– జారీ చేసిన అగ్నిమాపక, విపత్తుల స్పందన శాఖ డీజీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29 : రాష్ట్రంలోని డేటా సెంటర్లకు సంబంధించి ప్రత్యేక అగ్నిమాపక, ప్రాణరక్షణ భద్రతా మార్గదర్శకాలు జారీ అయ్యాయి. తాత్కాలిక అగ్నిమాపక నిరభ్యంతర ధ్రువపత్రాల (ప్రొవిజనల్ ఫైర్ ఎనఓసీ) దరఖాస్తుల పరిశీలన, ప్రాసెసింగ్ కోసం నిర్దిష్ట భద్రతా నిబంధనలను సూచిస్తూ ఈనెల 28న సర్క్యులర్ మెమోరాండం ఆర్‌సీ నంబర్ 3455/ఎంఎస్‌బీ/2026 జారీ చేశారు. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్), వ్యాపార కార్యకలాపాల వేగవంతమైన నిర్వహణను (స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) ప్రోత్సహించనున్నాయి. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులు, ఆచరణాత్మక అగ్నిమాపక భద్రతా అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఫైర్ ఎనఓసీ దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదపడతాయి. డేటా సెంటర్లలో సర్వర్లు, డేటా నిల్వ వ్యవస్థలు, నెట్‌వర్కింగ్ పరికరాలు, ఇతర కీలక మౌలిక సదుపాయాలు ఉంటాయి. వీటికి నిరంతర విద్యుత్ సరఫరా, శీతలీకరణ, సమాచార వ్యవస్థలు అవసరం. యూపీఎస్ వ్యవస్థలు, బ్యాటరీలు, ట్రాన్స్‌ఫార్మర్లు, జనరేటర్లు, ఇంధన నిల్వ కేంద్రాలు, విస్తృతమైన కేబుల్ నెట్‌వర్క్‌లు ఉండటం వల్ల ప్రత్యేక అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. అందువల్ల ప్రత్యేక నివారణ, రక్షణ చర్యలు అవసరమని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అగ్నిప్రమాదాలను గుర్తించే వ్యవస్థలు, అలారం వ్యవస్థలు, తగిన అగ్నిమాపక వ్యవస్థలు, అగ్ని వ్యాప్తిని నిరోధించే విభజనలు, అగ్నిమాపక సిబ్బంది వినియోగించే ప్రత్యేక మెట్లు, వెట్ రైజర్లు, అత్యవసర సమయంలో సురక్షితంగా వేచి ఉండే ప్రదేశాలు, తగినంత అగ్నిమాపక నీటి నిల్వలు, పంపింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలు నిర్దేశిస్తున్నాయి. పరిపాలనా విభాగాల్లో ఆటోమేటిక్ స్ప్రింక్లర్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. సాంకేతిక విభాగాల్లో సమర్థవంతమైన అగ్నిమాపక రక్షణ కోసం వాటర్ మిస్ట్ లేదా క్లీన్ ఏజెంట్ గ్యాస్ ఆధారిత అగ్నిమాపక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. బ్యాటరీ గదులు, యూపీఎస్ గదులు, ట్రాన్స్‌ఫార్మర్ గదులు, స్విచ్‌గేర్ గదులు, ఇతర కీలక విద్యుత్ వ్యవస్థల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. సమగ్ర అగ్ని ప్రమాద ముప్పు అంచనా, తగిన వెంటిలేషన్, అగ్నిని తట్టుకునే విభజనలు, అత్యవసర సమయంలో వ్యవస్థలను నిలిపివేసే ఏర్పాట్లు, ఇంధన నిల్వలు, ఇతర ప్రమాదకర ప్రాంతాలకు తగిన రక్షణ చర్యలు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. సాధారణ వాణిజ్య భవనాలతో పోలిస్తే డేటా సెంటర్లలో ఉండే వ్యక్తుల సంఖ్య తక్కువగా ఉంటుందనే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఈ మార్గదర్శకాలను రూపొందించారు. అగ్నిప్రమాదాలను గుర్తించే, నివారించే వ్యవస్థలను సంబంధిత భవన నిర్వహణ వ్యవస్థలు, అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థలతో అనుసంధానించాలని సర్క్యులర్‌లో స్పష్టం చేశారు. డేటా హాళ్లు, ఇతర కీలక ప్రాంతాల్లో అట్టపెట్టెలు, ప్యాకింగ్ సామగ్రి, చెక్క ప్యాలెట్లు, వ్యర్థాలు వంటి సులభంగా మండే పదార్థాలు పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలి. బేస్‌మెంట్ అంతస్తులు, కీలక మౌలిక సదుపాయాల రక్షణకు సంబంధించి ప్రత్యేక నిబంధనలను కూడా నిర్దేశించారు. సర్క్యులర్‌లో పేర్కొన్న నిబంధనలు, ఆమోదించిన అగ్నిమాపక భద్రతా రూపకల్పనకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని దరఖాస్తులను పరిశీలించే అధికారులు తప్పనిసరిగా ధ్రువీకరించాలని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ ఆదేశించారు. ఈ మార్గదర్శకాలు నవంబర్ 6 నుంచి సమర్పించే తాత్కాలిక ఫైర్ ఎనఓసీ దరఖాస్తులకు వర్తిస్తాయి. ఈ మార్గదర్శకాలను తెలంగాణ అగ్నిమాపక శాఖ అధికారిక వెబ్‌సైట్ www.fire.telangana.gov.inలో పొందవచ్చు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




