ మాత్రం పరిపాలించే నైతిక అర్హత లేదని ఇవాళ హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా తేలిపోయిందన్నారు.. లక్షమంది పోలీసులున్న ఈ రాష్ట్రంలో హోంమంత్రి అయిన సిఎం హైకోర్టు స్థానిక పోలీసులెవరూ కూడా తెలంగాణ ప్రజల ధన, మాన, ప్రాణాలను కాపాడలేరు. అందుకు ఆర్మీ అధికారులను ఆదేశించింది అంటే అసలు మీకు ఇక నైతిక హక్కు ఎక్కుడుందని ప్రశ్నించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం. విధ్వంసకర ప్రభుత్వం. లగచర్లలో, వెలుగుమట్లలో నాశనం చేశారు. సున్నం చెరువు పేరుతో, బహదూర్‌ ‌గూడ పేరుతో, లోతుకుంటలో ఎక్కడ చూసినా విధ్వంసమే. ఆ విధ్వంసం చేస్తూనే మరోవైపు పేదల భూములను సొంత సోదరులు, కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకులంతా కబ్జాలు చేస్తున్నారని ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌మండిపడ్డారు. హైడ్రాను అడ్డం పెట్టుకుని పొంగులేటి శ్రీనివాస్‌ ‌రెడ్డి భూభారతి పోర్టల్‌ను తీసుకొని దొడ్డిదారిన దాదాపు 22 వేల ఎకరాల భూముల హక్కులను రాత్రికి రాత్రే ఎమ్మార్వో, ఆర్డీవోల సంతకాలు లేకుండా బదలాయించారని ఆరోపించారు. అందుకే తాను గతంలో రాష్ట్ర‌ ప్రభుత్వంలో పనిచేసిన అధికారిగా, సోదరుడిగా, ప్రభుత్వ అధికారులకు చెబుతున్నా దయచేసి రాజ్యాంగాన్ని పాటించండి. చట్టాన్ని పాటించండి.. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను అతిక్రమించకండి అని ఆర్‌ఎస్‌ ‌కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *